తవ్వకాలతో తేలిన లారీక్యాబిన్ ఇనుపరేకులు
సాక్షి, కరీంనగర్‌రూరల్ : మూడు దశాబ్దాల క్రితం.. భారీ వరదల కారణంగా ఇరుకుల్ల వాగులో గల్లంతైన లారీ ఆనవాళ్లు కనిపించాయి. ఇసుక తవ్వకాలతో లారీ విడిభాగాలు బయటపడ్డాయి. గల్లంతైన లారీ కనిపించడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. 1984లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వారంపాటు కురిసిన భారీవర్షాలకు కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. పాత వంతెనపైనుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన లారీలో డ్రైవర్ సలీం, కటికె శంకర్ (పశువుల వ్యాపారి) వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా లారీ వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో లారీతోపాటు డ్రైవర్, పశువుల వ్యాపారి ఇద్దరూ గల్లంతరయ్యారు.
అనంతరం రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగంగా ఇరుకుల్ల వాగుపై కొత్త వంతెన నిర్మించారు. దీంతో పాతవంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా ఇరుకుల్ల వాగునుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లద్వారా ఇసుక తరలిపోతోంది. పాత వంతెన సమీపంలో మూడురోజుల క్రితం ఇసుక తవ్వుతుండగా.. అప్పుడు గల్లంతయిన లారీ విడి భాగాలు బయటపడ్డాయి. లారీ క్యాబిన్ ఇనుప రేకులు కన్పిస్తున్నాయి. దాదాపు 34ఏళ్ల క్రితం వాగులో గల్లంతైన లారీ విడిభాగాలు ప్రస్తుతం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. లారీ కనిపిస్తోందనే సమాచారంతో దుర్శేడ్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్ గ్రామస్తులు వచ్చి ఆసక్తిగా పరిశీలిస్తూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment