నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: సమైక్య సమ్మె ప్రభావం, పడకేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆర్థికమాంధ్యం, భారీగా పెరిగిన బాణసంచా ధరలు వెరసి వెలుగుల పండగ దీపావళిని కళ తప్పేలా చేశాయి. మూడు రోజులుగా ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షం బాణసంచా అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా బాణసంచా అమ్మకాలు భారీగా తగ్గినట్టు వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సగటున 30 శాతం వరకు బాణసంచా ధరలు పెరిగాయని వ్యాపారులే అంగీకరిస్తున్నారు.
తగ్గిన అమ్మకాలు
దీపావళి సందర్భంగా జిల్లాలో సుమారు 2000కు పైగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. నెల్లూరు నగరంలోని వీఆర్‌సీ, వైఎంసీ, కస్తూర్బా విద్యాలయాల మైదానాలతో పాటు గూడూరు, కావ లి, సూళ్లూరుపేట, వెంకటగిరి తదితర ప్రాంతా ల్లో టపాసుల దుకాణాలు వెలిశాయి. గత ఏడాది దాదాపు రూ. 5 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఈ ఏడాది బాణసంచా అమ్మకాలు బాగా పడిపోయినట్టు హోల్‌సేల్ వ్యాపారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ ఏడాది రూ.4 కోట్ల వ్యాపారం కూడా జరగలేదంటున్నారు.
భారీగా పెరిగిన బాణసంచా ధరలు
గత ఏడాది పెద్ద చిచ్చుబుడ్లు రూ.800 ఉన్న ప్యాకెట్ ఈ ఏడాది రూ. 1100కు పెరిగింది. చిన్న చిచ్చుబుడ్లు రూ. 500 నుంచి రూ.700కు పెరిగాయి. పెద్ద సైజు భూచక్రాలు రూ. 150 నుంచి రూ. 240, రాకెట్లు రూ. 200 నుంచి రూ. 290, కాకరవొత్తులు రూ. 80 నుంచి రూ. 120కు ఎగబాకాయి. ఇక బాంబుల ధరలు ముట్టుకుంటే పేలేంత తీవ్రంగా ఉన్నాయి. లక్ష్మీ బాంబులు ప్యాకెట్ రూ. 400 నుంచి రూ. 600, హైడ్రోజన్, వంకాయ బాంబులు రూ.300కు పైగా పెరిగాయి. 2వేలు, 5వేలు, 10వేలు సరాల ధరలు భారీగా పెంచారు. స్టాండర్డ్ కంపెనీ బాణసంచా కొనేందుకు వినియోగదారులు భయపడేంతగా ధరలు ఉన్నాయి.
సమ్మె ప్రభావం
రాష్ట్ర విభజన నిర్ణయంతో ఉద్యోగులు దాదాపు 60 రోజులకు పైగా నిరవధిక సమ్మె బాట పట్టారు. దీంతో ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి వేతనాలు చెల్లించలేదు. రెండు కాకరవత్తులు, రెండు చిచ్చుబుడ్లు కొనాలంటేనే దాదాపు రూ. 1000 ఖర్చు పెట్టాల్సి రావడంతో ఎక్కువ మంది ఉద్యోగులు అరకొరగానే దీపావళి పండగను చేసుకున్నారు. కొంతమంది చిరు ఉద్యోగులు దీపావళి పండగకు దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడకేసింది. జిల్లాలో 10 శాతం కూడా క్రయ, విక్రయాలు జరగలేదు. పలువురు రియల్ ఎస్టేట్‌పై పెట్టిన పెట్టుబడులు నిలచిపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. వీటితో పాటు నిత్యావసర, కూరగాయలు, పెట్రో, డీజిల్, గ్యాస్ తదితర ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ప్రభావంతో దీపావళి కళ తప్పింది.
కళ తప్పిన దీపావళి
Published Mon, Nov 4 2013 2:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement