ఈ విహారం శ్రీలంక రాజధాని కొలంబో నగరంలో ఉంది. వ్యవహారంలో ‘గంగారామయ టెంపుల్’ అంటారు కానీ సింహళంలో ‘శ్రీగంగారామ మహా విహారాయ’ అంటారు. మనం ‘విహారం’ అనే పదాన్ని వాళ్లు ‘విహారాయ’ అంటారు. బోధిచెట్టు, విహార మందిరం, సీమ మలక (సన్యాసుల సమావేశ మందిరం)... మూడు నిర్మాణాల సమూహం. మూడింటితోపాటు రెలిక్ కాంప్లెక్స్‌కి కూడా కలిపి ఒకటే టికెట్. శ్రీలంక రూపాయల్లో నాలుగు వందలు. ‘శ్రీ జినరత్న భిక్కు అభ్యాస విద్యాలయ’ పేరుతో రసీదు ఇచ్చారు. ఇది వర్షిప్ అండ్ లెర్నింగ్ సెంటర్. ఈ విహారం ఉన్న ప్రదేశాన్ని ‘జినరత్న రోడ్’ అంటారు. అతిపెద్ద పర్యాటక ప్రదేశం కావడంతో మన ఉచ్చారణలో స్పష్టత లేకపోయినప్పటికీ స్థానిక టాక్సీల వాళ్లు సులువుగా గుర్తించి తీసుకువెళ్తారు. ఇది బెయిరా సరస్సు ఒడ్డున ఉంది.
అశోకుడి ధర్మచక్రం
గంగారాయ మహా విహారాయలో కూడా తొలి ప్రాధాన్యం బోధివృక్షానిదే. అనూరాధపురాలో ఉన్న శ్రీ మహాబోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను ఇక్కడ నాటినట్లు చెబుతారు. ఈ బోధివృక్షం మొదట్లో చెట్టు వేళ్ల మధ్య అవుకాన బుద్ధ విగ్రహం ఉంది. ఆ పైన రెయిలింగ్‌తో కూడిన బేస్‌మెంట్ మీద అశోకుని ధర్మచక్రం. నోరు తెరిచి గర్జిస్తున్న నాలుగు సింహాల విగ్రహం ఉంది. లోపలికి వెళ్తే బుద్ధుడు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాడు. ఆవరణలో బుద్ధుడి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేం. బుద్ధుడికి మకరతోరణంలా అమర్చిన ఏనుగు దంతాలను గమనించడం మర్చిపోకూడదు.
నిలువెత్తు దంతాలవి. మనం ఆ దంతాల పక్కన నిలబడితే దంతాలే మనకంటే ఎత్తు ఉంటాయి. ఇక మ్యూజియంలోకి అడుగుపెడితే అది మరో ప్రపంచం. కనువిందు చేసే ప్రదేశమంటే ఇదేననిపిస్తుంది. అల్మరాల్లో పాలరాతి బుద్ధుడి విగ్రహాలు వరుసగా పేర్చి ఉన్నాయి. వాలుగా కూర్చుని ఉన్న భంగిమలో అర అడుగు విగ్రహాలు షోరూమ్‌లో అమ్మకానికి పెట్టినట్లున్నాయి. కింది వరుసలో నిలబడిన బుద్ధుడి రాతి విగ్రహాలు, వాటి మధ్యలో నాలుగడుగుల ఒకింత పెద్ద విగ్రహాలు... ఒక థీమ్ ప్రకారం అమర్చి ఉన్నాయి. మరో ర్యాక్‌లో కూడా బుద్ధుడి విగ్రహాల అమరిక అలాగే ఉంది కానీ మధ్యలో పెద్ద నటరాజు విగ్రహం ఉంది. బహుశా శ్రీలంకలో శైవం ప్రాచుర్యంలో ఉండడంతో బుద్ధుడిలో ఈశ్వరుడిని కూడా చూస్తున్నట్లుంది.
మరకత బుద్ధుడు
ఒకటిన్నర అడుగుల ఎత్తు, అడుగు వెడల్పు ఉన్న జాతి పచ్చ రాయిలో చెక్కిన విగ్రహం అది. ఏకరాతిని బుద్ధుడి రూపంలో చెక్కి, సర్వాలంకార భూతుడిని చేశారు. ఒంటి నిండా ఆభరణాలతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది. మరికొన్ని షెల్ఫుల్లో అరడుగు రూబీ (కెంపు) బుద్ధుడి విగ్రహాలు, గోమేధికం బుద్ధుడి విగ్రహాలున్నాయి. బుద్ధుడు ఆహారం తీసుకోనప్పుడు దేహం శుష్కించి పోయిన రూపాన్ని ప్రతిబింబించే విగ్రహం ఒక ఆశ్చర్యం. డొక్క ఎండిపోయిన లోహపు బుద్ధుడి విగ్రహం అన్నమాట. ముఖంలో సన్నని గీతలు కూడా డీటెయిల్డ్‌గా కనిపిస్తాయి. ఒక అల్మరాలో ఒక ఇత్తడి పాత్రలో ఇరవయ్యవ శతాబ్దం నాటి నాణేలున్నాయి.
నాణేల్లో ఎక్కువ భాగం ఇత్తడివే. బ్రిటిష్ కాలంలోనూ స్వాతంత్య్రానంతరం మనదేశంలో చెలామణిలో ఉన్న నాణేలను పోలి ఉన్నాయవి. శయన బుద్ధుడు, చైనా బుద్ధుడు, సునిశితమైన చిత్రాలతో ఐదున్నర అడుగుల పింగాణి కూజాలు, అల్మెరాల్లో వెండి– బంగారు పాత్రలు, తొండం ఎత్తి ఘీంకరిస్తున్న ఏనుగులు, పడగెత్తిన వెండి నాగుపాములు కూడా లెక్కకు మించి ఉన్నాయి. లోహపు మారేడుదళం, పూలసజ్జలను చూస్తుంటే సాంస్కృతికంగా మన దక్షిణ భారత దేశానికి – శ్రీలంకకు మధ్య అవినాభావ బంధం ఉందనిపిస్తుంది. జినరతన ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ విభాగంలో ఉన్న లైబ్రరీ విశాలమైనది. ప్రపంచంలోని బౌద్ధ సాహిత్యం అంతా ఇక్కడ ఉంది.
బెయిరా సరస్సులో రెలిక్ ప్రధాన విహారానికి ఒకవైపు నిలువెత్తు బ్రాస్‌వాల్ మీద బుద్ధుడి జీవితంలో దశలు, జాతక కథల కుడ్యశిల్పాలున్నాయి. రోడ్డు దాటి సరస్సు వైపు వస్తే అందులో బుద్ధుడి రెలిక్ కాంప్లెక్స్ ఉంది. అది సాంస్కృతికతను ఒడిసి పట్టిన అత్యంత అధునాతన నిర్మాణం. ఇక్కడ ఉంచిన రెలిక్ ఏమిటన్నది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయారు. రెలిక్ అని మాత్రమే చెబుతున్నారు. ఆవరణలో బుద్ధుడి విగ్రహాల వరుస ఉంది.
మరో విషయం... ప్రపంచంలో అత్యంత భారీ విగ్రహంగా రికార్డు సాధించిన బోరోబుదూర్ బుద్ధుడి విగ్రహానికి ప్రతీకాత్మక రూపం ఇక్కడ ఉంది. బోరోబుదూర్ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, కాబట్టి ఇప్పుడు ఇక్కడి రూపాన్ని చూసి సంతృప్తి చెందవచ్చు. బౌద్ధం నడిపించిన సమాజం శ్రీలంక. మనుషులు అత్యంత స్నేహపూర్వకంగా, మితభాషులుగా కనిపించారు. మరో విషయం ఇక్కడ సావనీర్ షాప్‌లో బుద్ధుడి జ్ఞాపికలతోపాటు ముత్యాల ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే దుకాణదారులు వాటి నాణ్యత విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయారు. జాగ్రత్తగా కొనుగోలు చేయడం మంచిది.
– వాకా మంజులారెడ్డి
సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి
(చదవండి: ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!)
Comments
Please login to add a commentAdd a comment