125 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు..!
125 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు..!
Published Fri, Aug 5 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
అర్వపల్లి : మండలంలోని వర్ధమానుకోట గ్రామ పంచాయతీ ఆవాసం పాటిమీదిగూడెంలో గల ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టు ఒక్కటే ఖాళీగా ఉంది. కాగా ఈవిద్యా సంవత్సరంలో శైలజ, మల్లిక అనే ఉపాధ్యాయురాళ్లు ఇద్దరు ప్రసూతి(మెటర్నరీ) సెలవులపై వెళ్లారు. 6నెలల పాటు వీరు పాఠశాలకు వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ పాఠశాలకు ఇద్దరే ఉపాధ్యాయులు దిక్కయ్యారు. ఇద్దరిలో ఒకరు హెచ్‌ఎం కాసం చక్రధర్, మరొకరు నిర్మల ఉపాధ్యాయురాలు. అయితే పాఠశాలలో ప్రస్తుతం 125మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లలకు చదువులు ముందు సాగని పరిస్థితి నెలకొంది.
గురువారం హెచ్‌ఎం ఒక్కరే...
గురువారం పాఠశాలకు ఉపాధ్యాయురాలు నిర్మల సెలవు పెట్టడంతో హెచ్‌ఎం కాసం చక్రధర్ ఒక్కరే దిక్కయ్యారు. 5తరగతులను హెచ్‌ఎం ఒక్కరే నిర్వహించడం తలనొప్పిగా మారింది. దీంతో కొన్ని తరగతులను కలిపి పాఠశాల వరండాలో కూర్చోబెట్టి మధ్యలో హెచ్‌ఎం ఉండి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని తరగతులలో క్లాస్ లీడరే పిల్లలకు పాఠాలు చెప్పారు. కనీసం వలంటీర్లనైనా నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎంఈఓ వివరణ : ఈ విషయమై ఎంఈఓ బాలును ప్రశ్నించగా ఇతర పాఠశాల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను రెండు రోజుల్లో మార్చి పాటిమీదిగూడెం పంపిస్తామని చెప్పారు.
చదువులు సాగక ఇబ్బంది– చిత్తలూరి అన్నపూర్ణ, ఎస్‌ఎంసీ చైర్మన్
మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగానే ఉంది. కాని ఉపాధ్యాయులు లేరు. విద్యావలంటీర్లను నియమించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కోవడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి.
చదువుచెప్పే వారే లేరు– బుర్ర శ్రవంతి 5వ తరగతి
మా టీచర్లు ముగ్గురు సెలవు పెట్టగా హెచ్‌ఎం ఒక్కరే ఉన్నారు. ఆయనే ఐదు తరగతులకు విద్యాభోదన చేస్తున్నారు. మాకు సార్లు లేక పాఠాలు కావడం లేదు. అధికారులు పెద్దమనస్సు చేసుకుని మరో ఇద్దరు టీచర్లను నియమించాలి.
ఐదు తరగతులు ఇద్దరమే చూడాల్సి వస్తుంది– కాసం చక్రధర్, ఇన్‌చార్జి హెచ్‌ఎం
మా పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ం పోస్టు రెండేళ్ల నుంచి ఖాళీగా ఉంది. తనతో పాటు నలుగురు టీచర్లు ఉండగా ఇద్దరు ప్రసూతి సెలవులపై వెళ్లారు. మిగిలిన ఇద్దరమే ఐదు తరగతులు నడపాల్సి వస్తుంది. ఇద్దరిలో ఒకరు సెలవు పెడితే ఇబ్బందిగా ఉంటోంది.
Advertisement