=నిరుటితో పోలిస్తే 20శాతం పెరుగుదల
=తగ్గిన హోల్‌సేల్ అమ్మకాలు
=కనిపించని దీపావళి సందడి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : బాణసంచా ధరలు తారాజువ్వల్లా నింగికెగశాయి. సామాన్యులకు భారంగా మారాయి. నిరుటితో పోల్చితే అన్నిరకాల మందుగుండు సామాగ్రి ధరలు 20 శాతం పెరిగాయి. వరదలు, సమైక్య ఉద్యమం ప్రభావంతో జనం వద్ద డబ్బు లేదని గ్రహించిన హోల్‌సేల్ వ్యాపారులు స్టాక్‌ను గణనీయంగా తగ్గించారు. ఈ ఏడాది వాతావరణం కూడా అనుకూలించే పరిస్థితి లేదని వ్యాపారులు భావిస్తున్నారు. నిరుటి కంటే ఈ ఏడాది హోల్‌సేల్ వ్యాపారం కూడా తగ్గినట్లు చెబుతున్నారు.
టపాసుల ధరలను టోకు వర్తకులు 10 శాతం పెంచారు. చిల్లర వర్తకులు మరో 10 శాతం పెంచి వసూలు చేస్తున్నారు. ఏటా నగరంలోని మార్కెట్‌లో దాదాపు 120 రకాల టపాసులు విక్రయానికి ఉంచేవారు. ఈసారి 90 రకాలే అందుబాటులో ఉన్నాయి. దుకాణాల కేటాయింపు, అనుమతుల జారీ ప్రక్రియలో మామూళ్లు దండుకుంటున్న అధికారులు ధరలు నియంత్రణను గాలికి వదిలేస్తున్నారు. ఈసారి బాణసంచా కొనటమంటే చేతులు కాల్చుకోవటమేగా మారింది. బాణసంచాను స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్‌గా విభజించి డిస్కౌంట్లుపేరుతో టోకు వ్యాపారులు దగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
స్టాండర్డ్ వెరైటీపై 30 శాతం, నాన్ స్టాండర్డ్‌పై 70 నుంచి 80 శాతం డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. టోకు, చిల్లర వ్యాపారులు కుమ్మక్కై నాన్ స్టాండర్డ్ ప్యాకెట్లపై స్టాండర్డ్ లేబుల్స్ అంటించి జనాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా జిల్లాలో రూ. 25 కోట్ల నుంచి రూ. 30కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. 2012లో నగరంలో 130 షాపుల్లో రూ.5కోట్లు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని దాదాపు 350 షాపుల్లో రూ. 25 కోట్లకు మించి వ్యాపారం జరిగినట్లు అంచనా. ఈ ఏడాది ఇప్పటికే వ్యాపారులు అమ్మకాలు ప్రారంభించారు.
దీపావళికి ముసురు భయం...
ఇదిలా ఉండగా ఈ సంవత్సరం వ్యాపారులకు ముసరు భయం పట్టుకుంది. దీపావళికి ముసురు పడితే సరకు కొనుగోళ్లు జరుగుతాయో లేదోననే ఆందోళనలో ఉన్నారు. ఏటా దీపావళికి వారం ముందునుంచే పట్టణాలు, పల్లెల్లో బాంబుల మోత వినిపించేది. ఈ సంవత్సరం పండగ సమీపిస్తున్నా బాణసంచా వెలుగులు కనపడటం లేదు.