విద్యుత్ సమ్మె విరమణ
చర్చలు సఫలం 27.5 శాతం ఐఆర్, మూడు ఇంక్రిమెంట్లకు ఓకే
కాంట్రాక్టు ఉద్యోగులకూ నెలాఖరుకు పది శాతం ఐఆర్
{పభుత్వ అనుమతి తీసుకుంటామని యాజమాన్యం హామీ
అర్ధరాత్రి నుంచే విధుల్లోకి వెళుతున్నట్లు జేఏసీ ప్రకటన
నేటి మధ్యాహ్నానికి ఉత్పత్తి పునరుద్ధరణ!
హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించారు. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలించాయి. ఉద్యోగుల డిమాండ్ మేరకు 27.5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్), మూడు ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. అయితే అంతిమంగా ఈ అంశాలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మళ్లీ చర్చించి.. అందుకు అనుగుణంగా పీఆర్సీ అమలు చేస్తామని హామీనిచ్చింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సీతారామిరెడ్డి, కన్వీనర్ సుధాకర్‌రావు సోమవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు. వాస్తవానికి కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ విషయంపై చర్చల్లో మధ్యాహ్నం నుంచి స్తబ్ధత ఏర్పడింది. కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలపై ట్రాన్స్‌కో జేఎండీ రమేష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదు. ఈ నెలాఖరు నాటికి ఇది అందుతుందని, ఆ తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యం తొలుత పేర్కొంది. ఇందులో భాగంగానే ఈ కమిటీ మంగళవా రం భేటీ అవుతోందని తెలిపింది.
అయితే తర్వాత సాగిన చర్చల్లో మాత్రం.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఈ నెలాఖరులోగానే కాంట్రాక్టు ఉద్యోగులకు పది శాతం ఐఆర్ ఇచ్చేందుకు సిద్ధమని యాజమాన్యం కాస్త స్పష్టతనిచ్చింది. దీంతో శాంతించిన జేఏసీ నేతలు సమ్మె ను విరమిస్తున్నట్టు, సోమవారం అర్ధరాత్రి నుంచే విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ చర్చల్లో ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందా, జేఎండీ రమేష్, జెన్‌కో ఎండీ విజయానంద్, సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నుంచి కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, జేఏసీ నేతలు ఎం. గోపాల్, వెంకన్నగౌడ్, ప్రసాద్, కిరణ్, చంద్రుడు, భానుప్రకాశ్ చర్చలు జరిపారు.
కాంట్రాక్టు సిబ్బంది ఆందోళన
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు తమకూ ఐఆర్ ఇ వ్వాల్సిందేనని చర్చల సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు పట్టుబట్టారు. చర్చలకు వేదికైన విద్యు త్ సౌధ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని, తమకూ వేతన సవరణ జరగకుండా సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవైపు జీహెచ్‌ఎంసీలోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ ఇస్తున్నారని, తమకివ్వడంలో అభ్యంతరం ఏమిటని యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చే విధానం విద్యుత్ సంస్థల్లో మొదటి నుంచి లేదని.. ఇప్పుడు తాము దీనిపై నిర్ణయం తీసుకోలేమని కొత్తగా ఏర్ప డే ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని యాజ మాన్యం తొలుత పేర్కొంది. ఈ నేపథ్యంలో చర్చల్లో మధ్యాహ్నం నుంచి స్తబ్దత ఏర్పడింది. చివరకు ప్రభుత్వం అనుమతి తీసుకుని ఈ నెలాఖరుకే పది శాతం ఐఆర్ ఇస్తామని యాజమాన్యం పేర్కొనడం తో చర్చలు సఫలమయ్యాయి. కా నీ, కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రం విరమణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతినివ్వకపోతే తమ పరిస్థితేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాగదీసే వ్యవహారమని మండిపడ్డారు.
పరిశ్రమలకు పూర్తిగా పవర్ కట్!
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఉత్పత్తి 11వేల నుంచి 6 వేల మెగావాట్లకు పడిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలకు విద్యుత్ కోతలను అమలు చేశారు. సోమవారం పరిశ్రమలకు ఒక్క యూనిట్ కూడా సరఫరా కాలేదు. అలాగే వ్యవసాయానికీ పూర్తిగా కోత విధించారు. ఇక ఆదివారం గ్రామా లు, పట్టణాలకే పరిమితమైన కోతలు సోమవారం హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, వరంగల్‌లోనూ అమలు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలతో జనం ఇక్కట్లు పడ్డారు. ఉక్కపోత, దోమల బెడదతో అగచాట్లు పడ్డారు. దీంతో కొన్ని సబ్‌స్టేషన్లపై ప్రజలు దాడులు చేశారు.
అన్నీ మూతలే...
ఉద్యోగుల సమ్మె వల్ల జెన్‌కోకు చెందిన పలు విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీపీ, ఆర్‌టీఎస్, మాచ్‌ఖండ్, సీలేరు బేసిన్‌లో మినహా అన్ని విద్యుత్ ప్లాంట్లల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. జెన్‌కోకు చెందిన అన్ని థర్మల్ ప్లాంట్లలో కలిపి మొత్తం 4,980 మెగావాట్ల ఉత్పత్తి ఆగింది. అయితే, సోమవారం రాత్రికి ఉద్యోగులు విధుల్లో చేరినప్పటికీ థర్మల్ కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదు.