థ్యాంక్స్‌ మోదీ... థ్యాంక్స్‌ డీడీ | Ramayana Launched On Doordarshan Channel | Sakshi
Sakshi News home page

థ్యాంక్స్‌ మోదీ... థ్యాంక్స్‌ డీడీ

Published Sun, Mar 29 2020 5:18 AM | Last Updated on Sun, Mar 29 2020 5:19 AM

Ramayana Launched On Doordarshan Channel - Sakshi

ప్రపంచమంతా కరోనా కల్లోలం కారణంగా ఇంటి గడపదాటని స్థితి. ప్రధాని పిలుపుతో లాక్‌డౌన్‌ వల్ల ప్రజలందరితో పాటు సెలబ్రిటీలు సైతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. దూరదర్శన్‌ ఛానెల్‌ 32 ఏళ్లకిందట ప్రసారం చేసిన ‘రామాయణ్‌’ సీరియల్‌ని మళ్లీ ప్రసారం చేస్తోంది. దీంతో పెద్దవాళ్లు, సెలబ్రిటీలు రామాయణాన్ని టీవీలో తిలకిస్తూ తమ బాల్యస్మృతులను నెమరేసుకుంటున్నారు. ‘భారతీయ ఇతిహాసాలు పిల్లలు తెలుసుకోవడానికి ఇది ఓ గొప్ప మార్గం’ అంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సీరియల్‌ చూస్తూ ఫొటోలు తీసుకొని వాటిని ఆనందంగా షేర్‌ చేసుకుంటున్నారు.

రోజూ 2 ఎపిసోడ్లు
రామాయణ్‌ ధారావాహిక ఈ శనివారం (28–03–2020) ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మొదటి ఎపిసోడ్‌తో దూరదర్శన్‌ లో మళ్లీ ప్రారంభమైంది. తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను ప్రసారం చేసింది. ‘ప్రజల డిమాండ్‌ మేరకు రామాయణం సీరియల్‌ను పునఃప్రసారం’ చేస్తున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ శుక్రవారం ప్రకటించారు. దీంతో చాలామంది సోషల్‌ మీడియా ద్వారా ప్రధాని మోదీకి, దూరదర్శన్‌ ఛానెల్‌కు ‘థ్యాంక్స్‌ మోదీ... థ్యాంక్స్‌ డీడీ’ అంటూ ధన్యవాదాలు చెబుతున్నారు.

అప్పట్లో ఎక్కడివారక్కడే.. 
జనవరి 25, 1987లో 30 నిమిషాల నిడివితో 78 ఎపిసోడ్లతో మొదటిసారి దూదర్శన్‌లో రామాయణం ప్రసారమైంది. అప్పట్లో ఇది టీవీలో ఓ విప్లవం. ఈ సీరియల్‌ వచ్చే సమయంలో ప్రజారవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోయేవి. రైళ్లు, బస్సులు, ఇంటర్‌ సిటీ ట్రక్కులు.. జనం లేక వెలవెలబోయేవి. ఊళ్లలో సమూహాలుగా టీవీ సెట్స్‌ ముందు చేరిపోయేవారు. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించేవారు. పువ్వులు జల్లి నీరాజనాలు సమర్పించేవారు. నిజానికి ఇది ఒక కార్యక్రమమే. కానీ పిల్లా జెల్లాతో కలిసి కుటుంబం అంతా ఈ సిరియల్‌ని చూసింది. సీరియల్‌ పూర్తయ్యాక సత్యమే పలకాలనే వాగ్డానాలు చేసుకునేవారు. పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్‌ తీసుకునేవారు. రామాయణంతో టీవీ అలా ప్రతి ఒక్కరినీ కథలో లీనమయ్యేలా చేస్తూ జీవన విలువలనే ధ్యేయంగా విద్యాభ్యాసం చేయించింది. ముప్పై రెండేళ్ల క్రితం ప్రతి ఆదివారం ఉదయం వేళ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించిన రామాయణం ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణంలో మళ్లీ బుల్లితెర మీదకు వచ్చేసింది. రామనవమి వస్తున్న ఈ తరుణంలో రామాయణం మళ్లీ వీక్షించడం మహద్భాగ్యంగా చెప్పుకుంటున్నారు జనం. పాలసంద్రం నుంచి పట్టాభిషేకం దాకా!

‘శాంతాకారం భుజగ శయనం
పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం 
మేఘవర్ణం శుభాంగం..’

పాల సముద్రం మీద శేష శయనుడైన నారాయణుడు, పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి. బ్రహ్మాది దేవతలంతా స్తుతిస్తున్న సన్నివేశంతో రామాయణం మొదలవుతుంది. యోగనిద్రలో ఉన్న నారాయణుడు కనులు తెరిచి విషయం ఏంటని అడుగుతాడు. రావణాసురుడి ఆగడాలకు అంతులేదు. అధర్మమే అంతటా ఉంది. పాప నాశనం చేసి, ధర్మ సంస్థాపన చేయండి అని వేడుకుంటారు దేవతలు. వరాలను దుర్వినియోగం చేస్తున్న రావణాసురుడిని నిలువరించాల్సిన అత్యావశ్యకం వచ్చింది చెపుతాడు శివుడు. సత్యమే గెలుస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యచంద్రులు ఉండేంతవరకు ఆ ధర్మం అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటారు. రావణుడి అహంకారాన్ని మట్టుపెట్టేందుకు తాను జన్మిస్తానని వరమిస్తాడు నారాయణుడు. ‘సత్యమేవ జయతే’ అంటారు దేవగణం. అక్కడి నుంచి.. రాముడు జననం, విద్యాభ్యాసం, వివాహం, వనవాసం మీదుగా కథ నడుస్తూ సీతాదేవి అపహరణ, రావణాసుర సంహారం, తిరిగి అయోధ్యనగర ప్రవేశం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది.

డీడీ1లో ప్రసారమవుతున్న ‘రామాయణ్‌’ సీరియల్‌ చూస్తూ, సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్‌ చేసుకుంటున్నారు

నిత్యవిద్యార్థి రామానంద సాగర్‌
రామానంద సాగర్‌ దాదాపు వందేళ్ల క్రితం కశ్మీరీ ధనిక కుటుంబంలో పుట్టాడు. రచయితగా ఎన్నో మారు పేర్లతో రచనలు చేశాడు. ఒకానొక సమయంలో ముంబయ్‌కి అతని కుటుంబ వలస వచ్చింది. సినిమా మీద వ్యామోహంతో పృథ్వీ థియేటర్‌లో పృథ్వీరాజ్‌ కపూర్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. 1950లో సాగర్‌ ఆర్ట్స్‌ పేరుతో సొంత ప్రొడక్షన్‌ కంపెనీని నిర్మించాడు. పదుల సంఖ్యలో నామమాత్రపు సినిమాలు అతని ప్రొడక్షన్‌లో వచ్చాయి. ఆ తర్వాత అతని దశ, దిశ మార్చింది మాత్రం చిన్నతెరనే. అంతకాలం అతనొక విద్యార్థి. రామాయణంతో అతనిలోని మేధావి ప్రపంచానికి కనిపించాడు. తనలో సాంకేతికæ పరిజ్ఞానం ఏ మాత్రం లేదని ఒప్పుకున్న సాగర్‌ రామాయణాన్ని బుల్లితెర మీద చూపించడంలో అపారప్రతిభను కనబరిచాడని అంతా చెబుతుంటారు.

తులసీదాస్‌ రామాయణమే మూలం
రామానంద సాగర్‌ తులసీదాస్‌ రామాయణంలోని కథను తన సీరియల్‌కి ఎంచుకున్నాడు. రామరాజ్య స్థాపనకు ముందు రాముడి జీవితాన్ని ఇందులో తీసుకున్నారు. రాముడు తిరిగి అయోధ్యను చేరుకోవడం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. చివరలో సీతను రాముడు వదిలేయడం, లవకుశల అంశాలతో కూడిన ఉత్తర రామాయణ్‌ తీసుకోలేదు. ‘చాలా మంది రచయితలు రాముడు సీతను వదిలేసినట్టు రాశారు. ‘కానీ, నా రాముడు అలా కాదు అనేవాడు నాన్న. ఆ తర్వాత ప్రత్యేకంగా లవ–కుశ సీరియల్‌ తీయాలనుకున్నాడు. కానీ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది’ అని చెప్పారు ఓ ఇంటర్వూ్యలో రామానంద్‌ సాగర్‌ తనయుడు ప్రేమ్‌సాగర్‌. భారత దేశంలో పౌరాణిక ఇతివృత్తంతో సీరియల్స్‌ రూపొందించడానికి రామాయణం ఒక మాధ్యమంగా సాగింది.

జీవించిన నటీనటులు
రామ పాత్రధారి అరుణ్‌గోవిల్‌ గళం ఈ సీరియల్‌కే పెద్ద ఎస్సెట్‌. ప్రశాంత చిత్తం. మృదుమైన మాట. అతను మాట్లాడుతుంటే వినేవారి చెవులు ఆసక్తితో రిక్కించుకుని వింటాయి. ఇక ఇప్పటి వరకు వచ్చిన సీత క్యారెక్టర్లలో ఎవరు ది బెస్ట్‌ అని కళ్లు మూసుకొని వెతికినా దీపికా చికాలియా రూపం కళ్లముందు నిలుస్తుంది. కళ్లతో ఆమె పలికించిన భావాలు మనసు నుంచి చెదిరిపోవు. ఇప్పటికి వచ్చిన రామాయణ్‌ సీరిస్‌లో హనుమాన్‌ పాత్ర ధారులను గమనిస్తే హనుమాన్‌గా నటించిన ధారా సింగ్‌ అపరమేధావిలా కనిపిస్తాడు. హనుమాన్‌ అంటే ధారాసింగ్‌ మాత్రమే అనేలా మెప్పించాడు. ఇక రాముడికి దీటుగా రావణుడి పాత్రకోసమే పుట్టాడేమో అనిపించేలా అరవింద్‌ త్రివేది కనిపిస్తారు.

మరింత అందంగా!
మూడు దశాబ్దాల క్రితమే కోటి రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సీరియల్‌ పాత్రదారులకు బ్రైట్‌ కలర్‌ కాస్ట్యూమ్స్‌ వాడారు. మన దేశ ప్రజలకు అప్పుడప్పుడే కలర్‌ టెలివిజన్‌ చేరవవుతుంది. ఈ చిన్న తెరమీద గులాబీ, నీలం, పసుపు, ఎరుపు రంగులతో షోని బ్లాస్ట్‌ చేశాడు దర్శకుడు. ఇప్పుడు మనంటి గోడ మీద ఠీవీగా స్థానం సంపాదించుకున్న టీవీలో రామాయణం వర్ణాలన్నీ మరింత క్లారిటీగా వీక్షించవచ్చు.

రికార్డులు 
ఇండియన్‌ టీవీలో మొట్టమొదటి బ్లాక్‌ బస్టర్, అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌరాణిక షో గా రామాయణం వరల్డ్‌ లిమ్కా బుక్‌ రికార్డ్స్‌లో చోటు చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన రామాయణాలకు రామానంద్‌ సాగర్‌ రామాయణమే పెద్ద బాలశిక్ష అయ్యింది.  – నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement