రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
తిరుపతి, న్యూస్‌లైన్: పీఆర్‌సీ ఏర్పాటులో యాజమాన్య నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే దశలవారీగా ఉద్యమం చేపట్టి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా యాజ మాన్యం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌పీడీసీఎల్) పరిధిలోని ఆరు జిల్లాల్లో పనిచేసే దాదాపు 10 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు.
సంస్థలోని 16 ఉద్యోగ సంఘాలు ఏకమై ఏపీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వర్క్ టు రూల్ పాటించి తిరుపతిలోని డిస్కం కార్పొరేట్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. తమ జీత భత్యాల సవరణ కోసం ఒక పీఆర్‌సీని వేయమని తాము కోరితే యాజమాన్యం మూడు కమిటీలు వేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్, కన్వీనర్ మునిశంకరయ్య ఆరోపించారు.
పీఆర్‌సీతో పాటు కాంట్రాక్ ్ట సిబ్బంది సర్వీసులను క్రమబద్ధం చేయాలని, సంస్థలో ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి రోజు బుధవారం చేపట్టిన నిరాహార దీక్షలో పీ.బాలాజీ, నంజుండేశ్వర్, పీ.శ్రీధరన్, టీ.సుబ్రమణ్యం నాయుడు, జే. నాగరాజన్, ఎస్.భాస్కర్ పాల్గొన్నారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.