work to rule
-
వెనక్కి తగ్గిన రెవెన్యూ సంఘాలు
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆందోళన నుంచి వెనక్కి తగ్గాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానచలనం కలిగిన తహసీల్దార్లను పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలనే డిమాండ్‌తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ).. ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) ఆందోళన విరమించుకుంటున్నామని అర్ధింతరంగా ప్రకటించడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతిమయంగా తయారైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తామని, అవసరమైతే ఆ శాఖను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం.. సీఎం మాటలకు తగ్గట్టుగానే రోజుకో అధికారి ఏసీబీ వలలో చిక్కుకుంటుండటంతో ఆ శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. రెండు రోజుల క్రితం కేశంపేట తహసీల్దార్, వీఆర్ఓను అవినీతి నిరోధక శాఖ పట్టుకోగా.. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలోని ఓ మండల తహసీల్దార్.. ఒక రైతు నుంచి లంచం తీసుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం రెవెన్యూ శాఖపై ప్రజల్లో చులకన భావానికి దారితీస్తోంది. కలిసేందుకు ససేమిరా! ఓవైపు తహసీల్దార్లను పాత జిల్లాలకు బదిలీ చేయకపోతే సామూహిక సెలవులు పెడతామని హెచ్చరించినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం.. మరోవైపు ఉన్నతాధికారులు కనీసం అపాయింట్మెంట్కు ససేమిరా అంటుండటంతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలను ఆత్మరక్షణలో పడేసింది. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి.. తహసీల్దార్లను పూర్వపు జిల్లాలకు పంపే విషయంలో అయిష్టంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలకు ఉన్నతాధికారులు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోగా.. ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని భావించిన యూనియన్లే మెట్టు దిగినట్లుకనిపిస్తోంది. దీనికి తోడు ఆందోళనను ఉధృతం చేద్దామని భావించిన తరుణంలో ఒక తహసీల్దార్‌పై ఏసీబీ చేసిన దాడిలో ఏకంగా రూ.93 లక్షల నగదు దొరకడం ఉద్యమాన్ని నీరు గార్చిందని సంఘం నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ పరిణామంతో వర్క్ టు రూల్ చేపడితే.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన విరమణ: ట్రెసా, టీజీటీఏ తహసీల్దార్ల బదిలీలపై ట్రెసా, టీజీటీఏ నాయకత్వాలు జరిపిన చర్చలకు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంది. దీంతో టీజీటీఏ ఇచ్చిన వర్క్ టు రూల్ పిలుపును ఉపసంహరించుకుంటున్నాం. ఇతర ఆందోళన షెడ్యూల్‌ను కూడా విరమించుకుంటున్నాం. ఇక నుంచి ఏ కార్యక్రమమైనా రెండు సంఘాలు సమష్టిగా నిర్ణయం తీసుకుంటాయి. -
నిరసన దిశగా రెవెన్యూ ఉద్యోగులు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగులపై పోలీసులు దౌర్జన్యం చేసినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడాన్ని రెవెన్యూ కాన్ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించింది. వరుస సంఘటనలతో రెవెన్యూ ఉద్యోగులు అభద్రతా భావానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా అధికారుల చర్యలను నిరసిస్తూ గురువారం నుంచి వర్క్ టూ రూల్ పాటించాలని నిర్ణయించింది. స్థానిక రెవెన్యూ భవన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు జిల్లా అధికారుల తీరును తప్పుపట్టారు. ఈ నెల 6వ తేదీ మార్కాపురం డివిజన్లోని బద్వీడు పోలింగ్ కేంద్రంలో విధి నిర్వహణలో పెద్దారవీడు తహసీల్దార్, సిబ్బందిపై ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ దౌర్జన్యం చేసినా జిల్లా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఆయనపై విచారణ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించలేదని చెప్పారు. ఈ నెల 11వ తేదీన కొండపి మండలం ఇలవరలో ఎన్నికల విధుల్లో ఉన్న వీఆర్ఏపై సీఐ లక్ష్మణ్ తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. ఈ సంఘటనలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, ఎస్పీ విచారించకపోవడం దారుణమన్నారు. రెవెన్యూ కాన్ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ఈ నెల 28వ తేదీన ఒంగోలు వస్తున్నారని, ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు కూడా వస్తారని, ఉద్యోగ జేఏసీతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ ఉద్యోగులమని చెప్పినప్పటికీ పోలీసులు కొట్టడాన్ని ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీవ్రంగా ఆక్షేపించారు. కలెక్టరేట్ వద్ద నామినేషన్ల సందర్భంగా సీఐ రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా అధికారులు పోలీసులతో కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోకుంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తామన్నారు. సమావేశంలో ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శరత్‌బాబు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి ఆర్ వాసుదేవరావు, నాయకులు తోటకూర ప్రభాకర్, శెట్టి గోపి, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జీ సుబ్రహ్మణ్యం, ఊతకోలు శ్రీనివాసరావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పీ రాము పాల్గొన్నారు. -
రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
తిరుపతి, న్యూస్‌లైన్: పీఆర్సీ ఏర్పాటులో యాజమాన్య నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే దశలవారీగా ఉద్యమం చేపట్టి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా యాజ మాన్యం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని ఆరు జిల్లాల్లో పనిచేసే దాదాపు 10 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. సంస్థలోని 16 ఉద్యోగ సంఘాలు ఏకమై ఏపీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వర్క్ టు రూల్ పాటించి తిరుపతిలోని డిస్కం కార్పొరేట్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. తమ జీత భత్యాల సవరణ కోసం ఒక పీఆర్సీని వేయమని తాము కోరితే యాజమాన్యం మూడు కమిటీలు వేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్, కన్వీనర్ మునిశంకరయ్య ఆరోపించారు. పీఆర్సీతో పాటు కాంట్రాక్ ్ట సిబ్బంది సర్వీసులను క్రమబద్ధం చేయాలని, సంస్థలో ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి రోజు బుధవారం చేపట్టిన నిరాహార దీక్షలో పీ.బాలాజీ, నంజుండేశ్వర్, పీ.శ్రీధరన్, టీ.సుబ్రమణ్యం నాయుడు, జే. నాగరాజన్, ఎస్.భాస్కర్ పాల్గొన్నారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.