ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం! | Temple Of The Sacred Tooth Relic Of The Tooth Of The Lord Buddha, Know Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!

Published Fri, Nov 3 2023 10:52 AM | Last Updated on Fri, Nov 3 2023 3:08 PM

Temple Of The Sacred Tooth Relic Of Lord Buddhas Tooth - Sakshi

శ్రీలంక దీవి హిందూ మహా సముద్రంలో చిన్న భూభాగం. ఇందులో సముద్ర మట్టానికి పదహారు వందల అడుగుల ఎత్తులో ఉంది కాండీ నగరం. ఈ నగరంలో ప్రధానంగా చూడాల్సిన ప్రదేశం బుద్ధుడి దంత అవశిష్టంతో నిర్మించిన ఆలయం. ఈ ఆలయాన్ని టూత్‌ రిలిక్‌ టెంపుల్‌ గా వ్యవహారిస్తారు. ఈ ఆలయం కంటే ముందు ఇక్కడ ఉన్న నేషనల్‌ మ్యూజియాన్ని తప్పక చూడాలి. రిలిక్‌ టెంపుల్‌ చుట్టూ ప్రాచీన రాజకుటుంబాల ప్యాలెస్‌లున్నాయి. ఆలయంతోపాటు రాజప్రాసాదాలు కూడా ఏటవాలు పై కప్పుతో మనదేశంలో కేరళలోని నిర్మాణాలను తలపిస్తాయి.

శ్రీలంకలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి, కాబట్టి నీరు సులువుగా జారిపోవడానికి ఒకప్పుడు ఎర్రటి బంగ్లా పెంకు కప్పే వాళ్లు. ఇప్పుడు ఆకుపచ్చ రంగు రేకులు కప్పుతున్నారు. ఇక ఈ నగరంలో మరో విశిష్ఠత ఏమిటంటే... పోర్చుగీసు, బ్రిటిష్‌ పరిపాలనలో ఉండడంతో కొన్ని ప్రదేశాలు కలోనియల్‌ కాలనీలను తలపిస్తున్నాయి. యూరప్‌ నిర్మాణశైలిలో ఉన్న క్వీన్స్‌ హోటల్‌ను చూసి తీరాలి. ఇక బ్రిటిష్‌ వాళ్లు హిల్‌ స్టేషన్‌లను ఎంత చక్కగా వేసవి విడుదులుగా మలుచుకున్నారో చెప్పడానికి కాండీ నగరం ఒక నిదర్శనం. నిర్మాణ పరంగా, చారిత్రక ప్రాధాన్యతలెన్ని ఉన్నప్పటికీ ఈ నగరానికి ఇంతటి పర్యాటక ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం బుద్ధుడి అవశిష్టమే.

బౌద్ధమే ప్రధానం..
బుద్ధుడి దంతాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ దంత అవశిష్టం మన భారతదేశం నుంచి శ్రీలంక చేరడం కూడా రసవత్తరమైన నాటకీయతను తలపిస్తుంది. బుద్ధుడు మహా పరినిర్వాణం చెందిన తర్వాత ఎముకలు, దంతాలు ఇలా ఒక్కొక్క దేహభాగాలను ఒక్కొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించారు. అలా ఈ దంతాన్ని కళింగ రాజులు సొంతం చేసుకున్నారు. ఈ దంతం ఎక్కడ ఉంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది.

యువరాణి హేమమాలిని, యువరాజు దంత ఈ దంతాన్ని రహస్యంగా లంకాపట్టణానికి తెచ్చారు. హేమమాలిని తల మీద శిఖలో దాచి తెచ్చిందని చెబుతారు. ఆ దంతాన్ని అనూరాధపురను పాలించిన రాజు సిరిమేఘవన్నకు ఇచ్చింది హేమమాలిని. మొదట ఆ దంతాన్ని మేఘగిరి విహార (ఇసురు మునియ) లో భద్రపరిచారు. క్రమంగా రాజుల్లో ఈ దంతాన్ని కలిగి ఉండడం ఆధిక్యతకు చిహ్నంగా భావించారు. శ్రీలంకలో రాజులు ఆ దంతం తమ రాజ్యంలో ఉండడం తమకు గొప్ప అన్నట్లు భావించేవారు. దాంతో ఎవరికి వారు ఆ దంతం తమ రాజ్యంలోనే ఉండాలని ఒకింత పోటీ పడేవారు కూడా.

ఆలయ సౌందర్యం!
ఆనాటి రాజులు బౌద్ధ స్థూపాలు, ఆలయాల నిర్మాణానికి తమవంతుగా సమృద్ధిగా నిధులు కేటాయించేవారు. కాండీలోని ఆలయనిర్మాణం అత్యంత సుందరంగా, అంతకు మించిన సంపన్నతతో ఉంది. ఆలయం ఆర్కిటెక్చర్‌ గొప్పతనానికి చేతులెత్తి మొక్కాల్సిందే. ఈ తలుపులను ఒకరు తెరవడం సాధ్యం కాదు. తిరుమల వేంకటేశ్వర ఆలయం మహాద్వారం తలుపుల్లాగ భారీగా ఉంటాయి. ఉలి నైపుణ్యం గోడలు, స్తంభాల్లోనే కాదు తలుపు గడియల్లో కూడా చూడవచ్చు. నెమలి పింఛం ఆకారంలో ఉన్న గడియ కనీసం రెండు కిలోల బరువుంటుంది. సరదాపడి పైకి తీద్దామన్నా ఒక చేతితో కదిలించలేం.

మనకు ఆలయాల్లో ప్రవేశద్వారాలే తెలుసు, కానీ ఇక్కడ ప్రవేశ భవనమే ఉంది. తొలి భవనంలో అడుగు పెట్టగానే గర్భగుడి కోసం చూస్తాం. కానీ అదంతా ప్రవేశ మార్గమే. అసలు ఆలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి బుద్ధభగవానుడి దర్శనం చేసుకునే వరకు మనల్ని మనం మరిచిపోతాం. ఇప్పటి వరకు మనం చూడని మరోలోకంలో ఉన్న భావన కలుగుతుంది. ఆలయం పై కప్పు జామెట్రికల్‌ డిజైన్‌లు కూడా తేలికరంగులతో కంటికి హాయినిస్తూ నిర్మాణకౌశలానికి అద్దం పడుతుంటాయి. ప్రకృతి మనకు కలువలను ఎన్ని షేడ్‌లలో ఇస్తోందో ఈ ఆలయంలో చూడాల్సిందే. ఆలయ అలంకరణలో తెల్లని పూలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. బౌద్ధావలంబకులు కూడా (భిక్కులు కాదు) బుద్ధుని దర్శనానికి శ్వేత వస్త్రాలు ధరించి వస్తారు. చంటిబిడ్డలకు కూడా తెల్లని వస్త్రాలే వేస్తారు.

వర్షం పడినా చలి ఉండదు!
కాండీ నగరం మొత్తం కనిపించే వ్యూ పాయింట్స్‌ ఉంటాయి. అక్కడ ఆగి నగరసౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక సరస్సును, ఒడ్డున ధవళ బుద్ధుడిని మిస్‌ కాకూడదు. కాండీ నగరంలోని సరస్సు... మనదేశంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ముసోరి సరస్సును తలపిస్తుంది. కాండీ రిలిక్‌ టెంపుల్‌ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణశైలిని తలపిస్తుంది. ఇక్కడ వర్షం సీజన్‌తో పని లేకుండా రోజూ ఏదో ఒక సమయంలో చిరుజల్లయినా పడుతుంది. అందుకే గొడుగు దగ్గర ఉండడం అవసరం. ఇక్కడ మనకు ఒకింత ఆశ్చర్యకలిగించే విషయం ఏమిటంటే వర్షం కురుస్తుంది, కానీ చలి ఉండదు. వర్షం జల్లు ఆగిన వెంటనే ఉక్కపోత కూడా ఉంటుంది. మొత్తానికి శ్రీలంకలో ఉన్నది ఎండాకాలం, వర్షాకాలం రెండు సీజన్‌లేనని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది.
– వాకా మంజులారెడ్డి

(చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement