న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ట్విటర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి టెక్ దిగ్గజాలు వేలాది ఉద్యోగులను తొలగిస్తూ వారిని ఆందోళనలోకి నెట్టి వేస్తున్నాయి. ఎపుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని గందరగోళ పరిస్థితి. ఈ తరుణంలో ఒక టెక్ కంపెనీ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ వార్తల్లో నిలిచింది. ఏకంగా సంస్థలో పని చేస్తున్న 21 వేల మందికిభారీ బహుమతిని ప్రకటించింది.
ఐటీ సొల్యూషన్స్ కంపెనీ కోఫోర్జ్ దాని Q4 ఆదాయాలలో కీలక మైలురాయిని అధిగమించింది. ఒక బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించిన శుభ సమయంలో సంస్థలోని మొత్తం 21వేల మందిలో ప్రతి ఒక్కరికి యాపిల్ ఐపాడ్‌ను బహుమతిగా ఇస్తుంది. ఇందుకోసం రూ. 80.3 కోట్లు కేటాయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి సేల్స్, మార్కెటింగ్ సిబ్బంది తదిరులను మినహాయించి మొత్తం కంపెనీలో 21,815 మంది ఉద్యోగులున్నారు.
త్రైమాసికంలో తమ పనితీరు రెండు కీలక విజయాలు సాధించామని, మొదటిది త్రైమాసిక క్రమానుగత 5 శాతం వృద్ధి. రెండోది బిలియన్ డాలర్ల మార్క్ ఆదాయాన్ని అధిగమించడమని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ వెల్లడించారు. 2024లో కూడా ఇదే వృద్ధిని కొనసాగించనున్నామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కోఫోర్జ్ కంపెనీ ఫలితాలు, డివిడెండ్
గత ఏడాది రూ.1,742 కోట్లుగాగా ఉన్న కోఫోర్జ్ కంపెనీ గ్రాస్ రెవెన్యూ మార్చి 31తో ముగిసిన క్యూ4లో 24.5 శాతం పెరిగి రూ.2,170 కోట్లకు చేరింది. అయితే నికర లాభం క్యూ4లో 48.08 శాతం తగ్గి రూ.116.7 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది అది రూ.224.8 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెర్టికల్ పై సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలడం, గ్లోబల్ బ్యాంకింక్ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపలేదని సంస్థ పేర్కొంది. రానున్న కాలంలో 13 శాతం నుండి 16 శాతానికి వార్షిక ఆదాయ మార్గదర్శకత్వం ఇచ్చింది. అలాగే దాదాపు 50 బేసిస్ పాయింట్ల (bps) స్థూల మార్జిన్ పెరుగుదలను కూడా అంచనా వేసింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ. 19 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీ మే 9గా సంస్థ ప్రకటించింది. 25 డెలివరీ కేంద్రాలతో 21 దేశాల్లో సేవల్ని అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment