బాణాసంచా తయారీలో శివకాశి కార్మికులు
సంతోషాల వెలుగుల వెనుక లక్షల చీకటి కథలున్నాయి. పండుగల మతాబుల మాటున ఎన్నో కన్నీటి వ్యథలున్నాయి. అవే.. శివకాశి బాణసంచా తయారీ వెనుక కన్నీటి గాథలు. దీపావళి పండుగొస్తుందంటే.. ఆంక్షలు, అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాలు శివకాశిలో జీవనంపై అధిక ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. శివకాశీల జీవనంపై, దక్షిణ కాశిగా పేరొందిన శివకాశి చరిత్రపై ఫోకస్.
మనం ఏడాదికోసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం వారు ఏడాదంతా కష్టపడతారు. అదే వారి జీవనాధారం.. అదే వారి జీవితం. తమిళనాడు రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివకాశి పట్టణంలోనే బాణసంచా కర్మాగారాలు నెలకొనడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. దాదాపు వందేళ్ల బాణసంచా తయారీ కర్మాగారాల చరిత్ర కలిగిన శివకాశికి కుట్టి (చిన్న) జపాన్ అని పేరు ఉంది. 20వ శతాబ్దంలో ఇక్కడ 30 మందితో ప్రారంభమైన టపాసుల తయారీ కేంద్రం, 1100 భారీ కర్మాగారాలు, 8 వేల కుటీర పరిశ్రమల స్థాయికి ఎదిగింది.
నేటికి దాదాపు ఆరులక్షల మందికి ఉపాధిని అందించింది. ఇదే ప్రాంతానికి చెందిన షణ్ముగ అయ్యర్ నాడార్ 1908లో 30 మందితో చిన్నపాటి బాణసంచా తయారు చేసే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. అది రెండేళ్లలో 12 యూనిట్లు అయ్యేలా అభివృద్ధి చెందింది. దీనిని చూసి కొందరు ఔత్సాహికులు ఇదే వ్యాపారంగా మొదలుపెట్టారు. అలా వేలాదిగా కర్మాగారాలు, కుటీర పరిశ్రమలు లక్షలాదిగా ఉపాధి పొందే అవకాశం కలగటం ఈ ప్రాంతం దినదినాభివృద్ధితో ప్రపంచంలోనే బాణసంచా తయారీలో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా నిలిచింది.
ఇక్కడే ఎందుకు ఏర్పడ్డాయి?
శివకాశి పూర్తిగా మెట్టప్రాంతం. సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి నిల్వలు తక్కువ. సారవంతమైన భూమి కూడా కాదు. భూమిలో రసాయనాలు కలుస్తుండటంతో ఆ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. నదులు, సాగునీరు లేకపోవటంతో చేతి వృత్తులు, ఉపాధి పనులు తప్ప మరో మార్గం లేదు. అందుకే ఇక్కడ ప్రజలు బతుకు తెరువు కోసం ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్లేవారు. దీంతో షణ్ముగ నాడార్ టపాసుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించటంతో ప్రజలు వీటిని తయారుచేసుకుంటూ జీవనం సాగించడం ప్రారంభించారు.
ఒకప్పుడు జీవనోపాధి కోసం బయటి ప్రాంతాలకు వలస వెళ్లేవారు, ఇప్పుడు బయటి ప్రాంతాల నుండి ఇక్కడి ఉపాధికి వచ్చే స్థాయికి ఎదిగారు. దీంతో శివకాశి చుట్టూ పుట్టగొడుగుల్లా బాణసంచా కర్మాగారాలు పుట్టుకొచ్చాయి. ప్రమాదాలు, ఆంక్షల దృష్ట్యా కర్మాగారాలు విశాలంగా ఊర్లకు దూరంగా ఏర్పాటు చేశారు. అయితే ఏటా ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షల వల్ల వ్యాపారం మూతపడి ఆందోళనకరంగా మారుతోంది. గతేడాది 5 వేల కోట్ల నుండి 6 వేల కోట్ల రూపాయల మేరకు జరిగిన వ్యాపారం, ఈ ఏడాది ఆంక్షల కారణంగా 3 నుండి 4 వేల కోట్లకు తగ్గుముఖం పట్టడం శివకాశి బాణసంచా తయారీదారులపై ప్రభావం చూపుతోంది.
ఇక్కడి నుండి ఏటా 80 నుండి 90 శాతం బాణసంచా దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతుంది. జపాన్, చైనాల తర్వాత ఇంత భారీ ఎగుమతులు జరుగుతుండటం శివకాశి ఘనత. ఈ ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు తయారీదారులు, వ్యాపారం సగానికి పడిపోయేందుకు కారణమైంది. ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది.
వెలుగు చాటున చీకటి!
శివకాశిలో బాణసంచానే వృత్తిగా జీవిస్తున్న లక్షలాది ప్రజలు ఈ పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నారు. ప్రమాదమని తెలిసినా అదే జీవితంగా జీవిస్తారు. వారికదే ఆధారం. అవి లేకపోతే పస్తులుండాల్సిందే. ఏడాదికి పది నెలలు వీటిపైనే ఆధారపడతారు. ప్రమాదమని భయపడితే బతికే మార్గమే లేదు. భయంతో శివకాశిని వదిలేసిన వారెందరో ఉండొచ్చు కానీ ఇదే జీవితం అని నమ్మి వృత్తే దైవంగా భావించేవారే ఎక్కువ. మిగిలిన పనులకన్నా ఇక్కడ పనికి కూలి కాస్తంత అధికంగా దొరకటమే కారణం.
జీవితమంతా పోరాటమే... చస్తామనే భయం కన్నా... బతికినన్నాళ్లూ సంతోషంగా కన్నీళ్లను దిగమింగి బతకాలనుకుంటారు. ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. పట్టించుకోవాల్సింది ప్రభుత్వాలు. అధికారులు.. నిబంధనలు, నియమాలు.. ఆంక్షలు సక్రమంగా ప్రమాదాలు ఉండవనేవి అక్కడి కార్మికుల మాట. ఒకవేళ ఆంక్షల పేరుతో పరిశ్రమలు మూతపడితే మళ్లీ వీరి జీవితాలు రోడ్డునపడతాయి.
అందుకే వీటిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న కూలీలు, కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఉపాధి కల్పించటానికి ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది లక్షల మంది! ప్రభుత్వాలు కూడా ఈ పరిశ్రమలు మూతపడకుండా కేంద్రాలుగా కొన్ని ఆంక్షలతో నడపాలి. ఏటా పండుగ వెలుగులను అందించే శివకాశీల జీవితాలు వెలుగులోకి రావాలని కోరుకుందాం.. పండుగ వెలుగులను అందరికీ పంచుదాం..
– సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి టీవీ, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment