ఉడతాభక్తి
నానుడి
రామాయణంలోని చిన్న ఉదంతం నుంచి పుట్టిన నానుడి ఇది. లంకలో ఉన్న సీతను తీసుకు రావడానికి రామలక్ష్మణులు సుగ్రీవుని అధీనంలోని వానరసైన్యంతో యుద్ధానికి బయలుదేరతారు. సముద్రానికి ఆవల ఉన్న లంకను చేరుకునే శక్తి వానర యోధుల్లో కొద్ది మందికి తప్ప అందరికీ లేదు. సుగ్రీవుడి సేనాని నీలుడికి సముద్రంపై ఎలాంటి పదార్థాన్నయినా తేలియాడేలా నిలిపే శక్తి ఉంది.
లంక వరకు వారధి నిర్మించడానికి వానర యోధులు యథాశక్తి పెద్దపెద్ద బండరాళ్లను సముద్రంలో పడవేస్తుంటారు. అది చూసిన ఓ ఉడతకు రామునికి సాయం చేయాలనిపిస్తుంది. తన శక్తి మేరకు నోటితో చిన్న చిన్న మట్టిబెడ్డలను తీసుకొచ్చి సముద్రంలో పడవేయసాగింది. బృహత్తర కార్యక్రమానికి ఆ స్థాయిలో కాకున్నా, శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో చేసే తన వంతు సాయాన్ని ఉడతాభక్తి అనడం వాడుకగా మారింది.