ములుగు/వాజేడు: రానున్న ఎన్నికలే లక్ష్యంగా మావోయిస్టులు చేస్తున్న కుట్రను గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు తిప్పికొట్టారని బుధవారం ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓఎస్‌డీ అశోక్‌కుమార్ తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు కర్రె గుట్టల్లో 30 నుంచి 40 మంది సాయుధ మావోయిస్టులు పెద్ద నాయకులతో కలసి ఉన్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, ఎగోలపు మల్లయ్య, భద్రు అలియాస్ పాపన్న, ముచ్చకి ఉంగల్ అలియాస్ రఘు, మడకం మంగ అలియాస్ మాసా ఇతర దళ సభ్యులు కర్రె గుట్ట ప్రాంతంలో ఉన్నారని.. తెలంగాణలో భారీ విధ్వంసానికి పాల్పడేందుకు పథకం వేస్తున్నారని సమాచారం రాగా బుధవారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు.
ఆ సమయంలో మావోయిస్టులు పోలీసు పార్టీలను చూసి తమ వస్తువులను అక్కడే వదిలి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. వారిని వెంబడించినప్పటికీ దొరకలేదని, అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా కిట్ బ్యాగుల్లో ఆలివ్‌రంగు డ్రెస్‌లు, ఇతర వస్తువులు, సుతిలి బాంబు, రేడియోలు, సోలార్ ప్లేట్లు, ఇతర ఎల్రక్టానిక్ వస్తువులు, పాత్రలు, కిరాణా వస్తువులు, దోమ తెరలు, మావోయిస్టు సాహిత్యం, మందులు, నీటి డబ్బాలు, సీసాలు, గొడుగులు, కూరగాయలు, తాళ్లు దొరికాయని తెలిపారు. కర్రె గుట్ట ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment