బతుకు బుగ్గి | News about Fireworks industry | Sakshi
Sakshi News home page

బతుకు బుగ్గి

Published Sat, Oct 22 2016 2:30 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

News about Fireworks industry

దినదిన గండంగా బతుకులు
మినీ జపాన్‌లో పేలుళ్లతో కలవరం
కన్నీటి మడుగులో వందలాది కుటుంబాలు
జీవితాల్ని మింగేస్తున్న బాణసంచా పరిశ్రమ

తమిళనాట బాణ సంచాల తయారీలో ప్రసిద్ధి చెందిన జిల్లా, ‘విరుదునగర్’ ఈ జిల్లాలో ఉన్న శివకాశి పట్టణాన్ని  మినీ జపాన్‌గా పిలుస్తున్నారు. ఈ పట్టణ, శివారుల్లోని గ్రామాల ప్రజల ప్రధాన జీవనాధారం బాణ సంచాల తయారీ. కుటీర పరిశ్రమల తరహాలో ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ బాణసంచాల్ని తయారు చేస్తూ ఉండే వారు. ఇది నిత్యం ప్రమాదాలకు దారి తీస్తుండేది.  ఈ తయారీలో నిమగ్నమై ఒకరిద్దరు గతంలో మృతి చెందే వారు. పలువురు గాయాలతో బయట పడే వారు. అనేక కుటుంబాలు వంశపారం పర్యంగా ఈ తయారీ సాగిస్తూ వచ్చారంటే, ఏ మేరకు ఇక్కడ ఉత్పత్తి సాగుతున్నదో స్పష్టం అవుతోంది.
 
సాక్షి, చెన్నై:
బతుకు బుగ్గి: శివకాశి పరిసరాల్లో ఏడేళ్ల క్రితం వరకు సుమారు ఎనిమిది వేల వరకు చిన్న తరహా కుటీర పరిశ్రమలు. మరో 400 వరకు అతి పెద్ద పరిశ్రమలు ఉండేవి. గతంలో సాగిన సర్వే మేరకు ఈ వివరాలు బయట పడ్డాయి. ఇక్కడి ప్రజల బతుకులు బాణ సంచా మందుగుండు సామగ్రికి బుగ్గి పాలు అవుతున్నట్టు ఆ సర్వే తేట్టతెల్లం చేసింది. దీంతో ఇక్కడి వారి జీవన స్థితిని మెరుగు పరచడం, బాణ సంచా పరిశ్రమల్లో బతుకు నాశనం చేసుకుంటున్న చిన్న పిల్లల్ని విద్యా పరంగా ప్రోత్సహించేందుకు పాలకులు చర్యలు చేపట్టారు. చిన్న పిల్లలు బడిబాట పట్టినా, యుక్త వయస్సు వచ్చే సరికి తిరిగి బాణ సంచాల తయారీలో నిమగ్నం కావాల్సిందే.

 ఈ ఆధునిక యుగంలో సరి కొత్త తరహా బాణ సంచాల తయారీ వేగం పుంజుకోవడంతో పాటు పోటీతత్వం పెరగడంతో  వేలాది కుటుంబాలు తమ కుటీర పరిశ్రమలకు తాళాలు వేసుకోక తప్పలేదు. పొట్ట కూటి కోసం పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఆశ్రయించక తప్పలేదు.వీరికి రోజు వారిగా పీస్ రేట్(ఎన్ని బాణ సంచాలు తయారు చేస్తారో) దాని ఆధారంగా  వారానికి  లేదా నెలకో వేతనాలు ఇచ్చే పరిశ్రమలు ఉన్నాయి. దీంతో అధికంగా  పీస్‌లను తయారు చేయాలన్న ఆత్రుతతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. దిన దిన గండంతో కాలాన్ని నెటుకొస్తుంటారు. పరిశ్రమలోకి అడుగు పెట్టాక తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అన్న ఆందోళన కార్మికుల్లో ఉన్నా, బతుకు జీవనం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టక తప్పడంలేదు. దీనిపై రాష్ట్ర కార్మిక బోర్డు చూసి చూడనట్టు గతంలో వ్యవహరించడంతో 2012లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు.
 
మూల్యంతో కొరడా: శివకాశి పరిసరాల్లోకి అడుగు పెడితే చాలు, ఏదో ఒక గ్రామంలో ఎన్నో కుటుంబాలు బాణసంచా బాధితులుగా కనిపిస్తుంటారు. ఇక్కడి పరిశ్రమల్లో అగ్ని, ప్రమాదాల నియంత్రణకు చర్యలు అంతంత మాత్రంగానే గతంలో ఉండేది. ఓ సంస్థ పేరుతో లెసైన్స్‌లు పొంది, దాని ఆధారంగా మరెన్నో పరిశ్రమలు గతంలో నడిచేవి. ఇక్కడ 1981లో తొలిసారిగా పేలుడు చోటు చేసుకుంది. తదుపరి  2000 సంవత్సరం నాటికి  ఈ ప్రమాదాల్లో  మృతుల సంఖ్య 50గా తేలింది. తదుపరి ప్రతి ఏటా కనీసం 20 నుంచి 50 మంది వరకు మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతుంటాయి.  2002లో కోవిల్ పట్టి వద్ద జరిగిన బాణ సంచా పేలుడులో 16 మంది, 2005లో మానాంపట్టిలో 20 మంది, 2006లో బర్మా కాలనీలో 12 మంది, 2007లో నారాయణ పురంలో నలుగురు, 2009లో శ్రీకృష్ణ ఫైర్ వర్క్‌లో 18 మంది, అనిల్ ఫైర్ వర్క్స్‌లో ముగ్గురు, 2010లో ఏడుగురు, 2011లో 14 మంది చొప్పున ఒకే చోట ప్రమాదాల్లో విగత జీవులయ్యారు.

 2009లో  పళ్లిపట్టు సమీపంలో, శివకాశిలోని శ్రీకృష్ణ ఫైర్ వ ర్క్స్, అనిల్ ఫైర్ వర్క్‌లలో చోటు చేసుకున్న  బాణ సంచా ప్రమాదాలతో ప్రభుత్వం మేల్కొంది. బాణసంచా పరిశ్రమలకు కొత్త నిబంధనల్ని విధించినా ఆచరణలో విఫలమయ్యారు. కొన్ని రకాల పొటాషియం పదార్థాల్ని ఉపయోగించకూడదన్న నిబంధనలు ఉన్నా, ఆ పదార్థాలే ఇక్కడి పరిశ్రమల్లో పెద్ద ఎత్తున కనిపిస్తుంటాయి. పాలకులు, అధికారులు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం 2012లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓం శక్తి ఫైర్ వర్క్స్‌లో చోటు చేసుకున్న బాణ సంచా పేలుడుకు నలభై మంది మరణించారు. దీంతో మేలుకున్న అధికార వర్గాలు నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు.
 
జూన్ నుంచి తయారీ
ఒకప్పుడు నిత్యం తయారీలో నిమగ్నం అయితే, ప్రభుత్వ కొరడాతో జూన్ నుంచి పనుల్ని మొదలెట్టే పనిలో పడ్డారు. దీపావళికి ముందు రోజు వరకు ఈ పనులు కొనసాగించాల్సిందే. ఉత్తరాది నుంచి కూడా కూలీల్ని ఇక్కడికి రప్పించుకోవడం కొంత కాలంగా జరుగుతోంది. ఇక, శివకాశిలోని పరిశ్రమలు వ్యాపార దృక్పథంతో తమ సంస్థలను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరించే పనిలో పడ్డాయి. దీంతో 2013 నుంచి ప్రమాదాలు ఒక్క శివకాశినే కాదు, పలు జిల్లాలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. 2013లో అరియలూరు, విల్లుపురం, తూత్తుకుడిల్లోని పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో 13 మంది బలయ్యారు. 2014లో తంజావూరు జిల్లా కుంభకోణంలో తొమ్మిది మంది ఓ పరిశ్రమలో, 2014లో కాంచీపురం సమీపంలో ఐదుగురు, 2015లో కడలూరులో ఆరుగురు విగత జీవులయ్యారు.

ప్రమాదాల సంఖ్య తగ్గడం, మృతుల సంఖ్య కూడా తగ్గినా దీపావళి సమీపంలో ఈ బాణ సంచా రూపంలో దడ అన్నది మాత్రం తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో గురువారం శివకాశిలోని రాఘవేంద్ర ఫైర్ వర్క్స్ గోడౌన్‌లో పేలుడు మరోమారు ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది విగతజీవులు కావడం, మరో పది మందికి పైగా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో రెండేళ్లల్లో దీపావళి సందర్భంగా శివకాశిలో జరిగిన అతి పెద్ద పేలుడు ఇదే కావడం గమనార్హం. దీంతో మళ్లీ నిబంధనలకు తిలోదకాలు దిద్దే పనిలో పరిశ్రమల యాజమాన్యాలు ఉండబట్టే, ఈ ప్రమాదాలు అన్న ఆరోపణలు బయలు దేరాయి. ఇక, దీపావళి తర్వాత మూడు నెలల కాలం ఇక్కడి కుటుంబాలకు చేతిలో పనులు లేనట్టే. ఈ కాలంలో పొట్ట కూటి కోసం ఆయా పరిశ్రమల యాజమాన్యాల్ని ఆశ్రయించడం, అడ్వాన్స్‌లు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ అడ్వాన్స్ చెల్లింపుతో పాటు  తాజా బతుకు తెరువు కోసం రేయింబవళ్లు శ్రమించినా చివరకు మిగిలేది కన్నీళ్లే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement