తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలి
హైందవ, పౌర సంఘాల డిమాండ్
శ్రీవారి లడ్డూ వివాదంపై సత్యశోధన నివేదిక విడుదల
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం పవిత్రమైన తిరుమలకు కళంకం తెచ్చారని హైందవ, పౌర సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ జరిగిందంటూ నిందలు మోపిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తిరుమల లడ్డూ వివాదంపై ఆచార్య రామానుజ సమితి రూపొందించిన సత్యశోధన నివేదిక విడుదల చేశారు.
నెయ్యి కల్తీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ పైనే అనుమానాలు ఉన్నాయని ఈ నివేదికలో తేల్చారు. ఎంతో కీలకమైన ఈ అంశంలో నెయ్యి శాంపిల్స్ ఒకే ల్యాబ్‌కు పంపడం, పంపే ముందు టీటీడీ ఈవో ఎన్డీడీబీ ప్రతినిధులతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తోందని నివేదికలో పేర్కొన్నారు.
ఎవరూ చేయనంత అపచారమిది
ఈ సందర్భంగా ఆచార్య రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు మాట్లాడుతూ.. తిరుమల చరిత్రలో ఎవరూ చేయనంత అపచారం సీఎం చంద్రబాబు చేశారన్నారు. శ్రీవారి ప్రసాదానికి కళంకం ఆపాదించారని మండిపడ్డారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఈవో శ్యామలరావును దుష్ట్రతయంగా అభివర్ణించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఆ వివాదంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు.
తిరుమల పరువు మంటగలిపారు
గీతా విజన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పొక్కులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. తమ అధ్యయనంలో నెయ్యి శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు కలిసినట్టు ఆధారాలు లభించలేదన్నారు. ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీం పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేసి తిరుమల పరువు మంటగలిపారని మండిపడ్డారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను చూసి క్షుద్ర దేవతలు కూడా సిగ్గుపడతారన్నారు.
లడ్డూ వివాదంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని, ఫలితంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పాలనలో పగ ప్రతీకారాలకే ప్రాధాన్యమిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతో తన ప్రతి వైఫల్యాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లడ్డూ విషయంలో చంద్రబాబు, ఈవో శ్యామలరావు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు.
సుప్రీం వ్యాఖ్యలు చెప్పు దెబ్బలాంటివి
ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ బి.ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, పవన్, ఈవో శ్యామలరావుకు చెప్పు దెబ్బలాంటివన్నారు. నీతి, నిజాయితీ ఉన్న నాయకులు ఎవరైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు రాజీనామా చేసి ఉండేవారన్నారు.
పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఓవరాక్షన్ చేస్తున్నారని, దాని కారణంగా సనాతన ధర్మం నవ్వుల పాలవుతోందని ఎద్దేవా చేశారు. సత్యశోధన నివేదికను పరిశీలిస్తే లడ్డూ ప్రసాదం విషయంలో కుట్రకోణం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్త వంగ శోభన్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment