ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసిన వారిని ఉద్దేశించే కాబోలు, ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత పుట్టి ఉండవచ్చు. ఉదాహరణకు... రామాయణంలో సుగ్రీవుడి సచివుడిగా మొట్టమొదటిసారి హనుమ రాముడిని కలిశాడు. నాలుగు మాటలు మాట్లాడాడు. వెంటనే రాముడు లక్ష్మణుడితో – ‘‘చూశావా? ఇతను నవ వ్యాకరణ పండితుడు. శాస్త్రాలన్నీ చదివినవాడు. మాటలో తడబాటులేదు. అస్పష్టత లేదు. అసందిగ్ధం లేదు. కొట్టినట్లు లేదు. మృదువుగా, ప్రియంగా ఉంది. ఎంత మాట్లాడాలో అంతే, అర్థవంతంగా, మనసుకు హత్తుకునేలా మాట్లాడుతున్నాడు’’ అని మెచ్చుకున్నాడు. అంటే హనుమ మాటలకే రాముడు మంత్రముగ్ధుడయ్యాడన్నమాట.
మరో సందర్భంలో హనుమ మాటలు సీతమ్మకు ఉపశమనంలా అనిపించాయి. అంతులేని నిర్వేదంలో ఉన్న సీతమ్మ, హనుమ మాటలకు దుఃఖం నుంచి తేరుకుంది. అదెప్పుడో చూద్దామా..? అప్పటికి పదినెలలుగా సీతమ్మ కంటికి మంటికి ఏకధారగా విలపిస్తోంది. హనుమ అశోక వనం చేరి – ఆమె సీతమ్మేనని నిర్ధారించుకున్నాడు. ఆమె కూర్చున్న చెట్టుకొమ్మ మీద అంతా గమనిస్తూ ఉన్నాడు. ఈ లోపు తెల్లవారకముందే రావణాసురుడు మందీమార్బలంతో బయలుదేరాడు.
రాముడు ఉన్నాడో లేడో, ఉన్నా రాలేడు. ఇక రెండు నెలలు గడువిస్తా. అయినా మనసు మారకపోతే, గడువు తరువాత రోజు ఉదయం ఫలహారంగా సీతను తింటానని – హుంకరించి వెళ్ళిపోయాడు. రావణుడి మాటలతో రాక్షసులు మరింతగా సీతమ్మను ఏడిపించారు. సీతమ్మకు అంతులేని వేదన. తనను తాను చంపుకుందామన్నా తగిన వస్తువు అందుబాటులో లేదు. తన జడనే చెట్టుకొమ్మకు బిగించి, ఆపై మెడకు బిగించుకుందామని సిద్ధం కాబోతోంది.
ఇంతలో హనుమ మెరుపులా స్పందించాడు. హనుమంతుడు... రామకథను, గంధర్వగానంగా, మృదువుగా అమ్మకు చైతన్యం కలిగేలా, రాక్షసులకు నిద్రవచ్చేలా, మైథిలీ ప్రాకృత భాషలో, అది కూడా అయోధ్యా మాండలికంలో ప్రారంభించాడు. అమృతపు జల్లువంటి ఆ మాటలతోనే సీతమ్మ ఎంతో సాంత్వన పొందింది. ఆ తర్వాత హనుమ తనకోసం ఎదురు చూస్తున్న వానరులతో, రామలక్ష్మణులతోనూ ‘‘చూశాను సీతను’’ అని చెప్పాడు. అంటే సూటిగా స్పష్టంగా చెప్ప వారికి ఉపశమనం కలిగించాడు.
Comments
Please login to add a commentAdd a comment