
ఒకరి మృతదేహం లభ్యం, మరొకరి కోసం గాలింపు
పార్వతీపురం మన్యం జిల్లాలో ఘటన
పార్వతీపురం మన్యం: వృత్తి రీత్యా రాష్ట్రాలు దాటి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగులో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించి ఎస్‌ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని సరాయివలస ఏకలవ్య మోడల్ స్కూల్‌లో వార్డెన్‌గా మహేష్, సోషల్ టీచర్‌గా ఆర్తి పనిచేస్తున్నారు. వీరిది హరియాణ రాష్ట్రం. ఎప్పటివలే శుక్రవారం విధులు ముగించుకుని స్థానికంగా గురివినాయుడుపేట గ్రామంలో తమ నివాసాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ద్విచక్రవాహనంపై మహేష్, ఆర్తి ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో గురివినాయుడుపేట వైపు వస్తుండగా, మార్గమధ్యంలోని రాయిమానువాగు దాటే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా.. మహేష్ ఆచూకీ దొరకలేదు. మహేష్ వాగులోని చెట్టుకొమ్మ సాయంతో బయటపడి వాగు అంచును పట్టుకొన్నప్పటికీ.. ఆ అంచు జారిపోవడంతో మళ్లీ వాగులో పడి కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment