విజయానికి రామాయణం | ramayanam special story | Sakshi
Sakshi News home page

విజయానికి రామాయణం

Published Fri, Mar 27 2015 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

విజయానికి రామాయణం

విజయానికి రామాయణం

13-19 కేరెంటింగ్
 
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
 
పందిళ్లు... పెళ్లి వేడుకలతో ఊరూ, వాడా కళకళలాడే రోజు శ్రీరామనవమి. ఎంతో సందడిగా ఉండే ఈ రోజు దేవుడి కల్యాణంగా మాత్రమే ఎందుకు మిగిలిపోవాలి?! మనిషిగా పుట్టి మనిషిగా ఎదిగి.. సకల జనులకు ఆదర్శప్రాయుడైన రాముడి గాథను రేపటి తరానికి పరిచయం చేస్తే! అయితే ఎందుకు ఆలశ్యం.. జీవితంలోని సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఈ వయసు వారికి ఈ రోజే తెలియజేయండి.
 రాముడు సకల గుణాభిరాముడుగా మనందరికీ తెలుసు. గౌరవం, ప్రేమ, దయ, ధైర్యం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం.. ఇలా ఎన్నో విశేషాలు ఆయనను కోటాను కోట్ల మందిలో ఉన్నతంగా నిలిపింది. యుగాలు గడిచినా నాటి కథనం ఇంకా ఇంకా అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటుంది.

విధి నిర్వహణే ప్రధానం...

బాల్యంలో తండ్రి దశరథమహారాజు, తల్లి కౌసల్య, పిన తల్లులైన సుమిత్ర, కైకల చెంత రాజసౌధంలో రాముడు ఎంతో గారాబంగా పెరిగాడు. ఏది కోరినా క్షణాల్లో అతని చెంత తెచ్చిపెట్టేందుకు బోలెడంత పరివారం చుట్టూతా ఉంది. అలాంటి చోట నుంచి ఓ రోజు గురువు విశ్వామిత్రుని ఆదేశం ప్రకారం అరణ్యాలకు పయనం కావల్సి వచ్చింది. అదీ పన్నెండేళ్ల వయసులో. అరణ్యంలో రాక్షసులను ఎదుర్కొని, రుషులు చేసే యజ్ఞానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యతను రాముడి మీద పెట్టారు గురువు. అంత చిన్నవయసులో అంత పెద్ద పని... అయినా రాముడు భయపడలేదు. తనకు గురువు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరో ఆలోచనకు తావివ్వకుండా ఏకచిత్తంతో కార్యసాధనకు పూనుకున్నాడు. తన విధికి ఆటంకం కలిగించే రాక్షసులను సంహరించి, యజ్ఞం సవ్యంగా జరిగేలా చూశాడు. గురువు తనకు చెప్పిన బాధ్యతను కాద నకుండా నిర్వర్తించాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. భయం అనేది దరిచేరకుండా చూసుకుంటే చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ఈ సందర్భం మనకు తెలియపరుస్తుంది. అంతేనా, గురువు మాటలకు ఎదురుచెప్పకుండా అరణ్యంలో ఉంటూ కఠిన విద్యను అభ్యసించారు రాముడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు. శ్రమ, నేర్చుకోవాలనే తపన మనిషిని ఎంత మెరుగు పరుస్తుందో వారి బాల్యాన్ని ఉదాహరణగా తీసుకొని చెబితే పిల్లలు ఆసక్తిగా వింటారు.
 
సమస్యను అర్థం చేసుకునే నేర్పు...

రాముడికి పెళ్లైంది. వనవాసంలో అతని భార్య అయిన సీతను ఎవరో దుండగుడు ఎత్తుకెళ్లిపోయాడు. చాలా పెద్ద సమస్య!! ఎవరిని అడగాలి? పెద్ద అడవిలో... ఆమె ఎక్కడ ఉందో తెలియదు. ఎలాంటి స్థితిలో ఉందో తెలియదు. మనకో సమస్య వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఎవరిని సాయం అడగాలో తెలియదు. ఎదుటపడినవారి నుంచి ఎలాంటి సాయం పొందాలో తెలియదు. సీతను వెతుకుతూ వెళ్లే దారిలో రామునికి ఎంతో మంది కలిశారు. ముఖ్యంగా వానరసైన్యం గల సుగ్రీవుడు. అతనికీ ఓ సమస్య ఉంది. సుగ్రీవుడి సోదరుడు వాలి దౌర్జన్యంగా అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. విషయం తెలుసుకున్న రాముడు సుగ్రీవుడికి సాయంగా నిలిచాడు. వాలితో యుద్ధం చేసి, రాజ్యం సుగ్రీవుడికి తిరిగి దక్కేలా చేశాడు. ‘మనమే సమస్యలో ఉన్నాం, అలాంటప్పుడు ఇంకొకరికి ఎలా సాయం చేస్తాం..?!’ అనేది మనలో చాలా మందికి కలిగే ఆలోచన. అలాంటప్పుడు ఇంకొకరి సమస్య మనకు పట్టదు. కానీ, ఎవరు సాయం చే యగలరని రాముడిక్కడ డీలా పడలేదు. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలా అని ఆలోచించాడు. సుగ్రీవుడికి స్నేహితుడయ్యాడు. అతని కష్టాన్ని తీర్చి, అతని రాజ్యాన్ని అతనికి ఇప్పించాడు. సుగ్రీవుని వానర సాయంతోనే సముద్రంపై వంతెన కట్టించాడు. లంకను చేరుకొని, రావణాసురుడితో యుద్ధం చేసి తన భార్యను తిరిగి తెచ్చుకున్నాడు. అంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడటానికి ఎలాంటి వారి సాయం పొందాలో, కష్టంలో ఎదుటివారికి ఎలా సాయ పడాలో ఈ సందర్భం మనకు తెలియజేస్తుందన్నమాట.

 సమస్యల పర్వతం...

రామరావణాసుర యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు అతన్ని మేల్కొల్పడానికి హనుమంతుడికి ఒక పనిని అప్పజెప్పాడు రాముడు. సంజీవనీ అనే మొక్కను తీసుకురమ్మని. అది కూడా చాలా త్వరగా తెమ్మని చెప్పాడు. హనుమంతుడు వెనకాముందు చూసుకోలేదు. మొక్కను తీసుకురావడానికి వెళ్లిపోయాడు. రాముడు చెప్పిన పర్వతం చేరుకున్నాక, హనుమకు సందేహం వచ్చింది. సంజీవని మొక్క ఎలా ఉంటుంది? పర్వతమంతా వెతికాడు. ఎన్నో చెట్లు.. మొక్కలు.. పెద్ద పెద్ద రాళ్లు.. ఆ మొక్క ఎలా ఉంటుందో తెలియనప్పుడు వాటి మధ్య ఉన్న దానిని ఎలా తీసుకురావడం?! అందుకే పర్వతాన్నే పెకిలించి, మోసుకొచ్చేశాడు. మనలో ప్రతి ఒక్కరికీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యకు భయపడితే పర్వతం కన్నా పెద్దదిగా కనిపిస్తుంది. భయపడకుండా చూస్తే అదే సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది. అప్పుడే ధైర్యం, సాధించగలననే నమ్మకం మనలో కలుగుతాయి. రాముడి జీవితమంతా సమస్యలే. కానీ, ఆ సమస్యల్ని ఎదుర్కొన్న విధమే ఆయనకా ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అంతేకాదు, రామాయణంలోని ప్రతి సన్నివేశం, ప్రతి పాత్రా కౌమారంలో ఉన్న పిల్లలకే కాదు పెద్దలకూ జీవితపాఠాలు నేర్పిస్తుంది. రామనవమి నాడు రామ జీవితకథను పాఠ్యాంశంగా పిల్లలకు పరిచయం చేస్తే వారి జీవనరాదారిలో వచ్చే ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే నేర్పును పంచినవారవుతారు.
 
పురాణాలు, ఇతిహాసాలు చెప్పేటప్పుడు పిల్లలకు అభూతకల్పనలతో కాకుండా సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో సూచించేలా కథనాలు ఎంచుకోవాలి. నేను దశావతరాలను కథ లుగా చెప్పేటప్పుడు చిన్న చిన్న పద్యాలు కూడా పరిచయం చేస్తాను. పిల్లల్లో ఊహాత్మక శక్తిని, ఆలోచనా విధానాన్ని పెంచేవి ఈ కథనాలే!
 - దీపాకిరణ్, స్టోరీ టెల్లర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement