Fireworks industry
-
డీజే, బాణాసంచా సౌండ్స్ పై కీలక నిర్ణయం
-
బాణాసంచాపై సంపూర్ణ నిషేధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండబోదని, గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉంటుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాళీ పూజ, దీపావళి, క్రిస్మస్, కొత్త ఏడాది వేడుకలు ఇతరత్రా పండుగల సమయంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. గౌతమ్ రాయ్, సుదీప్త భౌమ్నిక్ తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. బాణాసంచా డీలర్ల తరఫు న్యాయవాది సిద్ధార్ధ భట్నాగర్ వాదనలు వినిపిస్తూ.. గ్రీన్ కాకర్స్‌కు అనుమతిస్తూ 2020లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బాణాసంచాపై పూర్తి నిషేధం లేదని, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి హానికలిగించే వాటినే నిషేధిస్తున్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ధర్మాసనానికి వివరించారు. గ్రీన్ కాకర్స్పై నిషేధం లేదని, సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలు అమలు చేస్తున్నామని భట్నాగర్ తెలిపారు. ఇటీవలే నిషేధిత బేరియంతో బాణాసంచా తయారుచేస్తున్న పలు ఉత్పత్తి సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. జులై, అక్టోబరుల్లో వేర్వేరు పిటిషన్ల విచారణ సందర్భంగా బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండదని, గ్రీన్‌కాకర్స్‌ను అనుమతిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెల్సిందే. -
బాణాసంచాలో విషపూరిత రసాయనాలు!
న్యూఢిల్లీ: బాణాసంచా తయారీలో విషపూరిత రసాయన పదార్ధాలు వాడడం చాలా ప్రమాదకరమని సీబీఐ నివేదిక వెల్లడించిందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. బాణాసంచా తయారీలో బేరియం వాడకం, బాణాసంచాపై జరిపే ముద్రణ(లేబిలింగ్)లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. హిందుస్తాన్ ఫైర్వర్క్స్, స్టాండర్డ్ ఫైర్వర్క్స్ సంస్థలు పెద్ద స్థాయిలో బేరియంను కొనుగోలు చేసినట్లు తెలిసిందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఉత్పత్తిదారులకు మరో అవకాశం ఇవ్వదలిచామని, సీబీఐ నివేదికను వారికి అందించాలని కోర్టు సూచించింది. మనదేశంలో ఎక్కడోఒకచోట ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటుందని, ఈ కారణంతో బాణాసంచాపై విచారణ నిలిపివేయలేమని, ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిశీలించాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
చీకటి వెలుగుల శివకాశి
దీపావళిలోని వెలుగునీడలు జీవితానికి సంకేతంగా భావిస్తారు. అందుకనే చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి అన్నారో సినీకవి..! కటిక చీకట్లకి కొలమానం అమావాస్య అయితే.. వెలుగుల వెల్లువకు పతాక సన్నివేశంగా దీపావళిని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఒకేసారి కలగలిపి మనముందు ప్రజ్వలించే పండుగే దీపావళి. సుఖదుఃఖాలకు, జయాపజయాలకు, మంచిచెడులకు నిండైన ప్రతీకే దీపావళి. జీవితంలో తారసిల్లే మంచిచెడులను కలగలిపి దీపావళి సరంజామాతో పోల్చిచూస్తారు. అందులోనూ దీపావళి అందరి పండుగ. దీపావళి అంటే మనందరికీ ఎంత సరదానో..! మరి ఆ సరదా వెనుకు దాగి ఉన్న నిజాల వెలుగులు కూడా తెలుసుకోవాలి కదా..! జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది. గువ్వలా బతకమని తారాజువ్వ చెబుతుంది. నిప్పుతోటి చెలగాటం వల్ల ముప్పుతప్పదని తానందుకు ప్రత్యక్ష సాక్ష్యమని టపాకాయ చెబుతుంది'. ఇలా తరచి తరచి చూస్తే దీపావళి నిండా జీవితానికి సంబంధించిన ఫిలాసఫీ చాలానే ఉంటుంది. తమస్సు నుంచి ఉషస్సుకు దీపావళి పండుగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది టపాకాయలు. ఆ టపాకాయలకు దేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ప్రాంతం శివకాశి. ఇక్కడ చాలా తక్కువ ధరకు మనకు కావాల్సినన్ని దొరుకుతాయి. మనకు చౌకగా లభ్యమయ్యేవంటే మక్కువ ఎక్కువ. ప్రపంచ మార్కెట్లో శివకాశి బాణాసంచాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వివరాల్లోకెళ్తే.. 1960వ సంవత్సరం దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతోంది. అందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే శివకాశిలో ఉన్న నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం పొందకుండా అభివృద్ది చెందాలని నిర్ణయించుకున్నారు. అగ్గిపుల్లలు, బాణాసంచా, ముద్రణ, ఇతర పరిశ్రమల్లో రాణించారు. ఈ విషయాలు తెలుసుకున్న అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ ఈ నగరానికి కుట్టి జపాన్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇది మినీ జపాన్‌గా ప్రశస్తి సాధించింది. కేవలం నెహ్రూ పేరు పెట్టారనే కాదు కానీ.. ఇది నిజంగా మినీ జపానే..! ఎందుకంటే ఇక్కడి వారందరూ కుటీర పరిశ్రమలపై ఆధారపడే జీవనం సాగిస్తారు. ఇక్కడ పనిచేసే కార్మికుల్లో కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం, నాణ్యత, కలిసికట్టుతనం వంటి లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దీపావళి సమీపించే కొద్దీ ఇక్కడ పనిచేసేవారు ఎక్కువ శ్రమిస్తారు. రాత్రింబవళ్లు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ సమయాల్లో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంది. నేడు ఈ ప్రాంతంలో నిరుద్యోగం కనిపించదు. 100శాతం ఉపాధి ఈ పట్టణం సొంతం. దాదాపు 3లక్షల మంది కార్మికులు బాణాసంచా, అగ్గిపుల్లల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. శివకాశి శివారులోని 15కు పైగా గ్రామాల్లో ఈ పరిశ్రమలు ఉండగా తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు తదితర జిల్లాల నుంచి వేలాదిమంది కార్మికులు వలసలు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. శివకాశి స్వరూపం రాష్ట్రం - తమిళనాడు జిల్లా -విదూర్నగర్ పట్టణ విస్తీర్ణం - 343.76 జనాభా - 2.6 లక్షలు అక్షరాస్యత - 77శాతం పరిశ్రమలు - 8,000 బాణాసంచా వ్యాపారం - ఏటా దాదాపు 2వేల కోట్లు వెలుగుకు మార్గం శివకాశిలో తయారైన బాణాసంచా దీపావళి రోజున దేశమంతటా వెలుగులు విరజిమ్ముతాయి. ముల్లోకాలలోని చీకట్లను తొలగించి దీపపు కాంతి వెలుగు ప్రసరించడానికి కారణమయ్యే అగ్గిపుల్లలు కూడా 70శాతం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే పర్వం సంధ్యా దీపం నమోస్తుతే జ్ఞానానికి, ఆనందానికి, భయరాహిత్యానికి మారుపేరుగా నిలిచే దీపానికి నమస్కరించడం భారతీయ సంప్రదాయం. ఎప్పుడు ఏం జరుగుతుందో..! పుష్కరకాలంగా ఈ ప్రాంతంలో అనేక ఘోరప్రమాదాలు జరిగాయి. దీపావళి సమీపించే కొద్దీ ప్రమాదాలు అధికమవుతూ ఉంటాయి. పండుగ సమయంలో డిమాండ్ రీత్యా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఇక్కడ అనుమతి పొందిన 700 బాణాసంచా తయారీ పరిశ్రమల్లో 2లక్షల మంది కార్మికులు, అనుమతుల్లేని పరిశ్రమల్లో మరో లక్షమంది దాకా పనిచేస్తుంటారు. దేశానికి అవసరమైన బాణాసంచాలు, అగ్గిపుల్లలు 80శాతం ఇక్కడే తయారవుతాయి. ఇక్కడి కార్మికులు పరిశ్రమల్లో రసాయనాల నుంచి తలెత్తే రుగ్మతల నుంచి బయటపడడానికి ఎక్కవగా అరటిపండ్లు తింటుంటారు. ఇక్కడి పొడి వాతావరణం బాణాసంచా తయారీకి అనుకూలం. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతుంటాయి. భారీవర్షాలు, నదులు, పచ్చని పంటపొలాలు ఇక్కడ పెద్దగా కనిపించవు. దీపావళి రోజున చీకట్లు తొలగించి వెలుగులు విరజిమ్మాల్సిన బాణసంచా ఇక్కడి అభాగ్యుల జీవితాల్లో చీకట్లను నింపిన సందర్భాలెన్నో..! -
దీపాల చీకట్లలో శివకాశీలు
సంతోషాల వెలుగుల వెనుక లక్షల చీకటి కథలున్నాయి. పండుగల మతాబుల మాటున ఎన్నో కన్నీటి వ్యథలున్నాయి. అవే.. శివకాశి బాణసంచా తయారీ వెనుక కన్నీటి గాథలు. దీపావళి పండుగొస్తుందంటే.. ఆంక్షలు, అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాలు శివకాశిలో జీవనంపై అధిక ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. శివకాశీల జీవనంపై, దక్షిణ కాశిగా పేరొందిన శివకాశి చరిత్రపై ఫోకస్. మనం ఏడాదికోసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం వారు ఏడాదంతా కష్టపడతారు. అదే వారి జీవనాధారం.. అదే వారి జీవితం. తమిళనాడు రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివకాశి పట్టణంలోనే బాణసంచా కర్మాగారాలు నెలకొనడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. దాదాపు వందేళ్ల బాణసంచా తయారీ కర్మాగారాల చరిత్ర కలిగిన శివకాశికి కుట్టి (చిన్న) జపాన్ అని పేరు ఉంది. 20వ శతాబ్దంలో ఇక్కడ 30 మందితో ప్రారంభమైన టపాసుల తయారీ కేంద్రం, 1100 భారీ కర్మాగారాలు, 8 వేల కుటీర పరిశ్రమల స్థాయికి ఎదిగింది. నేటికి దాదాపు ఆరులక్షల మందికి ఉపాధిని అందించింది. ఇదే ప్రాంతానికి చెందిన షణ్ముగ అయ్యర్ నాడార్ 1908లో 30 మందితో చిన్నపాటి బాణసంచా తయారు చేసే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. అది రెండేళ్లలో 12 యూనిట్లు అయ్యేలా అభివృద్ధి చెందింది. దీనిని చూసి కొందరు ఔత్సాహికులు ఇదే వ్యాపారంగా మొదలుపెట్టారు. అలా వేలాదిగా కర్మాగారాలు, కుటీర పరిశ్రమలు లక్షలాదిగా ఉపాధి పొందే అవకాశం కలగటం ఈ ప్రాంతం దినదినాభివృద్ధితో ప్రపంచంలోనే బాణసంచా తయారీలో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడే ఎందుకు ఏర్పడ్డాయి? శివకాశి పూర్తిగా మెట్టప్రాంతం. సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి నిల్వలు తక్కువ. సారవంతమైన భూమి కూడా కాదు. భూమిలో రసాయనాలు కలుస్తుండటంతో ఆ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. నదులు, సాగునీరు లేకపోవటంతో చేతి వృత్తులు, ఉపాధి పనులు తప్ప మరో మార్గం లేదు. అందుకే ఇక్కడ ప్రజలు బతుకు తెరువు కోసం ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్లేవారు. దీంతో షణ్ముగ నాడార్ టపాసుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించటంతో ప్రజలు వీటిని తయారుచేసుకుంటూ జీవనం సాగించడం ప్రారంభించారు. ఒకప్పుడు జీవనోపాధి కోసం బయటి ప్రాంతాలకు వలస వెళ్లేవారు, ఇప్పుడు బయటి ప్రాంతాల నుండి ఇక్కడి ఉపాధికి వచ్చే స్థాయికి ఎదిగారు. దీంతో శివకాశి చుట్టూ పుట్టగొడుగుల్లా బాణసంచా కర్మాగారాలు పుట్టుకొచ్చాయి. ప్రమాదాలు, ఆంక్షల దృష్ట్యా కర్మాగారాలు విశాలంగా ఊర్లకు దూరంగా ఏర్పాటు చేశారు. అయితే ఏటా ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షల వల్ల వ్యాపారం మూతపడి ఆందోళనకరంగా మారుతోంది. గతేడాది 5 వేల కోట్ల నుండి 6 వేల కోట్ల రూపాయల మేరకు జరిగిన వ్యాపారం, ఈ ఏడాది ఆంక్షల కారణంగా 3 నుండి 4 వేల కోట్లకు తగ్గుముఖం పట్టడం శివకాశి బాణసంచా తయారీదారులపై ప్రభావం చూపుతోంది. ఇక్కడి నుండి ఏటా 80 నుండి 90 శాతం బాణసంచా దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతుంది. జపాన్, చైనాల తర్వాత ఇంత భారీ ఎగుమతులు జరుగుతుండటం శివకాశి ఘనత. ఈ ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు తయారీదారులు, వ్యాపారం సగానికి పడిపోయేందుకు కారణమైంది. ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. వెలుగు చాటున చీకటి! శివకాశిలో బాణసంచానే వృత్తిగా జీవిస్తున్న లక్షలాది ప్రజలు ఈ పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నారు. ప్రమాదమని తెలిసినా అదే జీవితంగా జీవిస్తారు. వారికదే ఆధారం. అవి లేకపోతే పస్తులుండాల్సిందే. ఏడాదికి పది నెలలు వీటిపైనే ఆధారపడతారు. ప్రమాదమని భయపడితే బతికే మార్గమే లేదు. భయంతో శివకాశిని వదిలేసిన వారెందరో ఉండొచ్చు కానీ ఇదే జీవితం అని నమ్మి వృత్తే దైవంగా భావించేవారే ఎక్కువ. మిగిలిన పనులకన్నా ఇక్కడ పనికి కూలి కాస్తంత అధికంగా దొరకటమే కారణం. జీవితమంతా పోరాటమే... చస్తామనే భయం కన్నా... బతికినన్నాళ్లూ సంతోషంగా కన్నీళ్లను దిగమింగి బతకాలనుకుంటారు. ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. పట్టించుకోవాల్సింది ప్రభుత్వాలు. అధికారులు.. నిబంధనలు, నియమాలు.. ఆంక్షలు సక్రమంగా ప్రమాదాలు ఉండవనేవి అక్కడి కార్మికుల మాట. ఒకవేళ ఆంక్షల పేరుతో పరిశ్రమలు మూతపడితే మళ్లీ వీరి జీవితాలు రోడ్డునపడతాయి. అందుకే వీటిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న కూలీలు, కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఉపాధి కల్పించటానికి ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది లక్షల మంది! ప్రభుత్వాలు కూడా ఈ పరిశ్రమలు మూతపడకుండా కేంద్రాలుగా కొన్ని ఆంక్షలతో నడపాలి. ఏటా పండుగ వెలుగులను అందించే శివకాశీల జీవితాలు వెలుగులోకి రావాలని కోరుకుందాం.. పండుగ వెలుగులను అందరికీ పంచుదాం.. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి టీవీ, చెన్నై -
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
తుని: తూర్పు గోదావరి జిల్లా తునిలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. స్తానిక ఇసుకలపేటలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో రమేష్, దుర్గ, కాకిరెడ్డి అనే వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ తుని ఆస్పత్రికి తరలించారు. రేకుల షెడ్డులో బాణాసంచా తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో షెడ్డులో తయారుచేసి నిల్వఉంచిన బాణసంచాకు మంటలు అంటుకుని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్ళి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బాణసంచా తయారీ కేంద్రం యజమాని విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సీహెచ్ రమణ అని, దుకాణానికి లైసెన్సు ఉందని అధికారులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఆర్టీవో విశ్వేశ్వరరావు, డీఎస్పీ రాజశేఖర్ పరిశీలించి విచారణ చేపట్టారు. -
మెక్సికోలో బాణసంచా పేలుడు
• 31 మంది మృతి.. • 72 మందికి గాయాలు టుల్టెపెక్(మెక్సికో): క్రిస్మస్, నూతన సంవత్సర సంబరాల కోసం సన్నద్ధమవుతున్న మెక్సికోలో పెను విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఇక్కడి అతిపెద్ద బాణసంచా మార్కెట్లో భారీ పేలుళ్లు సంభవించడంతో 31 మంది మృతి చెందగా, 72 మంది గాయపడ్డారు. రానున్న క్రిస్మస్ నేపథ్యంలో మెక్సికో సిటీ శివారు ప్రాంతమైన టుల్టెపెక్లోని బాణసంచా మార్కెట్‌కు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.50 నుంచి ఒక్కసారిగా పేలుళ్లు మొదలయ్యాయి. దీంతో మార్కెట్లోని 300 బాణాసంచా దుకాణాలతో పాటు సమీపంలోని ఇళ్లు, వాహనాలు, ఇతరత్రా ఆస్తులు కాలి బూడిదయ్యాయి. అక్కడి మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలకుపైగా శ్రమించారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 26 మంది మృతి చెందగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చనిపోయారని అధికారులు తెలిపారు. దాదాపు 72 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో చనిపోయిన వారిని గుర్తించడం కష్టంగా ఉందని, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని మెక్సికో గవర్నర్ ఎరువియల్ అవిలా చెప్పారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. -
మెక్సికోలో పెను విషాదం
-
మెక్సికోలో బాణసంచా పేలుడు; 26 మంది మృతి
-
బతుకు బుగ్గి
► దినదిన గండంగా బతుకులు ► మినీ జపాన్‌లో పేలుళ్లతో కలవరం ► కన్నీటి మడుగులో వందలాది కుటుంబాలు ►జీవితాల్ని మింగేస్తున్న బాణసంచా పరిశ్రమ తమిళనాట బాణ సంచాల తయారీలో ప్రసిద్ధి చెందిన జిల్లా, ‘విరుదునగర్’ ఈ జిల్లాలో ఉన్న శివకాశి పట్టణాన్ని మినీ జపాన్‌గా పిలుస్తున్నారు. ఈ పట్టణ, శివారుల్లోని గ్రామాల ప్రజల ప్రధాన జీవనాధారం బాణ సంచాల తయారీ. కుటీర పరిశ్రమల తరహాలో ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ బాణసంచాల్ని తయారు చేస్తూ ఉండే వారు. ఇది నిత్యం ప్రమాదాలకు దారి తీస్తుండేది. ఈ తయారీలో నిమగ్నమై ఒకరిద్దరు గతంలో మృతి చెందే వారు. పలువురు గాయాలతో బయట పడే వారు. అనేక కుటుంబాలు వంశపారం పర్యంగా ఈ తయారీ సాగిస్తూ వచ్చారంటే, ఏ మేరకు ఇక్కడ ఉత్పత్తి సాగుతున్నదో స్పష్టం అవుతోంది. సాక్షి, చెన్నై: బతుకు బుగ్గి: శివకాశి పరిసరాల్లో ఏడేళ్ల క్రితం వరకు సుమారు ఎనిమిది వేల వరకు చిన్న తరహా కుటీర పరిశ్రమలు. మరో 400 వరకు అతి పెద్ద పరిశ్రమలు ఉండేవి. గతంలో సాగిన సర్వే మేరకు ఈ వివరాలు బయట పడ్డాయి. ఇక్కడి ప్రజల బతుకులు బాణ సంచా మందుగుండు సామగ్రికి బుగ్గి పాలు అవుతున్నట్టు ఆ సర్వే తేట్టతెల్లం చేసింది. దీంతో ఇక్కడి వారి జీవన స్థితిని మెరుగు పరచడం, బాణ సంచా పరిశ్రమల్లో బతుకు నాశనం చేసుకుంటున్న చిన్న పిల్లల్ని విద్యా పరంగా ప్రోత్సహించేందుకు పాలకులు చర్యలు చేపట్టారు. చిన్న పిల్లలు బడిబాట పట్టినా, యుక్త వయస్సు వచ్చే సరికి తిరిగి బాణ సంచాల తయారీలో నిమగ్నం కావాల్సిందే. ఈ ఆధునిక యుగంలో సరి కొత్త తరహా బాణ సంచాల తయారీ వేగం పుంజుకోవడంతో పాటు పోటీతత్వం పెరగడంతో వేలాది కుటుంబాలు తమ కుటీర పరిశ్రమలకు తాళాలు వేసుకోక తప్పలేదు. పొట్ట కూటి కోసం పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఆశ్రయించక తప్పలేదు.వీరికి రోజు వారిగా పీస్ రేట్(ఎన్ని బాణ సంచాలు తయారు చేస్తారో) దాని ఆధారంగా వారానికి లేదా నెలకో వేతనాలు ఇచ్చే పరిశ్రమలు ఉన్నాయి. దీంతో అధికంగా పీస్‌లను తయారు చేయాలన్న ఆత్రుతతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. దిన దిన గండంతో కాలాన్ని నెటుకొస్తుంటారు. పరిశ్రమలోకి అడుగు పెట్టాక తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అన్న ఆందోళన కార్మికుల్లో ఉన్నా, బతుకు జీవనం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టక తప్పడంలేదు. దీనిపై రాష్ట్ర కార్మిక బోర్డు చూసి చూడనట్టు గతంలో వ్యవహరించడంతో 2012లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. మూల్యంతో కొరడా: శివకాశి పరిసరాల్లోకి అడుగు పెడితే చాలు, ఏదో ఒక గ్రామంలో ఎన్నో కుటుంబాలు బాణసంచా బాధితులుగా కనిపిస్తుంటారు. ఇక్కడి పరిశ్రమల్లో అగ్ని, ప్రమాదాల నియంత్రణకు చర్యలు అంతంత మాత్రంగానే గతంలో ఉండేది. ఓ సంస్థ పేరుతో లెసైన్స్‌లు పొంది, దాని ఆధారంగా మరెన్నో పరిశ్రమలు గతంలో నడిచేవి. ఇక్కడ 1981లో తొలిసారిగా పేలుడు చోటు చేసుకుంది. తదుపరి 2000 సంవత్సరం నాటికి ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య 50గా తేలింది. తదుపరి ప్రతి ఏటా కనీసం 20 నుంచి 50 మంది వరకు మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతుంటాయి. 2002లో కోవిల్ పట్టి వద్ద జరిగిన బాణ సంచా పేలుడులో 16 మంది, 2005లో మానాంపట్టిలో 20 మంది, 2006లో బర్మా కాలనీలో 12 మంది, 2007లో నారాయణ పురంలో నలుగురు, 2009లో శ్రీకృష్ణ ఫైర్ వర్క్‌లో 18 మంది, అనిల్ ఫైర్ వర్క్స్‌లో ముగ్గురు, 2010లో ఏడుగురు, 2011లో 14 మంది చొప్పున ఒకే చోట ప్రమాదాల్లో విగత జీవులయ్యారు. 2009లో పళ్లిపట్టు సమీపంలో, శివకాశిలోని శ్రీకృష్ణ ఫైర్ వ ర్క్స్, అనిల్ ఫైర్ వర్క్‌లలో చోటు చేసుకున్న బాణ సంచా ప్రమాదాలతో ప్రభుత్వం మేల్కొంది. బాణసంచా పరిశ్రమలకు కొత్త నిబంధనల్ని విధించినా ఆచరణలో విఫలమయ్యారు. కొన్ని రకాల పొటాషియం పదార్థాల్ని ఉపయోగించకూడదన్న నిబంధనలు ఉన్నా, ఆ పదార్థాలే ఇక్కడి పరిశ్రమల్లో పెద్ద ఎత్తున కనిపిస్తుంటాయి. పాలకులు, అధికారులు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం 2012లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓం శక్తి ఫైర్ వర్క్స్‌లో చోటు చేసుకున్న బాణ సంచా పేలుడుకు నలభై మంది మరణించారు. దీంతో మేలుకున్న అధికార వర్గాలు నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు. జూన్ నుంచి తయారీ ఒకప్పుడు నిత్యం తయారీలో నిమగ్నం అయితే, ప్రభుత్వ కొరడాతో జూన్ నుంచి పనుల్ని మొదలెట్టే పనిలో పడ్డారు. దీపావళికి ముందు రోజు వరకు ఈ పనులు కొనసాగించాల్సిందే. ఉత్తరాది నుంచి కూడా కూలీల్ని ఇక్కడికి రప్పించుకోవడం కొంత కాలంగా జరుగుతోంది. ఇక, శివకాశిలోని పరిశ్రమలు వ్యాపార దృక్పథంతో తమ సంస్థలను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరించే పనిలో పడ్డాయి. దీంతో 2013 నుంచి ప్రమాదాలు ఒక్క శివకాశినే కాదు, పలు జిల్లాలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. 2013లో అరియలూరు, విల్లుపురం, తూత్తుకుడిల్లోని పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో 13 మంది బలయ్యారు. 2014లో తంజావూరు జిల్లా కుంభకోణంలో తొమ్మిది మంది ఓ పరిశ్రమలో, 2014లో కాంచీపురం సమీపంలో ఐదుగురు, 2015లో కడలూరులో ఆరుగురు విగత జీవులయ్యారు. ప్రమాదాల సంఖ్య తగ్గడం, మృతుల సంఖ్య కూడా తగ్గినా దీపావళి సమీపంలో ఈ బాణ సంచా రూపంలో దడ అన్నది మాత్రం తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో గురువారం శివకాశిలోని రాఘవేంద్ర ఫైర్ వర్క్స్ గోడౌన్లో పేలుడు మరోమారు ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది విగతజీవులు కావడం, మరో పది మందికి పైగా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో రెండేళ్లల్లో దీపావళి సందర్భంగా శివకాశిలో జరిగిన అతి పెద్ద పేలుడు ఇదే కావడం గమనార్హం. దీంతో మళ్లీ నిబంధనలకు తిలోదకాలు దిద్దే పనిలో పరిశ్రమల యాజమాన్యాలు ఉండబట్టే, ఈ ప్రమాదాలు అన్న ఆరోపణలు బయలు దేరాయి. ఇక, దీపావళి తర్వాత మూడు నెలల కాలం ఇక్కడి కుటుంబాలకు చేతిలో పనులు లేనట్టే. ఈ కాలంలో పొట్ట కూటి కోసం ఆయా పరిశ్రమల యాజమాన్యాల్ని ఆశ్రయించడం, అడ్వాన్స్‌లు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ అడ్వాన్స్ చెల్లింపుతో పాటు తాజా బతుకు తెరువు కోసం రేయింబవళ్లు శ్రమించినా చివరకు మిగిలేది కన్నీళ్లే. -
బాణసంచా తాత్కాలిక లైసెన్స్‌లు షురూ..
► దరఖాస్తు కోసం నిబంధనలు ► జిల్లా రెవెన్యూ అధికారి నరసింగరావు ఒంగోలు : దీపావళి పండగ కోసం బాణసంచా విక్రయించేందుకు ఆసక్తి కలిగినవారు అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ నరసింగరావు తెలిపారు. బాణ సంచా విక్రయించేందుకు తాత్కాలిక దుకాణాల ఏర్పాటుపై మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ, పోలీసు, మునిసిపల్, అగ్నిమాపకశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఒంగోలు నగరంలో పీవీఆర్ బాయిస్ హైస్కూల్ గ్రౌండ్, డీఆర్ఆర్ఎం మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్లో దుకాణాలు పెట్టుకొనేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. చీరాల, కందుకూరు, మార్కాపురం పట్టణాల్లో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. అక్కడి మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, పోలీసు ఇన్స్పెక్టర్లు బాణ సంచా విక్రయ ప్రదేశాలను నిర్ణయిస్తారన్నారు. ఒంగోలుతో పాటు ఇతర పట్టణాలల్లో నిర్ణయించినట్లు కాకుండా, ఇతర స్థలాల్లో విక్రయించుకునేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. సంబంధిత లైసెన్స్‌లు జిల్లా కలెక్టర్ జారీ చేస్తారన్నారు. అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని, చివరిరోజైన 30వ తేదీ సాయంత్రం 7గంటలకు స్టాల్స్ ఖాళీ చేయాలని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పోలీసు, మునిసిపల్, అగ్నిమాపకశాఖల అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తొమ్మిది రకాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి మీ సేవా కేంద్రాల్లో బాణ సంచా దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తొమ్మిది రకాల డాక్యుమెంట్లు తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు, చిరునామా, ఆధార్ జెరాక్స్ కాపీలు, మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రం(18సంవత్సరాల్లోపు వారికి అనుమతి లేదు), అఫిడవిట్ (10 రూపాయల స్టాంపు పేపర్‌పై నోటరీ), సంబంధిత పోలీసు అధికారులకు ముందుగా దరఖాస్తు చేసుకొని వారి నుంచి పొందిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు దాఖలు చేయాలి. అగ్నిమాపక శాఖ.. మునిసిపాలిటీ, పంచాయతీ అధికారులకు కూడా దరఖాస్తు చేసుకొని వారు ఇచ్చే నో అబ్జక్షన్ సర్టిఫికెట్లను అందించాలి. -
గురవాంలో పేలుడు..ఇద్దరి మృతి
- ఆరుగురికి తీవ్రగాయాలు రాజాం(శ్రీకాకుళం జిల్లా) రాజాం మండలం గురవాం గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం పేలుడు సంభవించింది. అక్రమంగా బాణసంచా తయారీ చేస్తున్న పాలవలస శ్రీను అనే వ్యక్తి ఇంటిలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరి శవం మాత్రమే కనపడుతోంది. మరొకరి శవం శిథిలాల కింద ఉండవచ్చునని భావిస్తున్నారు. గాయపడిన పాలవలస శ్రీను, పాలవ లస లావణ్య, గేదెల ఈశ్వరరావు, గేదెల దుర్గమ్మ, గేదెల గోవిందమ్మ , ఈగల ప్రసన్న కుమార్‌లను రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బాణసంచా గోదాములో భారీ అగ్నిప్రమాదం
దీపావళి పండుగ సంబరాల సమయంలో నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్రాకర్స్ గోదాములో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగి మంటలు ఎగసిపడ్డాయి. టపాసుల పేలుళ్లకు ఆ ప్రాంతం దద్దరిల్లింది. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ప్రమాద తీవ్రత, పేలుళ్లతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
ఉలిక్కిపడిన నారాయణపురం
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఇద్దరు మృతితో గ్రామంలో విషాదం తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమం మిన్నంటిన బంధువుల రోదనలు రాంబిల్లి: అప్పటి వరకు నిశ్శబ్దం.. భారీ పేలుడుతో జనం బెంబేలు.. ఇళ్లల్లోంచి పరుగులు.. తునాతునకులైన రేకులషెడ్డు..శిథిలాల మధ్య యువకుని మృతదేహం.. కొంతదూరంలో క్షతగాత్రుల ఆర్తనాదాలతో హృదయవిదారక దృశ్యాలు..ఇలా రాంబిల్లి మండలం నారాయణపురం అనధికార తయారీ కేంద్రంలో బాణసంచా పేలుడుతో సోమవారం ఉలిక్కిపడింది. ఇద్దరి మృతితో అంతటా విషాదం అలుముకుంది. శారదనది గట్టున ఆనుకుని ఉన్న స్థలంలో రేకులషెడ్డులో గ్రామానికి చెందిన భూపతి వెంకటరమణ అనధికారికంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇదే విషయంలో గతేడాది అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటినుంచి బాణసంచా తయారీ నిలిపివేసిన వెంకటరమణ మళ్లీ ప్రారంభించినట్టు గ్రామస్తులు తెలిపారు. సోమవారం ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో వెంకటరమణ భోజనానికి ఇంటికి వెళ్లాడు. అరగంట తరువాత పేలుడు సంభవించింది. ఈ సమయంలో అతని కుమారులు నాగదుర్గ (24), శివకుమార్ (18), సోదరుడు పాండురంగ కుమారుడు జీవన్ (15), యర్రంశెట్టి గణేష్ (17) తయారీ కేంద్రంలో ఉన్నారు. పేలుడుకు రేకులషెడ్డు తునాతునకలైంది. శిథిలాల మధ్య శరీర భాగాలు తెగిపడి జీవన్ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురూ సమీపానికి ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంమేరకు ఎస్ఐ కె. మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొట్టి ఆటోల్లో బాధితులను యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో గణేష్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శివకుమార్, నాగదుర్గ పరిస్థితీ విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. జీవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్లేశ్వరరావు తెలిపారు. గతేడాది బాణసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడు వెంకటరమణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినా అతనిలో మార్పురాలేదన్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిన్నంటిన ఆర్తనాదాలు: సంఘటన స్థలంలో మృతులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. పేద కుటుంబానికి చెందిన జీవన్ యలమంచిలిలో పదో తరగతి చదువుతున్నాడు. రిపబ్లిక్ డే కావడంతో పాఠశాలకు వెళ్లలేదు. బాణసంచా తయారీ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అతని తల్లి, చెల్లి రోదన చూపరులను కంటతడి పెట్టించాయి. -
రూ.25 కోట్లు.. ఇదీ దీపావళి బిజినెస్
ఆదిలాబాద్ : కొత్త రాష్ట్రంలో దీపావళి పండుగను జిల్లా వాసులు ఉత్సాహంగానే జరుపుకున్నారు. లక్ష్మీ కటాక్షం కోసం ఘనంగా పూజలు నిర్వహించి బాణాసంచా పేల్చి సందడి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పండుగ జోరు తగ్గలేదు. ప్రధానంగా దసరా సమయానికే పంటలు చేతికొచ్చి రైతుల చేతుల్లో కాసులు గలగలలాడేవి. ఈసారి అనుకున్న విధంగా పంటలు చేతికి రాకపోవడం, మార్కెట్లో పూర్తిస్థాయిలో పంట కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైనా సరైన మద్దతు ధర లేక రైతులకు పండుగ కళ తప్పింది. అయినా.. కొనుగోళ్ల జోరు మాత్రం తగ్గలేదు. బాణసంచా, మిఠాయిలు, పువ్వులు, పండ్లు, పూజ సామగ్రి, బంగారం, కొత్త వాహనాలు, దుస్తులు, మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోళ్లలో జిల్లా ప్రజలు రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేశారు. టపాసులపై రూ.7 కోట్ల ఖర్చు.. జిల్లా ప్రజలు టపాసులపై రూ.7 కోట్ల వరకు వెచ్చించారు. ఆదిలాబాద్‌లోనే సుమారు రెండున్నర కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో టపాసుల విక్రయాల కోసం సుమారు 70 దుకాణాలు ఏర్పాటు చేయగా, ఒక్కో దుకాణంలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వ్యాపారం జరిగినట్లుగా చెబుతున్నారు. మంచిర్యాల, నిర్మల్లోనూ దాదాపు అదేస్థాయిలో ఉంది. పువ్వులు, పండ్లు, పూజా సామగ్రి కోసం రూ.2.5 కోట్లు వెచ్చించారు. మిఠాయిలపై రూ.50 లక్షలు ఖర్చు చేశారు. ద్విచక్ర వాహనాల అమ్మకాలూ జోరుగా సాగాయి. లక్ష్మీపూజల రోజు మంచిర్యాలలో సుమారు 300లకు పైగా బైక్‌లు, ఆదిలాబాద్‌లో 200లకు పైగా అమ్ముడుపోయాయి. మొత్తంగా రూ.3 కోట్లు వాహనాలపై వెచ్చించారు. పండుగ నేపథ్యంలో రెడీమేడ్ బట్టల దుకాణాలు, మొబైల్, ఎలక్ట్రానిక్ షాపులు, వాహనాల షోరూంలు పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. మొబైల్ ఫోన్లు ఒకటి కొంటే మరొకటి ఉచితమని, ఒకటి కొంటే రెండు ఫ్రీ అనే ఆఫర్లతో పలు షాపులు పెద్ద పెద్ద బ్యానర్లతో ఆకట్టుకున్నాయి. దీపావళికి కొత్త బట్టల కోసం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, బెల్లంపల్లి, భైంసా తదితర ప్రాంతాల్లో జోరుగా వ్యాపారం జరిగింది. రూ.3.5 కోట్ల వరకు దుస్తువులపై వెచ్చించారు. మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్రధానంగా టీవీల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆదిలాబాద్ పట్టణంలో పండుగ సందర్భంగా వెయ్యికి పైగా సెల్ఫోన్లు అమ్ముడుపోగా.. రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరిగింది. బంగారం అమ్మకాలు ప్రధానంగా మంచిర్యాలలో అధికంగా జరిగాయి. అక్కడ 2.5 కిలోల బంగారం అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. జిల్లా అంతటా కలిపి కోటిన్నర రూపాయల విలువైన బంగారం విక్రయం జరిగింది. ఆదిలాబాద్‌లో బంగారం అమ్మకాల పరంగా నిస్తేజం కనిపించిందని బులియన్ మార్కెట్ అభిప్రాయ పడుతోంది. గత దీపావళికి 2 కేజీల బంగారం అమ్ముడుపోయిందని, ఈసారి నామమాత్రంగా విక్రయాలు జరిగాయని అంటున్నారు. -
బాణసంచా వ్యాపారులకు హుదూద్ దెబ్బ
నరసన్నపేట:హుదూద్ తుపాను ప్రభావం దీపావళి పండుగపై సైతం పడింది. ఏడాదికి ఒకసారి ఉత్సాహంగా అందరూ జరుపుకొనే పండుగ సందడిపై తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. తుపాను బాధితులు ఇబ్బందుల్లో ఉండడంతోపాటు పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మూడు జిల్లాల్లో దీపావళి సామగ్రి విక్రయాలను ఈ ఏడాది నిషేధించారు. దీంతో విక్రయూనికి కొద్దిరోజులు ముందుగానే తెప్పించిపెట్టుకున్న బాణసంచాను వ్యాపారులు గుడౌన్లకే పరిమితం చేయడంతో తీవ్రంగా నష్టపోయూరు. నిషేధం ఉండడంతో బాణసంచా ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో పిల్లలను బుజ్జగించలేక తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 6 కోట్లు నుంచి పది కోట్ల రూపాయల వరకు బాణ సంచాను వ్యాపారులు తెప్పించి కనీసం 20 కోట్ల రూపాయలకు విక్రయించేవారు. దీనికి కోసం ముందగానే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టేవారు. దుకాణాలు తెరిచేందుకు పంచాయతీ , అగ్నిమాపక , రెవెన్యూ , పోలీసు తదితర శాఖల అనుమతులు అవసరం. ఈ అనుమతులు పొందడానికి అనధికారికంగా లెసైన్స్‌ఫీజులు రూపేనా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారులు అనుమతులు తెచ్చుకునేవారు. ఈ సంవత్సరం దీపావళి రెండు రోజుల ముందు ముఖ్యమంత్రి ఈ మూడు జిల్లాల్లో బాణసంచా విక్రయాలు అనుమతించవద్దని ఆదేశించడంతో అధికారులు, వ్యాపారులు ఇరకాటంలో పడ్డారు. జిల్లాకు తాడేపల్లిగూడెం, శివకాశీ వంటి సుదూర ప్రాంతాల నుంచి హోల్‌సేల్ ధరలకు వ్యాపారులు బాణసంచా తెచ్చి విక్రయిస్తుంటారు. వీటిని విక్రయించేందుకు కేవలం దీపావళి ముందు రోజు కానీ, అంతకంటే ముందు రోజు కానీ అనుమతిస్తుంటారు. అయితే దీపావళి అనంతరం ఈ లెసైన్స్‌లు విక్రయాలకు ఉపయోగపడవు. తెచ్చిన లక్షలాది రూపాయల విలువచేసే బాణ సంచాను వచ్చే ఏడాది వరకు భద్ర పరిచేందుకు అనుమతి ఉండదు. అంతేకాకుండా భద్రపరచడం కూడా వ్యాపారికి తలకుమించిన భారమే. ఈ కారణంగా వ్యాపారులంతా తాము తెచ్చిన సరుకును తిరిగి అదే హోల్‌సేల్‌వ్యాపారికి రిటన్ చేశారు. -
విచ్చలవిడిగా బాణసంచా దుకాణాలు
గుర్గావ్: ఫరీదాబాద్‌లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాణసంచా మార్కెట్లో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం ఘటన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటుచేస్తే ఏమి జరుగుతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. అయినప్పటికీ నగరంలోని అనేక ప్రాంతాల్లో అనుమతి లేకుండా అనేక బాణసంచా విక్రయ దుకాణాలు వెలిశాయి. వాస్తవానికి నగరంలోని ఐదు ప్రాంతాల్లో మాత్రమే వీటి విక్రయానికి గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) అనుమతి ఇచ్చింది. లీజర్ వ్యాలీ గ్రౌండ్స్, సెక్టార్ -5 హుడా గ్రౌండ్స్, గౌశాల మైదానం, తావ్దేవి లాల్పార్కు, పటౌడీ ప్రాంతంలోని రాంలీలా మైదానంలో మాత్రమే బాణసంచాను విక్రయించేందుకు అనుమతించారు. అయినప్పటికీ నగరంలో విచ్చలవిడిగా దుకాణాలు వెలిశాయి. లీజర్ వ్యాలీ గ్రౌండ్స్‌లో 350 దుకాణాలు వెలిశాయి. ఇదిలాఉంచితే కాగా ఢిల్లీకి సరిహద్దులోని ఫరీదాబాద్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో 230కి పైగా బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతైన సంగతి విదితమే. ఇక్కడి దసరా మైదానంలో ప్రతిఏటా దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు పెట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దాదాపు 200 దుకాణాలకు లెసైన్సులు ఇచ్చామని అగ్ని మాపక శాఖ అధికారి రామ్ మెహర్ చెప్పారు. కొంతమంది దుకాణాలను అలంకరించుకుంటుండగా, మరి కొందరు బాణసంచాను రవాణా చేస్తున్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ఈ ఘటనలో కొన్ని ప్రైవేటు వాహనాలు కూడా కాలి బూడిదయ్యాయని చెప్పారు. -
సర్కారే అసలు దోషి...
అడ్డగోలుగా బాణసంచా తయారీ కళ్లుమూసుకున్న యంత్రాంగం ► వాకతిప్ప విస్ఫోటంలో మరో నలుగురు మృతి.. 17కి పెరిగిన మృతుల సంఖ్య ► మృతుల్లో 15 మంది బడుగు మహిళలే..ఆచూకీ లేకుండా పోయిన మరో బాలిక ► లెసైన్సు రద్దయిన తర్వాతా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్న వైనం ► తనిఖీలు చేయకుండానే లెసైన్సు పునరుద్ధరించాలంటూ సిఫారసులు ► cయు.కొత్తపల్లి తహశీల్దార్ సస్పెన్షన్.. నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు కాకినాడ: ప్రభుత్వ యంత్రాంగం అలసత్వానికీ, నిర్లక్ష్యానికీ అమాయకులు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన పెను విస్ఫోటంలో మృతుల సంఖ్య 17కి చేరింది. వీరిలో 15 మంది బడుగువర్గాల మహిళలే. ఈ దుర్ఘటనలో మరో బాలిక ఆచూకీ లేకుండా పోయింది. వాకతిప్ప ఎస్సీ కాలనీకి చెందిన 11 మంది దుర్మరణం పాలు కాగా.. మిగిలిన వారు మరో రెండు గ్రామాలకు చెందినవారు. దీంతో మూడు గ్రామాల్లో విషాదం అలముకుంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ సామెత చందంగా ఇన్ని ప్రాణాలు బలయ్యాక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కాకినాడలో ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయత్నం ఇంతకు ముందే జరిగి ఉంటే బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఇన్ని ప్రాణాలు బలయ్యేవి కావని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 17కు పెరిగిన మృతుల సంఖ్య... వాకతిప్పలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మణికంఠ ఫైర్వర్క్స్లో సంభవించిన భారీ విస్ఫోటంలో సోమవారం 12 మంది మృతి చెందగా.. మంగళవారం తెల్లవారుజామున మరో నలుగురు మృతి చెందారు. ఉల్లంపర్తి కామరాజు (30), మేడిశెట్టి నూకరత్నం (20), దమ్ము గురవయ్య (45), తుట్టా నాగమణి (35) కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరోవైపు.. సంఘటనా స్థలానికి అరకిలోమీటర్ దూరంలో పంటకాలువలో వాసంశెట్టి రాఘవ (50) అనే మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆచూకీ లేకుండా పోయిన 12 ఏళ్ల ఉండ్రాజపు కీర్తి కూడా మృతిచెంది ఉంటుందని అధికారులు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు. పరిసరాల్లో లభించిన తెగిపడ్డ ఓ కాలు ఆ బాలికదేనని భావిస్తున్నారు. అవసరమైతే లభించిన కాలికి డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని చెప్తున్నారు. ఫైర్వర్క్స్ నిర్వాహకుడు కొప్పిశెట్టి అప్పారావు, అతడి తల్లి లక్ష్మి, కుక్కల శ్రీనివాసరావు అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. లెసైన్సు రద్దయినా ఆగని తయారీ... వాకతిప్పలో మరణమృదంగానికి కారణమైన మణికంఠ ఫైర్‌వర్క్స్‌కు 2015 వరకు లెసైన్సు ఉన్నప్పటికీ పెరిగిన వ్యాపారానికి తగ్గట్టు ఫీజు చెల్లించని కారణంగా గత నెలలో లెసైన్సు రద్దు చేశారు. నిర్వాహకుడు కొప్పిశెట్టి అప్పారావు కొత్తగా లెసైన్సు కోసం గతవారం పెట్టుకున్న దరఖాస్తు కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. అయినా బాణసంచా తయారీని ఆపలేదు. దరఖాస్తు చేయడానికి ముందు నుంచే (గత నెలన్నర రోజులుగా) బాణసంచా తయారుచేయిస్తూనే ఉన్నాడు. ఈ కేంద్రం నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున హోల్‌సేల్‌గా బాణసంచా సరఫరా చేస్తున్నారు. దీపావళి సందర్భంగా అమ్మకాల కోసం సుమారు రూ. 50 లక్షల విలువైన సరుకును కూడా శివకాశి నుంచి కొని, తెచ్చినట్టు సమాచారం. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. కళ్లు మూసుకున్న అధికారులు... బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలకు విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ బాణసంచా తయారు చేసేందుకు ప్రస్తుతం లెసైన్సు లేదు. గతంలో ఉన్న లెసైన్సు రద్దయింది. అన్ని కార్యకలాపాలూ నిబంధనలకు విరుద్ధంగా కళ్లెదుటే చేస్తున్నా అధికారుల కళ్లకు కనిపించనే లేదు. నెల రోజులు ముందుగానే దుకాణాలను తనిఖీ చేసి సరుకు నిల్వలు, తయారీ విధానం, పనిచేస్తున్న వారికి బీమా చేయించారా లేదా అనే వివరాలు స్వయంగా పరిశీలించాల్సిన అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, విద్యుత్ కార్యాలయం, నివాస ప్రాంతాలు, నిత్యం జనసమ్మర్థం ఉండే ప్రాంతానికి సమీపాన అడ్డగోలుగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో తహశీల్దార్, అగ్నిమాపక అధికారులు, పోలీసులు.. ఎటువంటి తనిఖీలు లేకుండానే సర్టిఫై చేసి జిల్లా కేంద్రానికి లెసైన్సు పునరుద్ధరణకు సిఫారసు చేశారు. పర్యవసానంగా జరిగిన ఘోరం 17 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. దుర్ఘటనకు బాధ్యుడిగా యు.కొత్తపల్లి తహశీల్దార్ పినిపే సత్యనారాయణను సస్పెండ్ చేశారు. బాణసంచా కేంద్రం యాజమాన్యంపై ఐపీసీ 286, 337, 338, 304(2), 1884 ఎక్స్‌ప్లోజివ్ సబ్స్టాండ్స్ చట్టం సెక్షన్ 9బి ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. మృతదేహాల కోసం రాత్రి వరకూ పడిగాపులు... కాకినాడ జీజీహెచ్ ఫోరెన్సిక్ విభాగ వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం 15 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. తెగిపడ్డ కాలినీ పరీక్షించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించడంలో మానవత్వం లోపించింది. కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జీజీహెచ్‌లో పడిగాపులు పడాల్సి వచ్చింది. సీఎం వచ్చే వరకు మృతదేహాలను జీజీహెచ్‌లోనే ఉంచేయడం కుటుంబ సభ్యులను కలచివేసింది. ఉదయం 10.30 గంటలకు సీఎం వస్తున్నారని హైరానా పడ్డ అధికారులు హుటాహుటిన పోస్టుమార్టం పూర్తి చేసినా సీఎం మధ్యాహ్నం 3.30 గంటలవరకు రాకపోవడంతో అంతవరకు వేచి చూడాల్సి వచ్చింది. సీఎం వెళ్లిపోయాక మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటుచేసిన అంబులెన్స్‌లకు డీజిల్ పోసే బాధ్యతను రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు నెట్టుకోవడంతో బంధువులు రాత్రి వరకూ నిరీక్షించాల్సి వచ్చింది. పేలుడులో మృతుల వివరాలు... మసకపల్లి అప్పయమ్మ (55), మసకపల్లి గంగ (23), మసకపల్లి విజయకుమారి అలియాస్ బుజ్జి (28), ద్రాక్షారపు కాంతమ్మ (50), మసకపల్లి కుమారి (24), ద్రాక్షారపు చిన్నతల్లి (46), అద్దంకి నూకరత్నం (25), మసకపల్లి పుష్ప (35), ఉల్లంపర్తి కామరాజు (30), పిల్లి మణికంఠస్వామి (35), తుట్టా మంగ (40), తుట్టా సత్తిబాబు (20), మేడిశెట్టి నూకరత్నం (20), దమ్ము గురవయ్య (45), తుట్టా నాగమణి (35), రాయుడు రాఘవ (40), వాసంశెట్టి రాఘవ (50). ఈ 17 మంది మృతి చెందగా.. ఉండ్రాజపు కీర్తి (12) అనే బాలిక ఆచూకీ లభ్యంకాలేదు. ఇక ఆస్పత్రిలో కుక్కల శ్రీనివాసరావు, కొప్పిశెట్టి లక్ష్మి, కొప్పిశెట్టి అప్పారావులు చికిత్సపొందుతున్నారు. -
టపాసుల దుకాణాలు దగ్ధం
ఆసిఫాబాద్ : దీపావళి పండుగ టపాసుల వ్యాపారుల్లో చీకటి మిగిల్చింది. మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 12 దుకాణాలు, అక్కడే నిలిపి ఉంచిన ఐదు మోటారుసైకిళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. పట్టణంలోని జెడ్పీ గ్రౌండ్ ఆవరణలో దీపావళిని పురస్కరించుకుని రెండ్రోజులుగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి దుకాణాల వద్ద కొనుగోళ్లు సాగుతున్నాయి. దుకాణం నం8 ఎదుట చిన్నారి చైనా పిస్టల్ పేల్చడంతో నిప్పురవ్వలు దుకాణంలోని టపాసుల పడ్డాయి. దీంతో ఒక్కసారిగా టపాసులు పేలడం ప్రారంభమైంది. అప్రమత్తమైన మిగితా దుకాణదారులు, కొనుగోలుదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కొంతమంది వ్యాపారులు వ్యాపారులు అమ్మకం గళ్లపెట్టెలతో పరుగులు తీయగా.. మరికొందరు అక్కడే వదిలేసి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేశారు. క్షణాల్లో దుకాణాల్లోని బాణాసంచాతోపాటు దుకాణాల్లోని ఫర్నిచరల్, తక్త్ బల్లాలు, షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పక్క దుకాణాలకు వ్యాపించడంతో టపాసులు పేలి ఆ ప్రాంతం భయానంగా మారింది. మంటలు పెద్దయెత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. పేలుడు శబ్దానికి పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదురైంది. విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సీఐ వెంకటేశ్, ఎస్సై రాంబాబు, తహశీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఆర్ఐ విష్ణు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిలువేరు వెంకన్న సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. నష్టపోయిన యవకులు పట్టణంలోని నిరుద్యోగులు సీజనల్ వ్యాపారంలో భాగంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు విలువైన టపాసులతో దుకాణాలు ఏర్పాటు చేశారు. పెట్టుబడి పోగా, ఎంతో కొంత లాభం చేకూరుతుందనుకున్న వ్యాపారులకు ఈ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
మృత్యువు పేల్చిన ‘ప్రాణసంచా’
దీపావళికి మూడురోజులు ముందే మృత్యువు.. ఆ గ్రామంలో ‘ప్రాణసంచా’తో పండుగ చేసుకుంది. అమావాస్య రాత్రిని వన్నెవన్నెల వెన్నెలతో నింపే కృషిలో నిమగ్నమైన వారిపై కన్నెర్రజేసింది. వారినే సీమటపాసుల్లా పేల్చేసి, తునాతునకలు చేసింది. బతుకుతెరువుకు తయారు చేస్తున్న బాణసంచానే చితిగా ముట్టించి వారిని సజీవ దహనం చేసింది. పండుగ మర్నాటి ఉదయం వీధుల్లో కనిపించే.. కాల్చేసిన చిచ్చుబుడ్లు, భూచక్రాలు, మతాబుల అవశేషాల మాదిరిగా మిగిలిన వారి శరీరాలతో ఆ తయారీ కేంద్రాన్ని భయానకంగా మార్చింది. వేలమంది ముంగిళ్లలో ఆనందాల వెలుగులు విరబూయించబోయిన ఆ బడుగుజీవుల ఆత్మీయులను చిమ్మచీకటి లాంటి శోకం కమ్ముకుంది. ‘కాంతుల పర్వం’ వారికి జీవితాంతం వెన్నాడే పీడకలగా మిగిలింది. * వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రంలో విస్ఫోటం * 12 మంది మృత్యువాత, ఏడుగురికి తీవ్రగాయాలు * చికిత్స పొందుతున్న వారిలో 5గురి పరిస్థితి విషమం * తునాతునకలైన మృతదేహాలు, నామరూపాల్లేని ఫైర్వర్క్స్ * బాధితులంతా రెక్కల కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులే.. * దీపావళికి ముందు ఘోర దుర్ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా * ప్రమాద కారణంపై వ్యక్తమౌతున్న భిన్నాభిప్రాయాలు పిఠాపురం/ అమలాపురం : ఒకవైపు కొబ్బరి తోపు.. మరోవైపు పచ్చని వరి చేలు.. వాటి మధ్య బాణ సంచా తయారీ కేంద్రం.. పండుగ దగ్గర పడుతున్నందున చకచకా బాణసంచా తయారు చేస్తున్న కార్మికులు..అక్కడ దీపావళి పండుగకు మూడురోజుల ముందే సందడిసందడిగా ఉంది. అది చూసి కన్నుకుట్టిన మృత్యువు కుట్ర పన్నినట్టు.. అంతలోనే మహా విస్ఫోటం. కార్చిచ్చులాంటి అగ్నికీలలు. ఏం జరిగిందో తెలిసే లోపే కొందరు గడ్డిపరకల్లా సజీవ దహనమయ్యారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలో జరిగిన ఘోర దుర్ఘటన గ్రామాన్ని శోకపుకుప్పగా మార్చేసింది. వాకతిప్పలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ మణికంఠ ఫైర్వర్క్స్లో సోమవారం మధ్యాహ్నం 3.05 గంటల సమయంలో సంభవించిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుతుకుడుమిల్లి శివారు పెదకల్వలదొడ్డికి చెందిన కొప్పిశెట్టి వెంకటరమణ పాతకాలపు పెంకుటిల్లు, రేకులషెడ్లలో నిర్వహిస్తున్న ఈ బాణసంచా తయారీ కేంద్రంలో సొంతంగా తయారు చేసిన రకరకాల మందుగుండు సామగ్రితో పాటు వివిధ కంపెనీల బాణసంచానూ పెద్ద ఎత్తున నిల్వ చేశారు. సోమవారం కేంద్రంలో 25 నుంచి 30 మంది కార్మికులు బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. కేంద్రం బయట వెంకటరమణ పెద్ద కుమారుడు అప్పారావు, భార్య లక్ష్మి బాణసంచా అమ్మకాలకు టెంటు వేయిస్తున్నారు. ఆ సమయంలో భయంకరమైన పేలుడు సంభవించింది. దీపావళికి ముందు జరిగిన ఈ ఘోరంతో జిల్లా ఉలిక్కిపడింది. కాగా, కాకినాడ అపోలో ఆస్పత్రిలో క్షతగాత్రులను రాష్ర్ట వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. ప్రముఖుల పరామర్శ వాకతిప్పలో పేలుడు బాధిత కుటుంబాలను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పరామర్శించారు. ప్రమాదస్థలాన్ని చూసి వారు చలించిపోయారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ బాధితులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు బాధిత కుటుంబాలను ఓదార్చారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నట్టు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే దుర్ఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు స్థానిక పీహెచ్సీలో, ఇద్దరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో అత్యధికులు మహిళలే. కూలి తక్కువన్న కారణంతో బాణసంచా తయారీలో మహిళల్నే ఎక్కువగా వినియోగిస్తున్నట్టు చెపుతున్నారు. ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడుతో వాకతిప్పవాసులు భూకంపం వచ్చినట్టు కంపించిపోయారు. జరిగింది గుర్తించినా దుర్ఘటనాస్థలం వద్దకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. కొంతమంది ధైర్యం చేసి వెళ్లగా అక్కడి పరిస్థితిని చూసి గుండె చెదిరిపోయింది. రెప్పపాటులో కాలిన మాంసపు ముద్దల్లా మారిన వారి శరీరాలు గుర్తించలేనంతగా ఛిద్రమయ్యాయి. కొన్ని అవయవాలు తునాతునకలై 50 మీటర్ల దూరంలో కొబ్బరి తోటలు, పంట పొల్లాల్లో పడ్డాయంటే.. విస్ఫోటం తీవ్రత అర్థమవుతుంది. స్థానికంగా 108 అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో గాయపడినవారిని ఆటోల్లో తరలించాల్సి వచ్చింది. ఈ ఘోరానికి కారణం తెలియరాకున్నా బాణ సంచా తయారీ సమయంలో నిప్పు రాజుకుందని కొందరు అంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా దుర్ఘటన జరిగి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. కంపించిన ఆ మూడు గ్రామాలు పేలుడు తీవ్రతకు మణికంఠ ఫైర్వర్క్స్ నిర్వహిస్తున్న ఇల్లు, షెడ్లు నామరూపాల్లేకుండా పోయాయి. వాటిని అనుకుని ఉన్న కొబ్బరి, మామిడిచెట్లు మాడిమసైపోయాయి. పేలుడు సమయంలో చుట్టుపక్కల మూడు గ్రామాల్లో భూకంపం వచ్చినట్టు ప్రకంపనలు వచ్చాయి. బాణసంచా కేంద్రానికి సమీపంలో ఉన్న ఇళ్లలో కిటికీలు తలుపులు కొట్టుకోవడంతో పాటు టేబుళ్ల వంటి వాటిపైనున్న వస్తువులు ఎగిరి నేలమీద పడిపోయాయి. మణికంఠ ఫైర్వర్క్స్ ఊరికి దూరంగా కొబ్బరితోటలు, వరి చేలను అనుకుని ఉండడం వల్ల మరింత దారుణం తప్పినట్టయింది. అదే గ్రామానికి ఆనుకుని ఉంటే జరిగే నష్టం ఊహించజాలమని స్థానికులు అన్నారు. పేలుడు సమయంలో కొనుగోలుదారులు లేరని, అదే అమ్మకాలు మొదలయ్యాక ఈ దుర్ఘటన జరిగి ఉంటే చోటు చేసుకునే విషాదం తలచుకుంటేనే వణుకు పుడుతోందన్నారు. జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన శకటంతోపాటు మరోమూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు విస్ఫోటం జరిగితే సాయంత్రం 5.30 గంటల వరకు మంటలు రగులుతూనే ఉన్నాయి. -
విశాఖలో బాణసంచాపై నిషేధం
ఈ దీపావళికి దీపాలు మాత్రమే వెలగాలి.. బాణసంచా కాల్చకండి : సీఎం చంద్రబాబు చెట్లు, ఆకులు ఎండిపోయి ఉన్నాయి.. నిప్పంటుకుంటే పెద్ద ప్రమాదం ప్రైవేటు భాగస్వామ్యంతో మత్స్యకారులకు టౌన్‌షిప్‌లు ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక సర్క్యూట్ విశాఖ రూరల్: విశాఖలో బాణసంచా అమ్మకాలను నిషేదించినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బాణసంచా విక్రయానికి ఇప్పటివరకు ఇచ్చిన లెసైన్సులు రద్దు చేస్తామని ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగకు ప్రతీ ఇంటి ముందు దీపాలు మాత్రమే వెలిగించాలని, బాణసంచా కాల్చవద్దని విశాఖ ప్రజలకు సూచించారు. అవసరమైతే ప్రభుత్వమే దీపాలు సరఫరా చేస్తుందన్నారు. తుపాను కారణంగా చెట్లు విరిగి ఎండిపోయి ఉన్నాయని, ఆకులు కూడా ఎండిపోయాయని, చిన్న నిప్పు తగిలినా పెద్ద ప్రమాదం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ప్రకృతిని ఛాలెంజ్ చేసి మరీ దీపావళి చేసుకుందామని, తుపాన్లు కూడా అసూయపడే స్థాయిలో కొత్త విశాఖను నిర్మించుకుందామని చెప్పారు. విద్యుత్, గ్యాస్, ఫైబర్, సమాచార వ్యవస్థ ఇలా అన్నింటికి కామన్ డక్టులు ఏర్పాటు చేస్తామని, ఏ సమస్య వచ్చినా రెండు, మూడు గంటల్లో పరిష్కరించేలా చేస్తామన్నారు. ఇందుకోసం చెన్నై, ముంబైల నుంచి కన్సల్టెంట్లు వస్తున్నారని తెలిపారు. ప్రతి పౌరుడు ఆర్థికంగా లేదా శ్రమదానం చేసైనా పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నారు. విశాఖ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్, ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. దీపావళికి ముందే విశాఖ ప్రజల కళ్లలో వెలుగులు చూడటానికి అన్ని సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అధికారులు, చౌక దుకాణదారులు పేదలకు పండుగకు 2 రోజుల ముందే నిత్యావసరాలను అందించాలని సూచించారు.పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపడుతున్నా సంతృప్తి లేదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. విద్యుత్ సమస్య శాశ్వత పరిష్కారానికి టాటా, ఎన్సీసీ, ఎల్ అండ్ టి సంస్థల సహకారం కోరామన్నారు. తుపాను నష్టం ఎన్యూమరేషన్‌కు ఆన్లైన్ అప్లికేషన్ తయారు చేశామని, బాధితులు వారికి జరిగిన నష్టాలను ఫొటో లేదా వీడియో తీసి అప్లోడ్ చేస్తే పరిశీలించి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. సరుగుడు తోటకు రూ.12,500, పశువుల పాకలకు రూ.10 వేలు పరిహారం ఇస్తామన్నారు. టేక్ ఉడ్ చెట్లను యజమానులే అమ్ముకొనేలా అనుమతులు ఇస్తామన్నారు. తుపానుకు దెబ్బతిన్న ఇళ్ల మరమ్మత్తుల కోసం రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్మికులు సిద్ధంగా ఉన్నారన్నారు. మత్స్యకారులకు టౌన్‌షిప్‌లు మత్స్యకారుల కోసం ప్రత్యేక టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తుపాను బాధితుల సహాయానికి ఇన్ఫోసిస్ సంస్థ రూ.5 కోట్లు ప్రకటించగా, రూ.10 కోట్లు అడిగామని చెప్పారు. దానికి తాము మరో రూ.10 కోట్లు ఇచ్చి, స్థలాన్ని చూపిస్తామని, మత్స్యకారుల కోసం అన్ని వసతులతో టౌన్షిప్ నిర్మించాలని కోరినట్లు చెప్పారు. గిరిజనులు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోవాలి పాడేరు, అరకులలో ఇంకా 5 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు చేపట్టే అవకాశముందని సీఎం చెప్పారు. గిరిజనులు కొండల మీద కాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుంటే అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. -
కళ తప్పిన దీపావళి
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: సమైక్య సమ్మె ప్రభావం, పడకేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆర్థికమాంధ్యం, భారీగా పెరిగిన బాణసంచా ధరలు వెరసి వెలుగుల పండగ దీపావళిని కళ తప్పేలా చేశాయి. మూడు రోజులుగా ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షం బాణసంచా అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా బాణసంచా అమ్మకాలు భారీగా తగ్గినట్టు వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సగటున 30 శాతం వరకు బాణసంచా ధరలు పెరిగాయని వ్యాపారులే అంగీకరిస్తున్నారు. తగ్గిన అమ్మకాలు దీపావళి సందర్భంగా జిల్లాలో సుమారు 2000కు పైగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ, వైఎంసీ, కస్తూర్బా విద్యాలయాల మైదానాలతో పాటు గూడూరు, కావ లి, సూళ్లూరుపేట, వెంకటగిరి తదితర ప్రాంతా ల్లో టపాసుల దుకాణాలు వెలిశాయి. గత ఏడాది దాదాపు రూ. 5 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఈ ఏడాది బాణసంచా అమ్మకాలు బాగా పడిపోయినట్టు హోల్‌సేల్ వ్యాపారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ ఏడాది రూ.4 కోట్ల వ్యాపారం కూడా జరగలేదంటున్నారు. భారీగా పెరిగిన బాణసంచా ధరలు గత ఏడాది పెద్ద చిచ్చుబుడ్లు రూ.800 ఉన్న ప్యాకెట్ ఈ ఏడాది రూ. 1100కు పెరిగింది. చిన్న చిచ్చుబుడ్లు రూ. 500 నుంచి రూ.700కు పెరిగాయి. పెద్ద సైజు భూచక్రాలు రూ. 150 నుంచి రూ. 240, రాకెట్లు రూ. 200 నుంచి రూ. 290, కాకరవొత్తులు రూ. 80 నుంచి రూ. 120కు ఎగబాకాయి. ఇక బాంబుల ధరలు ముట్టుకుంటే పేలేంత తీవ్రంగా ఉన్నాయి. లక్ష్మీ బాంబులు ప్యాకెట్ రూ. 400 నుంచి రూ. 600, హైడ్రోజన్, వంకాయ బాంబులు రూ.300కు పైగా పెరిగాయి. 2వేలు, 5వేలు, 10వేలు సరాల ధరలు భారీగా పెంచారు. స్టాండర్డ్ కంపెనీ బాణసంచా కొనేందుకు వినియోగదారులు భయపడేంతగా ధరలు ఉన్నాయి. సమ్మె ప్రభావం రాష్ట్ర విభజన నిర్ణయంతో ఉద్యోగులు దాదాపు 60 రోజులకు పైగా నిరవధిక సమ్మె బాట పట్టారు. దీంతో ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి వేతనాలు చెల్లించలేదు. రెండు కాకరవత్తులు, రెండు చిచ్చుబుడ్లు కొనాలంటేనే దాదాపు రూ. 1000 ఖర్చు పెట్టాల్సి రావడంతో ఎక్కువ మంది ఉద్యోగులు అరకొరగానే దీపావళి పండగను చేసుకున్నారు. కొంతమంది చిరు ఉద్యోగులు దీపావళి పండగకు దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడకేసింది. జిల్లాలో 10 శాతం కూడా క్రయ, విక్రయాలు జరగలేదు. పలువురు రియల్ ఎస్టేట్‌పై పెట్టిన పెట్టుబడులు నిలచిపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. వీటితో పాటు నిత్యావసర, కూరగాయలు, పెట్రో, డీజిల్, గ్యాస్ తదితర ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ప్రభావంతో దీపావళి కళ తప్పింది. -
బాణసంచా ధరలు తారాజువ్వలే..
=నిరుటితో పోలిస్తే 20శాతం పెరుగుదల =తగ్గిన హోల్‌సేల్ అమ్మకాలు =కనిపించని దీపావళి సందడి విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : బాణసంచా ధరలు తారాజువ్వల్లా నింగికెగశాయి. సామాన్యులకు భారంగా మారాయి. నిరుటితో పోల్చితే అన్నిరకాల మందుగుండు సామాగ్రి ధరలు 20 శాతం పెరిగాయి. వరదలు, సమైక్య ఉద్యమం ప్రభావంతో జనం వద్ద డబ్బు లేదని గ్రహించిన హోల్‌సేల్ వ్యాపారులు స్టాక్‌ను గణనీయంగా తగ్గించారు. ఈ ఏడాది వాతావరణం కూడా అనుకూలించే పరిస్థితి లేదని వ్యాపారులు భావిస్తున్నారు. నిరుటి కంటే ఈ ఏడాది హోల్‌సేల్ వ్యాపారం కూడా తగ్గినట్లు చెబుతున్నారు. టపాసుల ధరలను టోకు వర్తకులు 10 శాతం పెంచారు. చిల్లర వర్తకులు మరో 10 శాతం పెంచి వసూలు చేస్తున్నారు. ఏటా నగరంలోని మార్కెట్లో దాదాపు 120 రకాల టపాసులు విక్రయానికి ఉంచేవారు. ఈసారి 90 రకాలే అందుబాటులో ఉన్నాయి. దుకాణాల కేటాయింపు, అనుమతుల జారీ ప్రక్రియలో మామూళ్లు దండుకుంటున్న అధికారులు ధరలు నియంత్రణను గాలికి వదిలేస్తున్నారు. ఈసారి బాణసంచా కొనటమంటే చేతులు కాల్చుకోవటమేగా మారింది. బాణసంచాను స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్‌గా విభజించి డిస్కౌంట్లుపేరుతో టోకు వ్యాపారులు దగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టాండర్డ్ వెరైటీపై 30 శాతం, నాన్ స్టాండర్డ్పై 70 నుంచి 80 శాతం డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. టోకు, చిల్లర వ్యాపారులు కుమ్మక్కై నాన్ స్టాండర్డ్ ప్యాకెట్లపై స్టాండర్డ్ లేబుల్స్ అంటించి జనాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా జిల్లాలో రూ. 25 కోట్ల నుంచి రూ. 30కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. 2012లో నగరంలో 130 షాపుల్లో రూ.5కోట్లు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని దాదాపు 350 షాపుల్లో రూ. 25 కోట్లకు మించి వ్యాపారం జరిగినట్లు అంచనా. ఈ ఏడాది ఇప్పటికే వ్యాపారులు అమ్మకాలు ప్రారంభించారు. దీపావళికి ముసురు భయం... ఇదిలా ఉండగా ఈ సంవత్సరం వ్యాపారులకు ముసరు భయం పట్టుకుంది. దీపావళికి ముసురు పడితే సరకు కొనుగోళ్లు జరుగుతాయో లేదోననే ఆందోళనలో ఉన్నారు. ఏటా దీపావళికి వారం ముందునుంచే పట్టణాలు, పల్లెల్లో బాంబుల మోత వినిపించేది. ఈ సంవత్సరం పండగ సమీపిస్తున్నా బాణసంచా వెలుగులు కనపడటం లేదు.