కదలాల్సిందే..
- 28లోపు బదిలీ ఆప్షన్లకు అవకాశం
- 29న కౌన్సెలింగ్
- 30న ఉత్తర్వులు జారీ
- 1 నుంచి కొత్త పోస్టింగ్‌ల్లో చేరిక
- ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ
సాక్షి, విశాఖపట్నం : బదిలీల గడువు దగ్గర పడే కొద్ది ప్రభుత్వ యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది. ఒకటి రెండు శాఖలు మినహా దాదాపు అన్ని శాఖల్లోనూ బదిలీలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నెలాఖరుకల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా యం త్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రక్రియను 29కల్లా పూర్తి చేసి, 30న జిల్లాకు వస్తున్న ఇన్‌చార్జి మంత్రితో ఆమోద ముద్ర వేయించి పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తున్నారు. జిల్లా పరిధిలో 46 ప్రభుత్వ శాఖల పరిధిలో 491 క్యాడర్లలో పనిచేస్తున్న 8,402 మంది ఉద్యోగుల్లో 3,094 మంది బదిలీకి అర్హులుగా లెక్కతేల్చారు.
అన్ని క్యాడర్లలో మూడో వంతు అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. శాఖల వారీగా తయారు చేసిన జాబితాలపై కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. వీటిపై కలెక్టర్, మంత్రుల స్థాయిలో సమీక్షలు కూడా జరిగాయి. పారదర్శకంగా పూర్తిచేసే బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుని ఏ ఒక్కరికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తకుండా బదిలీలు పూర్తిచేయాలని మంత్రులు ఆదేశించారు. దీంతో శాఖల వారీగా అర్హులైన వారి నుంచి మూడు ఆప్షన్లు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ 27, 28 తేదీల్లో పూర్తవుతుంది. ఆప్షన్లను బట్టి 29వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
తుది జాబితాలపై 30న జిల్లాకు రానున్న ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణుడుతో ఆమోద ముద్ర వేయించి అదే రోజు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. 1వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది. జాబితాలో ఉన్న వారితో పాటు మూడేళ్ల లోపు సర్వీసు ఉన్న వారిలో కూడా చాలా మందికి స్థానచలనం తప్పేటట్టు కన్పించడం లేదు. ఈ జాబితాను స్థానిక ప్రజా ప్రతినిధులు శాఖల వారీగా అందజేశారు. మరొక పక్క తమ నియోజకవర్గాల్లో కావాలని కోరుకునే అధికాారులు, ఉద్యోగుల కోసం సిఫార్సు లేఖల జారీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బిజిగా ఉన్నారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై మొదటి వారంలో జిల్లా స్థాయి క్యాడర్‌లో పనిచేసే వారి బదిలీలు జరగనున్నాయి. స్థానచలనం తప్పదని భావిస్తున్న ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారు ఇప్పటికే బదిలీలను ఆపుకునేందుకు మంత్రుల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు.