మానవేతిహాసమే రామాయణం
‘ర’ అంటే కాంతి. ‘మ’ అంటే నేను అని అర్థం. రామ అంటే ‘నా లోపలి వెలుగు’ అని భావం. రాముడి తలిదండ్రులు కౌసల్య, దశరథులు. దశరథ అంటే పది రథాలు. ఈ పది రథాలూ మన పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలనూ సూచిస్తాయి. కౌసల్య అంటే నైపుణ్యం (కుశలత). అయోధ్య అంటే హింసలేని సమాజం అని అర్థం. మీ లోపల ఏం జరుగుతోందో మీరు కుశలతతో గమనిస్తే మీలో జ్ఞానకాంతి ఉదయిస్తుంది. అదే ధ్యానం. మానసిక ఒత్తిడినుంచి విశ్రాంతి పొందేందుకు మీకు కొంత నైపుణ్యం కావాలి. మీ లోపల వెలుగు ఉదయించినప్పుడు మీరే రాముడు. మనసు లేదా బుద్ధి సీతకు చిహ్నం. సీత రావణుని చేత అంటే బుద్ధి అహంకారం చేత అపహరింపబడింది. రావణునికి పది తలలు.
రావణుడు (అహంకారం) తన తలలలో అంటే అహంకారపు ఆలోచనలలో చిక్కుకుపోయి ఉన్నాడు. హనుమ అంటే శ్వాస. హనుమంతుని (శ్వాస) సహాయంతో సీత (బుద్ధి) తిరిగి రాముని వద్దకు (మూలానికి) చేరుకోగలిగింది. అంటే రామాయణం ఒక మానవేతిహాసం. జర్మనీలోని రామ్‌బాగ్, ఇటలీలోని రోమ్ పట్టణాల పేర్లకు మూలం రామ శబ్దమే. ఇండోనేసియా, బాలి, జపాన్ వంటి దేశాలు రామాయణ ప్రభావానికి లోనైనాయి.
- శ్రీ శ్రీ రవిశంకర్, వ్యవస్థాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్