భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్‌ను కూడా పంచుకున్నారు.
ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్‌లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment