ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగులపై పోలీసులు దౌర్జన్యం చేసినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడాన్ని రెవెన్యూ కాన్ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించింది. వరుస సంఘటనలతో రెవెన్యూ ఉద్యోగులు అభద్రతా భావానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
జిల్లా అధికారుల చర్యలను నిరసిస్తూ గురువారం నుంచి వర్క్ టూ రూల్ పాటించాలని నిర్ణయించింది. స్థానిక రెవెన్యూ భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు జిల్లా అధికారుల తీరును తప్పుపట్టారు.
ఈ నెల 6వ తేదీ మార్కాపురం డివిజన్‌లోని బద్వీడు పోలింగ్ కేంద్రంలో విధి నిర్వహణలో పెద్దారవీడు తహసీల్దార్, సిబ్బందిపై ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ దౌర్జన్యం చేసినా జిల్లా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఆయనపై విచారణ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించలేదని చెప్పారు.
ఈ నెల 11వ తేదీన కొండపి మండలం ఇలవరలో ఎన్నికల విధుల్లో ఉన్న వీఆర్‌ఏపై సీఐ లక్ష్మణ్ తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. ఈ సంఘటనలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, ఎస్పీ విచారించకపోవడం దారుణమన్నారు.
రెవెన్యూ కాన్ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ఈ నెల 28వ తేదీన ఒంగోలు వస్తున్నారని, ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు కూడా వస్తారని, ఉద్యోగ జేఏసీతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
రెవెన్యూ ఉద్యోగులమని చెప్పినప్పటికీ పోలీసులు కొట్టడాన్ని ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీవ్రంగా ఆక్షేపించారు. కలెక్టరేట్ వద్ద నామినేషన్ల సందర్భంగా సీఐ రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా అధికారులు పోలీసులతో కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోకుంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తామన్నారు.
సమావేశంలో ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శరత్‌బాబు, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి ఆర్ వాసుదేవరావు, నాయకులు తోటకూర ప్రభాకర్, శెట్టి గోపి, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జీ సుబ్రహ్మణ్యం, ఊతకోలు శ్రీనివాసరావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పీ రాము పాల్గొన్నారు.
నిరసన దిశగా రెవెన్యూ ఉద్యోగులు
Published Thu, Apr 24 2014 4:31 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement