కరెంట్‌కు కటకట
- హామీలు నెరవేర్చలేదని విద్యుత్ ఉద్యోగుల సమ్మె
- చాలా చోట్ల పగలంతా పవర్ కట్
- ఫ్యూజులు పోయినా పట్టించుకునేవారు లేరు
- కరెంట్‌లేక ప్రజల అవస్థలు
తిరుపతి, న్యూస్‌లైన్: తమ డిమాండ్ల సాధనకోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో ప్రజలకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ట్రాన్స్‌కో, జెన్ కో సంస్థల సిబ్బంది ఆదివారం నుంచి సమ్మెకు దిగడంతో గ్రామీణ ప్రాంతాల్లో అసలే అంతంత మాత్రంగా ఉన్న కరెంట్ సరఫరా మరింతగా దిగజారింది. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిచేసే వారు లేకపోవడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సిబ్బంది సమ్మె కారణంగా మదనపల్లెలో ఆదివారం ఉదయం నుంచి కరెంట్ సరఫరా లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చింది. సోమవారం ఉదయం 9 గంటలకు సరఫరా ఆగిపోయి, సాయంత్రం 5 గంటల వరకు కూడా రాలేదు. పుంగనూరులో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తె లియని పరిస్థితి. అరగంట సరఫరా ఉంటే మూడు గంటలు ఉండ టం లేదని ప్రజలు వాపోతున్నారు.
పీలేరులోఆదివారం ఉదయం పోయిన కరెంట్ రాత్రి వచ్చింది. సోమవారం ఉదయం 7.30 గంటలకు పోయి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది. పలమనేరులోనూ అదే పరిస్థితి. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు పట్టణాల్లో మాత్రం కరెంట్ కోత వేళలను యథావిధిగా అమలు చేస్తున్నారు. మొత్తం మీద విద్యుత్ సిబ్బంది సమ్మె ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రజలపై పడుతోంది. సమ్మె ఇలాగే కొనసాగితే పల్లె ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పవు.
డిస్కం కార్యాలయం వద్ద ధర్నా
గతంలో అంగీకరించిన మేరకు జీతాలను సవరించి చెల్లించేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో అనివార్యంగా సమ్మెకు దిగాల్సి వచ్చిందని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ పీ.అశోక్‌కుమార్ తెలిపారు. సమ్మెలో భాగంగా తిరుపతిలో డిస్కం కార్పొరేట్ కార్యాలయం(విద్యుత్ నిలయం) ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులు సోమవారం ధర్నాచేసి తమ డిమాండ్లను నినదించారు. సిబ్బంది సమ్మెకారణంగా డిస్కం కార్యాలయంతో బాటు సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించాయి.
ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ తమ డిమాండ్లపై ట్రాన్స్‌కో యాజమాన్యం విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో పలు దఫాలు చర్చలు జరిపి అంగీకరించిన మేరకు ఈనెల 21న అగ్రిమెంట్ పై సంతకాలు చేయాల్సి ఉందన్నారు. అయితే యాజమాన్యం మాట మార్చి ఇప్పుడు కుదరదని చెప్పడంతో తాము సమ్మెకు దిగామన్నారు.
జేఏసీ కన్వీనర్ మునిశంకరయ్య మాట్లాడుతూ ప్రతి నాలుగేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణ చేయకుండా యాజమాన్యం మొండి వైఖరిని అవలంబించడం దురదృష్టకరమన్నారు. ధర్నాలో డిస్కం జేఏసీ ప్రచార కార్యదర్శి ఎల్.చలపతి, కో-కన్వీనర్లు ధర్మజ్ఞాని, బాలచంద్రబాబు, ర మేష్‌బాబు, పీ.మాధవరావ్, బీ.వాలాజీ పాల్గొన్నారు.