ఎల్‌వోసీ వెంట పరిస్థితిపై బీఎస్‌ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ వెల్లడి
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్‌ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్‌ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు.
‘ఎల్‌వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్‌వోసీ వెంట ఉన్న తంగ్‌ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment