two teachers
-
వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు
పార్వతీపురం మన్యం: వృత్తి రీత్యా రాష్ట్రాలు దాటి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగులో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించి ఎస్ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సరాయివలస ఏకలవ్య మోడల్ స్కూల్లో వార్డెన్‌గా మహేష్, సోషల్ టీచర్‌గా ఆర్తి పనిచేస్తున్నారు. వీరిది హరియాణ రాష్ట్రం. ఎప్పటివలే శుక్రవారం విధులు ముగించుకుని స్థానికంగా గురివినాయుడుపేట గ్రామంలో తమ నివాసాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ద్విచక్రవాహనంపై మహేష్, ఆర్తి ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో గురివినాయుడుపేట వైపు వస్తుండగా, మార్గమధ్యంలోని రాయిమానువాగు దాటే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా.. మహేష్ ఆచూకీ దొరకలేదు. మహేష్ వాగులోని చెట్టుకొమ్మ సాయంతో బయటపడి వాగు అంచును పట్టుకొన్నప్పటికీ.. ఆ అంచు జారిపోవడంతో మళ్లీ వాగులో పడి కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
గ్లోబల్ టీచర్ ప్రైజ్ జాబితాలో ఏపీ టీచర్
లండన్: గ్లోబల్ టీచర్ ప్రైజ్–2023 విజేతను ఎంపిక చేసేందుకు రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లున్నాయి. టాప్–50 జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న పి.హరికృష్ణతోపాటు బెంగాల్ లోని ఆసన్సోల్ జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల టీచర్ దీప్ నారాయణ్ నాయక్ ఉన్నారు. 130 దేశాల నుంచి అందిన 7 వేలకు పైగా నామినేషన్ల నుంచి ఈ 50 మందిని ఎంపిక చేశారు. తుది జాబితాలో ఉన్న 10 మంది నుంచి విజేతను ఈ ఏడాది చివర్లో గ్లోబల్ టీచర్ ప్రైజ్ అకాడమీ ప్రకటించనుంది. వర్కీ ఫౌండేషన్, యునెస్కో, యూఏఈకి చెందిన దుబాయ్ కేర్స్ కలిసి ఏ టా విజేతకు ఈ అవార్డు కింద 10 లక్షల అమెరికన్ డాలర్లను అందజేస్తాయి. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు
తాంసి/దండేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదా నం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాకు చెందినవారే. ఆది లాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బెదోడ్కర్ సంతోష్‌కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నుగూరి అర్చన.. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. పాఠశాల పేరు మీద యూట్యూబ్ చానల్లో పాఠాలు 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోష్‌కుమార్ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా గూగుల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠా లను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్ చానల్లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్ లోడ్ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు. సొంత డబ్బులతో స్కూల్‌ను తీర్చిదిద్ది.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. -
హెచ్ఎం, ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిచంద్రకుమార్, టీచర్లు స్వర్ణలత, శ్రీలక్ష్మిలను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. వివరాల్లోకెళ్తే.. డీఈఓ శామ్యూల్ గురువారం ఉదయం 9:50 గంటలకు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. డీఈఓ వెళ్లిన సమయానికి హెచ్ఎం, మరో టీచర్ మాత్రమే ఉన్నారు. వీరు కూడా తరగతి గదులో కాకుండా హెచ్ఎం గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో పాఠశాలకు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తి పిల్లలకు చదువు చెబుతున్నాడు. ఆ వ్యక్తి గురించి డీఈఓ ఆరా తీశారు. 10.10 గంటల దాకా డీఈఓ అక్కడే ఉన్నా టీచర్లు స్వర్ణలత, శ్రీలక్ష్మి బడికి రాలేదు. హాజరు పట్టికను పరిశీలించగా వారు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. స్కూల్లో మొత్తం నలుగురు టీచర్లు పనిచేస్తుండగా వంతులు వారీగా స్కూల్‌కు వస్తున్నట్లు కొందరు స్థానికులు డీఈఓకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై డీఈఓ తీవ్రంగా స్పందించారు. ప్రైవేటు వ్యక్తితో బోధన చేయిస్తున్నందుకు హెచ్ఎంను, అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైనందుకు టీచర్లపై చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
125 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు..!
అర్వపల్లి : మండలంలోని వర్ధమానుకోట గ్రామ పంచాయతీ ఆవాసం పాటిమీదిగూడెంలో గల ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టు ఒక్కటే ఖాళీగా ఉంది. కాగా ఈవిద్యా సంవత్సరంలో శైలజ, మల్లిక అనే ఉపాధ్యాయురాళ్లు ఇద్దరు ప్రసూతి(మెటర్నరీ) సెలవులపై వెళ్లారు. 6నెలల పాటు వీరు పాఠశాలకు వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ పాఠశాలకు ఇద్దరే ఉపాధ్యాయులు దిక్కయ్యారు. ఇద్దరిలో ఒకరు హెచ్ఎం కాసం చక్రధర్, మరొకరు నిర్మల ఉపాధ్యాయురాలు. అయితే పాఠశాలలో ప్రస్తుతం 125మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లలకు చదువులు ముందు సాగని పరిస్థితి నెలకొంది. గురువారం హెచ్ఎం ఒక్కరే... గురువారం పాఠశాలకు ఉపాధ్యాయురాలు నిర్మల సెలవు పెట్టడంతో హెచ్ఎం కాసం చక్రధర్ ఒక్కరే దిక్కయ్యారు. 5తరగతులను హెచ్ఎం ఒక్కరే నిర్వహించడం తలనొప్పిగా మారింది. దీంతో కొన్ని తరగతులను కలిపి పాఠశాల వరండాలో కూర్చోబెట్టి మధ్యలో హెచ్ఎం ఉండి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని తరగతులలో క్లాస్ లీడరే పిల్లలకు పాఠాలు చెప్పారు. కనీసం వలంటీర్లనైనా నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంఈఓ వివరణ : ఈ విషయమై ఎంఈఓ బాలును ప్రశ్నించగా ఇతర పాఠశాల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను రెండు రోజుల్లో మార్చి పాటిమీదిగూడెం పంపిస్తామని చెప్పారు. చదువులు సాగక ఇబ్బంది– చిత్తలూరి అన్నపూర్ణ, ఎస్ఎంసీ చైర్మన్ మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగానే ఉంది. కాని ఉపాధ్యాయులు లేరు. విద్యావలంటీర్లను నియమించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కోవడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి. చదువుచెప్పే వారే లేరు– బుర్ర శ్రవంతి 5వ తరగతి మా టీచర్లు ముగ్గురు సెలవు పెట్టగా హెచ్ఎం ఒక్కరే ఉన్నారు. ఆయనే ఐదు తరగతులకు విద్యాభోదన చేస్తున్నారు. మాకు సార్లు లేక పాఠాలు కావడం లేదు. అధికారులు పెద్దమనస్సు చేసుకుని మరో ఇద్దరు టీచర్లను నియమించాలి. ఐదు తరగతులు ఇద్దరమే చూడాల్సి వస్తుంది– కాసం చక్రధర్, ఇన్చార్జి హెచ్ఎం మా పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్‌ం పోస్టు రెండేళ్ల నుంచి ఖాళీగా ఉంది. తనతో పాటు నలుగురు టీచర్లు ఉండగా ఇద్దరు ప్రసూతి సెలవులపై వెళ్లారు. మిగిలిన ఇద్దరమే ఐదు తరగతులు నడపాల్సి వస్తుంది. ఇద్దరిలో ఒకరు సెలవు పెడితే ఇబ్బందిగా ఉంటోంది. -
అక్రమ మెడికల్ బిల్లు : ముగ్గురి సస్పెన్షన్
దామరచర్ల (నల్లగొండ) : మెడికల్ బిల్లు విషయంలో అవినీతికి పాల్పడిన ఓ ఏఎన్ఎం సహా ఇద్దరు ఉపాధ్యాయులను తొలగిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మెడికల్ బిల్లు విషయంలో అవినీతికి పాల్పడిన ఏఎన్ఎం సహా ఇద్దరు ఉపాధ్యాయలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
ఇద్దరు ఉపాధ్యాయుల ఆత్మహత్య!
హైదరాబాద్: తెలంగాణలో ఈరోజు ఇద్దరు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, మెదక్ జిల్లాలో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం రాయపూర్ ప్రభుత్వ పాఠశాలలో రాజన్న అనే ఉపాధ్యాయుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట గణేష్ నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ** -
పరీక్ష కేంద్రంలో ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ
10వ తరగతి పరీక్ష కేంద్రంలో మహిళ ఉపాధ్యాయురాలి పట్ల సహచర ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో సదరు మహిళ ఉపాధ్యాయురాలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే చెప్పు తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు కిష్టప్ప చెంప చెళ్లు మనిపించింది. అయితే మహిళ ఉపాధ్యాయురాలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. ఆ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మహిళ ఉపాధ్యాయురాలికి ప్రధానోపాధ్యాయుడు హామీ ఇచ్చారు. ఆ ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఓ టెన్త్ క్లాస్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.