రూ.25 కోట్లు.. ఇదీ దీపావళి బిజినెస్
ఆదిలాబాద్ : కొత్త రాష్ట్రంలో దీపావళి పండుగను జిల్లా వాసులు ఉత్సాహంగానే జరుపుకున్నారు. లక్ష్మీ కటాక్షం కోసం ఘనంగా పూజలు నిర్వహించి బాణాసంచా పేల్చి సందడి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పండుగ జోరు తగ్గలేదు. ప్రధానంగా దసరా సమయానికే పంటలు చేతికొచ్చి రైతుల చేతుల్లో కాసులు గలగలలాడేవి. ఈసారి అనుకున్న విధంగా పంటలు చేతికి రాకపోవడం, మార్కెట్‌లో పూర్తిస్థాయిలో పంట కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైనా సరైన మద్దతు ధర లేక రైతులకు పండుగ కళ తప్పింది. అయినా.. కొనుగోళ్ల జోరు మాత్రం తగ్గలేదు. బాణసంచా, మిఠాయిలు, పువ్వులు, పండ్లు, పూజ సామగ్రి, బంగారం, కొత్త వాహనాలు, దుస్తులు, మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోళ్లలో జిల్లా ప్రజలు రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేశారు.
టపాసులపై రూ.7 కోట్ల ఖర్చు..
జిల్లా ప్రజలు టపాసులపై రూ.7 కోట్ల వరకు వెచ్చించారు. ఆదిలాబాద్‌లోనే సుమారు రెండున్నర కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో టపాసుల విక్రయాల కోసం సుమారు 70 దుకాణాలు ఏర్పాటు చేయగా, ఒక్కో దుకాణంలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వ్యాపారం జరిగినట్లుగా చెబుతున్నారు. మంచిర్యాల, నిర్మల్‌లోనూ దాదాపు అదేస్థాయిలో ఉంది. పువ్వులు, పండ్లు, పూజా సామగ్రి కోసం రూ.2.5 కోట్లు వెచ్చించారు. మిఠాయిలపై రూ.50 లక్షలు ఖర్చు చేశారు. ద్విచక్ర వాహనాల అమ్మకాలూ జోరుగా సాగాయి. లక్ష్మీపూజల రోజు మంచిర్యాలలో సుమారు 300లకు పైగా బైక్‌లు, ఆదిలాబాద్‌లో 200లకు పైగా అమ్ముడుపోయాయి. మొత్తంగా రూ.3 కోట్లు వాహనాలపై వెచ్చించారు. పండుగ నేపథ్యంలో రెడీమేడ్ బట్టల దుకాణాలు, మొబైల్, ఎలక్ట్రానిక్ షాపులు, వాహనాల షోరూంలు పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి.
మొబైల్ ఫోన్లు ఒకటి కొంటే మరొకటి ఉచితమని, ఒకటి కొంటే రెండు ఫ్రీ అనే ఆఫర్లతో పలు షాపులు పెద్ద పెద్ద బ్యానర్లతో ఆకట్టుకున్నాయి. దీపావళికి కొత్త బట్టల కోసం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, బెల్లంపల్లి, భైంసా తదితర ప్రాంతాల్లో జోరుగా వ్యాపారం జరిగింది. రూ.3.5 కోట్ల వరకు దుస్తువులపై వెచ్చించారు. మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్రధానంగా టీవీల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆదిలాబాద్ పట్టణంలో పండుగ సందర్భంగా వెయ్యికి పైగా సెల్‌ఫోన్‌లు అమ్ముడుపోగా.. రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరిగింది. బంగారం అమ్మకాలు ప్రధానంగా మంచిర్యాలలో అధికంగా జరిగాయి. అక్కడ 2.5 కిలోల బంగారం అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. జిల్లా అంతటా కలిపి కోటిన్నర రూపాయల విలువైన బంగారం విక్రయం జరిగింది. ఆదిలాబాద్‌లో బంగారం అమ్మకాల పరంగా నిస్తేజం కనిపించిందని బులియన్ మార్కెట్ అభిప్రాయ పడుతోంది. గత దీపావళికి 2 కేజీల బంగారం అమ్ముడుపోయిందని, ఈసారి నామమాత్రంగా విక్రయాలు జరిగాయని అంటున్నారు.