
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆందోళన నుంచి వెనక్కి తగ్గాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానచలనం కలిగిన తహసీల్దార్లను పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలనే డిమాండ్‌తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ).. ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) ఆందోళన విరమించుకుంటున్నామని అర్ధింతరంగా ప్రకటించడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతిమయంగా తయారైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తామని, అవసరమైతే ఆ శాఖను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం.. సీఎం మాటలకు తగ్గట్టుగానే రోజుకో అధికారి ఏసీబీ వలలో చిక్కుకుంటుండటంతో ఆ శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. రెండు రోజుల క్రితం కేశంపేట తహసీల్దార్, వీఆర్‌ఓను అవినీతి నిరోధక శాఖ పట్టుకోగా.. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలోని ఓ మండల తహసీల్దార్.. ఒక రైతు నుంచి లంచం తీసుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం రెవెన్యూ శాఖపై ప్రజల్లో చులకన భావానికి దారితీస్తోంది.
కలిసేందుకు ససేమిరా!
ఓవైపు తహసీల్దార్లను పాత జిల్లాలకు బదిలీ చేయకపోతే సామూహిక సెలవులు పెడతామని హెచ్చరించినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం.. మరోవైపు ఉన్నతాధికారులు కనీసం అపాయింట్‌మెంట్‌కు ససేమిరా అంటుండటంతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలను ఆత్మరక్షణలో పడేసింది. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి.. తహసీల్దార్లను పూర్వపు జిల్లాలకు పంపే విషయంలో అయిష్టంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలకు ఉన్నతాధికారులు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోగా.. ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని భావించిన యూనియన్లే మెట్టు దిగినట్లుకనిపిస్తోంది. దీనికి తోడు ఆందోళనను ఉధృతం చేద్దామని భావించిన తరుణంలో ఒక తహసీల్దార్‌పై ఏసీబీ చేసిన దాడిలో ఏకంగా రూ.93 లక్షల నగదు దొరకడం ఉద్యమాన్ని నీరు గార్చిందని సంఘం నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ పరిణామంతో వర్క్ టు రూల్ చేపడితే.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆందోళన విరమణ: ట్రెసా, టీజీటీఏ
తహసీల్దార్ల బదిలీలపై ట్రెసా, టీజీటీఏ నాయకత్వాలు జరిపిన చర్చలకు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంది. దీంతో టీజీటీఏ ఇచ్చిన వర్క్ టు రూల్ పిలుపును ఉపసంహరించుకుంటున్నాం. ఇతర ఆందోళన షెడ్యూల్‌ను కూడా విరమించుకుంటున్నాం. ఇక నుంచి ఏ కార్యక్రమమైనా రెండు సంఘాలు సమష్టిగా నిర్ణయం తీసుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment