మృత్యువు పేల్చిన ‘ప్రాణసంచా’
దీపావళికి మూడురోజులు ముందే మృత్యువు.. ఆ గ్రామంలో ‘ప్రాణసంచా’తో పండుగ చేసుకుంది. అమావాస్య రాత్రిని వన్నెవన్నెల వెన్నెలతో నింపే కృషిలో నిమగ్నమైన వారిపై కన్నెర్రజేసింది. వారినే సీమటపాసుల్లా పేల్చేసి, తునాతునకలు చేసింది. బతుకుతెరువుకు తయారు చేస్తున్న బాణసంచానే చితిగా ముట్టించి వారిని సజీవ దహనం చేసింది. పండుగ మర్నాటి ఉదయం వీధుల్లో కనిపించే.. కాల్చేసిన చిచ్చుబుడ్లు, భూచక్రాలు, మతాబుల అవశేషాల మాదిరిగా మిగిలిన వారి శరీరాలతో ఆ తయారీ కేంద్రాన్ని భయానకంగా మార్చింది. వేలమంది ముంగిళ్లలో ఆనందాల వెలుగులు విరబూయించబోయిన ఆ బడుగుజీవుల ఆత్మీయులను చిమ్మచీకటి లాంటి శోకం కమ్ముకుంది. ‘కాంతుల పర్వం’ వారికి జీవితాంతం వెన్నాడే పీడకలగా మిగిలింది.
* వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రంలో విస్ఫోటం
* 12 మంది మృత్యువాత, ఏడుగురికి తీవ్రగాయాలు
* చికిత్స పొందుతున్న వారిలో 5గురి పరిస్థితి విషమం
* తునాతునకలైన మృతదేహాలు, నామరూపాల్లేని ఫైర్‌వర్క్స్
* బాధితులంతా రెక్కల కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులే..
* దీపావళికి ముందు ఘోర దుర్ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా
* ప్రమాద కారణంపై వ్యక్తమౌతున్న భిన్నాభిప్రాయాలు
పిఠాపురం/ అమలాపురం : ఒకవైపు కొబ్బరి తోపు.. మరోవైపు పచ్చని వరి చేలు.. వాటి మధ్య బాణ సంచా తయారీ కేంద్రం.. పండుగ దగ్గర పడుతున్నందున చకచకా బాణసంచా తయారు చేస్తున్న కార్మికులు..అక్కడ దీపావళి పండుగకు మూడురోజుల ముందే సందడిసందడిగా ఉంది. అది చూసి కన్నుకుట్టిన మృత్యువు కుట్ర పన్నినట్టు.. అంతలోనే మహా విస్ఫోటం. కార్చిచ్చులాంటి అగ్నికీలలు. ఏం జరిగిందో తెలిసే లోపే కొందరు గడ్డిపరకల్లా సజీవ దహనమయ్యారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలో జరిగిన ఘోర దుర్ఘటన గ్రామాన్ని శోకపుకుప్పగా మార్చేసింది. వాకతిప్పలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ మణికంఠ ఫైర్‌వర్క్స్‌లో సోమవారం మధ్యాహ్నం 3.05 గంటల సమయంలో సంభవించిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కుతుకుడుమిల్లి శివారు పెదకల్వలదొడ్డికి చెందిన కొప్పిశెట్టి వెంకటరమణ పాతకాలపు పెంకుటిల్లు, రేకులషెడ్లలో నిర్వహిస్తున్న ఈ బాణసంచా తయారీ కేంద్రంలో సొంతంగా తయారు చేసిన రకరకాల మందుగుండు సామగ్రితో పాటు వివిధ కంపెనీల బాణసంచానూ పెద్ద ఎత్తున నిల్వ చేశారు. సోమవారం కేంద్రంలో 25 నుంచి 30 మంది కార్మికులు బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. కేంద్రం బయట వెంకటరమణ పెద్ద కుమారుడు అప్పారావు, భార్య లక్ష్మి బాణసంచా అమ్మకాలకు టెంటు వేయిస్తున్నారు. ఆ సమయంలో భయంకరమైన పేలుడు సంభవించింది. దీపావళికి ముందు జరిగిన ఈ ఘోరంతో జిల్లా ఉలిక్కిపడింది. కాగా, కాకినాడ అపోలో ఆస్పత్రిలో క్షతగాత్రులను రాష్ర్ట వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు.
ప్రముఖుల పరామర్శ
వాకతిప్పలో పేలుడు బాధిత కుటుంబాలను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పరామర్శించారు. ప్రమాదస్థలాన్ని చూసి వారు చలించిపోయారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ బాధితులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు బాధిత కుటుంబాలను ఓదార్చారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నట్టు సమాచారం.
మృతుల్లో ఎక్కువ మంది మహిళలే
దుర్ఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు స్థానిక పీహెచ్‌సీలో, ఇద్దరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో అత్యధికులు మహిళలే. కూలి తక్కువన్న కారణంతో బాణసంచా తయారీలో మహిళల్నే ఎక్కువగా వినియోగిస్తున్నట్టు చెపుతున్నారు. ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడుతో వాకతిప్పవాసులు భూకంపం వచ్చినట్టు కంపించిపోయారు. జరిగింది గుర్తించినా దుర్ఘటనాస్థలం వద్దకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. కొంతమంది ధైర్యం చేసి వెళ్లగా అక్కడి పరిస్థితిని చూసి గుండె చెదిరిపోయింది.
రెప్పపాటులో కాలిన మాంసపు ముద్దల్లా మారిన వారి శరీరాలు గుర్తించలేనంతగా ఛిద్రమయ్యాయి. కొన్ని అవయవాలు తునాతునకలై 50 మీటర్ల దూరంలో కొబ్బరి తోటలు, పంట పొల్లాల్లో పడ్డాయంటే.. విస్ఫోటం తీవ్రత అర్థమవుతుంది. స్థానికంగా 108 అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో గాయపడినవారిని ఆటోల్లో తరలించాల్సి వచ్చింది. ఈ ఘోరానికి కారణం తెలియరాకున్నా బాణ సంచా తయారీ సమయంలో నిప్పు రాజుకుందని కొందరు అంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా దుర్ఘటన జరిగి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది.
కంపించిన ఆ మూడు గ్రామాలు
పేలుడు తీవ్రతకు మణికంఠ ఫైర్‌వర్క్స్ నిర్వహిస్తున్న ఇల్లు, షెడ్లు నామరూపాల్లేకుండా పోయాయి. వాటిని అనుకుని ఉన్న కొబ్బరి, మామిడిచెట్లు మాడిమసైపోయాయి. పేలుడు సమయంలో చుట్టుపక్కల మూడు గ్రామాల్లో భూకంపం వచ్చినట్టు ప్రకంపనలు వచ్చాయి. బాణసంచా కేంద్రానికి సమీపంలో ఉన్న ఇళ్లలో కిటికీలు తలుపులు కొట్టుకోవడంతో పాటు టేబుళ్ల వంటి వాటిపైనున్న వస్తువులు ఎగిరి నేలమీద పడిపోయాయి. మణికంఠ ఫైర్‌వర్క్స్ ఊరికి దూరంగా కొబ్బరితోటలు, వరి చేలను అనుకుని ఉండడం వల్ల మరింత దారుణం తప్పినట్టయింది.
అదే గ్రామానికి ఆనుకుని ఉంటే జరిగే నష్టం ఊహించజాలమని స్థానికులు అన్నారు. పేలుడు సమయంలో కొనుగోలుదారులు లేరని, అదే అమ్మకాలు మొదలయ్యాక ఈ దుర్ఘటన జరిగి ఉంటే చోటు చేసుకునే విషాదం తలచుకుంటేనే వణుకు పుడుతోందన్నారు. జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన శకటంతోపాటు మరోమూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు విస్ఫోటం జరిగితే సాయంత్రం 5.30 గంటల వరకు మంటలు రగులుతూనే ఉన్నాయి.