Revenue Employees Association
-
పదోన్నతులు ఇవ్వాలి.. జాబ్‌చార్ట్ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఉద్యోగుల జాబ్‌చార్ట్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట లో ట్రెసా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరువందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చినప్పటికీ.. రెవెన్యూ శాఖలో మాత్రం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, ఇతరత్రా పలు అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు. రవీందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పూల్‌సింగ్, రాజ్‌కుమార్, రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, యాదగిరి, ఎల్బీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలివే.. ♦కేడర్ స్ట్రెంగ్త్ వెంటనే నిర్ధారించి అన్ని తహసీల్ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. ♦సుదూర జిల్లాలకు పోస్టింగులు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లను ముఖ్యంగా మహిళా ఉద్యోగినులను వారి ఆప్షన్ల ప్రకారం జిల్లాలకు కేటాయించాలి ♦ఉద్యోగుల బదిలీల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. దీర్ఘకాలంగా ఒకే ప్రాం తంలో పని చేస్తున్న తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు అనుమతించాలి ♦వీఆర్వోలను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలి. -
మంత్రి ధర్మానతో రెవెన్యూ ఉద్యోగుల భేటీ
సాక్షి, విజయవాడ: రెవెన్యూ ఉద్యోగులు క్షేత్రస్థాయి సమస్యలపై డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో మంగళవారం భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన విషయాలను రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. 'రెవెన్యూ ఉద్యోగుల క్షేత్రస్థాయి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీ సర్వే చేపడుతోంది. అది ముగిసేవరకు రెవెన్యూ ఉద్యోగులకు వేరే విధులు కేటాయించొద్దని కోరాం. క్రమశిక్షణ చర్యలకు గురైన ఉద్యోగులపై శాఖాపరమైన విచారణ జరపకుండా కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగుల సర్వీస్ పూర్తయిన విచారణలు పూర్తికాక పెన్షన్ కూడా అందుకోలేని పరిస్థితి ఉంది. వీటిపై దృష్టిసారించి వీలైనంత త్వరగా విచారణలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరాం. తహశీల్దార్లుకు నిధులు పూర్తి స్థాయిలో రాక.. వారు పడుతున్న ఇబ్బందులను వివరించినట్లు' బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. (సీఎం జగన్‌ను కలవనున్న దివ్య పేరెంట్స్) -
ఎమ్మార్వోలకే ‘పార్ట్–బీ’ బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తేరుకుంది. చిక్కుముడిగా మారిన పార్ట్–బీ భూములను పరిష్కరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లూ జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పేరిట కాలయాపన చేసిన రెవెన్యూశాఖ.. ఈ భూ వివాదాలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా.. సవరణ అధికారాన్ని తహసీల్దార్లకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం.. పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములు, భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు–రెవెన్యూ శాఖ ల మధ్య తగాదా, ఫారెస్టు, ప్రైవేటు భూముల మధ్య వివాదాస్పదంగా ఉన్నవాటిని కూడా ఈ కేటగిరీలో నమోదు చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల మేర భూములను పార్ట్–బీ కేటగిరీలో చేర్చింది. అయితే, వీటిని సకాలంలో పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగంఎడతెగని జాప్యం ప్రదర్శించింది. సాఫ్ట్వేర్ సమస్యలు, తప్పొప్పులను సవరించే అధికారం జేసీలకు కట్టబెట్టడంతో పార్ట్–బీ భూముల వ్యవహారం జటిలమైంది. ఈ భూములకు పాస్‌పుస్తకాలు నిలిపేయడంతో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగడం.. ఆ వివాదాలను పరిశీలన, పరిష్కరించే అధికారం తమకు లేదని తహసీల్దార్లు చెప్పినా వినకపోవడంతో ఉద్దేశపూర్వంగా రెవెన్యూ ఉద్యోగులే చేయడం లేదనే భావన రైతాంగంలో నెలకొంది. ఈ వివాదాలు మొదలు. భౌతిక దాడులు వరకు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ప్రభుత్వం మేలుకుంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటునే.. పార్ట్–బీ భూములను కూడా సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ భూములను పరిశీలించి.. పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని యోచిస్తోంది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ ఆప్షన్ అనుమతిని తహసీల్దార్లకు ఇవ్వనుంది. తాజాగా తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసినందున.. కొత్త తహసీల్దార్లు కుదురుకోగానే ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించనున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో సీఎంతో భేటీ! రెవెన్యూ సమస్యలపై త్వరలో సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి నేతృత్వంలోనిప్రతినిధి బృందం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌ను కలసింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై చర్చించింది. అలాగే తాజా పరిణామాలను వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే సమావేశ తేదీని ఖరారు చేస్తానని హామీ ఇచ్చినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే తహసీల్దార్ల బదిలీకి కృషి చేసినందున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. -
వెనక్కి తగ్గిన రెవెన్యూ సంఘాలు
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆందోళన నుంచి వెనక్కి తగ్గాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానచలనం కలిగిన తహసీల్దార్లను పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలనే డిమాండ్‌తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ).. ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) ఆందోళన విరమించుకుంటున్నామని అర్ధింతరంగా ప్రకటించడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతిమయంగా తయారైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తామని, అవసరమైతే ఆ శాఖను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం.. సీఎం మాటలకు తగ్గట్టుగానే రోజుకో అధికారి ఏసీబీ వలలో చిక్కుకుంటుండటంతో ఆ శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. రెండు రోజుల క్రితం కేశంపేట తహసీల్దార్, వీఆర్ఓను అవినీతి నిరోధక శాఖ పట్టుకోగా.. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలోని ఓ మండల తహసీల్దార్.. ఒక రైతు నుంచి లంచం తీసుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం రెవెన్యూ శాఖపై ప్రజల్లో చులకన భావానికి దారితీస్తోంది. కలిసేందుకు ససేమిరా! ఓవైపు తహసీల్దార్లను పాత జిల్లాలకు బదిలీ చేయకపోతే సామూహిక సెలవులు పెడతామని హెచ్చరించినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం.. మరోవైపు ఉన్నతాధికారులు కనీసం అపాయింట్మెంట్కు ససేమిరా అంటుండటంతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలను ఆత్మరక్షణలో పడేసింది. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి.. తహసీల్దార్లను పూర్వపు జిల్లాలకు పంపే విషయంలో అయిష్టంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలకు ఉన్నతాధికారులు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోగా.. ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని భావించిన యూనియన్లే మెట్టు దిగినట్లుకనిపిస్తోంది. దీనికి తోడు ఆందోళనను ఉధృతం చేద్దామని భావించిన తరుణంలో ఒక తహసీల్దార్‌పై ఏసీబీ చేసిన దాడిలో ఏకంగా రూ.93 లక్షల నగదు దొరకడం ఉద్యమాన్ని నీరు గార్చిందని సంఘం నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ పరిణామంతో వర్క్ టు రూల్ చేపడితే.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన విరమణ: ట్రెసా, టీజీటీఏ తహసీల్దార్ల బదిలీలపై ట్రెసా, టీజీటీఏ నాయకత్వాలు జరిపిన చర్చలకు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంది. దీంతో టీజీటీఏ ఇచ్చిన వర్క్ టు రూల్ పిలుపును ఉపసంహరించుకుంటున్నాం. ఇతర ఆందోళన షెడ్యూల్‌ను కూడా విరమించుకుంటున్నాం. ఇక నుంచి ఏ కార్యక్రమమైనా రెండు సంఘాలు సమష్టిగా నిర్ణయం తీసుకుంటాయి. -
‘కోడ్’ ముగిసినా ఎక్కడి అధికారులు అక్కడే
సాక్షి, అమరావతి : ఎన్నికల నిబంధనావళి అమల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన అధికారులు ‘కోడ్’తో నిమిత్తం లేకుండా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసినందున వారిని పాత జిల్లాలకు పంపించాలా? లేక ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనేది కీలకమైన అంశమైనందున ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే కొనసాగించాలా? లేక ఎన్నికల ముందు వరకూ పనిచేసిన జిల్లాలకు తిరిగి బదిలీ చేయాలా? అనే అంశంపై స్పష్టమైన విధివిధానాల్లేవు. అందువల్ల కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అమలుచేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే, ఎన్నికలు ముగిసినందున ఎన్నికల ముందు పనిచేసిన స్థానాలకే అధికారులను తిరిగి బదిలీ చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ఇలాంటి నిబంధనేమీ లేదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. కొత్త ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఎలా చెబితే అలా చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఫైలును సీఎం పరిశీలన కోసం పంపింది. ఎందుకిలా? రాష్ట్రంలో విధానసభ, దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్.. మోడల్ కోడ్ (నిబంధనావళి) ప్రకారం రెవెన్యూ శాఖలో 530 మందికి పైగా తహసీల్దార్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఇదే నిబంధనావళి ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇతర శాఖల్లో ఇదే కేడర్‌లో పనిచేస్తున్న మరికొందరిని కూడా వేరే జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల కమిషన్ విధుల్లో భాగస్వాములను చేసే వారిని సొంత జిల్లాల నుంచి వేరే జిల్లాలకు బదిలీ చేయాలని నిబంధన ఉంది. అలాగే, మూడేళ్లుపైగా ఒకేచోట ఉన్న వారిని కూడా బదిలీ చేయాలని ఉంది. దీంతో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న ఆయా శాఖల అధికారులను బదిలీ చేశారు. కొందరు రెవెన్యూ డివిజనల్ అధికారులు సైతం ఇలాగే బదిలీ అయ్యారు. ఈ బదిలీలన్నీ మార్చి 10న వచ్చిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే జరిగాయి. ఈ నేపథ్యంలో.. ‘ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించిన అనంతరమే బదిలీ అయిన వారిని పూర్వ స్థానాలకు పంపించాలా? ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. అందుకోసం ఫైలు ఇప్పటికే పంపించాం’.. అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇతర విభాగాల వారి విషయంలోనూ ఇదే విధానం అమలవుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. సాధారణ పరిపాలన వేగవంతం ఇదిలా ఉంటే.. ఎన్నికల కోడ్ ముగిసినందున అధికార యంత్రాంగం ఇక పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత మూడు నెలలుగా ఎన్నికల పనులు, తర్వాత ‘కోడ్’ అంటూ క్షేత్రస్థాయి అధికారులు ప్రజల వినతులు, సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో రెవెన్యూ కార్యాలయాల్లో రోజువారీ సాగాల్సిన పనులన్నీ స్తంభించాయి. ‘వాస్తవంగా పట్టాదారు పాసుపుస్తకాల జారీ, రెవెన్యూ రికార్డుల మార్పులు చేర్పులు, సవరణలు (మ్యుటేషన్), భూముల కొలతలు, వ్యవసాయ ఆధార ధ్రువీకరణ పత్రాల జారీ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సాధారణ కార్యకలాపాలు నిత్యం చేయాల్సిందే. ఇవి ఎన్నికల కోడ్ పరిధిలోకి రావు. అయితే, అధికారులు పని భారాన్ని సాకుగా చూపుతూ ఈ పనులను నిలిపేశారు. ఇప్పుడు ఎన్నికల క్రతువు ముగిసినందున అధికారులు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం’.. అని ఒక ఉన్నతాధికారి వివరించారు. ముగిసిన ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రంలో శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘కోడ్’.. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో దాని కాల పరిమితి ముగిసిందని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కార్యదర్శి అజయ్‌కుమార్ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా లోక్‌సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడి కావడంతో మోడల్ కోడ్‌ను ఎత్తివేస్తున్నాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం మొత్తానికి తెలియజేయండి’.. అని అజయ్ కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్ సర్క్యులర్ జారీచేసింది. -
రాస్కెల్.. బఫెలో.. ఇడియట్
♦ ఆఫ్ట్రాల్ డీఎస్ఓ గాడివి.. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ♦ వైఎస్సార్ జిల్లా డీఎస్వోపై లింగారెడ్డి దూషణలు కడప సెవెన్‌రోడ్స్: ‘‘రాస్కెల్.. బఫెలో.. ఇడియట్.. వెళ్లిపోరా ఇక్కడి నుంచి.. సమావేశం గురించి ఎందుకు చెప్పలే దు? నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ఏమనుకుంటున్నావ్.. ఎవరనుకున్నావ్.. ఆఫ్ట్రాల్ డీఎస్ఓ గాడివి’’ అంటూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి వైఎస్సార్ జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్ఓ) జి.వెంకటేశ్వరరావును తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. మనస్తాపానికి గురైన డీఎస్ఓ కంటతడి పెట్టారు. వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్లుగా జరగని ఎఫ్ఏసీ (ఫుడ్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాన్ని ఇన్‌ఛార్జి డీఎస్‌ఓగా జిల్లాకు వచ్చిన వెంకటేశ్వరరావు చొరవ తీసుకుని కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన లింగారెడ్డి ఒక్కసారిగా ఆయనపై ఫైర్ అయ్యారు. ‘‘ఈ రోజు చాలా వివాహాలు ఉన్నాయి. ఒక మాట ఫోన్ చేసి చెప్పి ఉంటే మరోరోజు సమావేశం ఏర్పాటు చేసుకునే వాళ్లం’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల పురాణం అందుకున్నా రు. జీవో నెం.47 మేరకు లింగారెడ్డి ఎఫ్ఏసీలో సభ్యుడు కాకున్నా సమావేశానికి సంబంధిం చిన సమాచారాన్ని తాము ముందే తెలియజేశామని, నోట్ కూడా పంపామని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. తాను చెప్పిన పనులు డీఎస్ఓ చేయకపోవడమే లింగారెడ్డి ఆగ్రహానికి అసలు కారణమని ఉద్యోగులంటున్నారు. రాజుపాలెం, చాపాడు తదితర గ్రామాల్లో రేషన్ దుకాణాల డీలర్లను తొలగించి, తాను సూచించిన వారిని నియమించాలని లింగారెడ్డి డీఎస్ఓపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంటున్నారు. లింగారెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అకారణంగా డీఎస్వోను దూషించిన లింగారెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే సోమవారం నుంచి ఆందోళన చేపడతామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బీఏ వేదనాయకం హెచ్చరించారు. లింగారెడ్డి దిగిరాకుంటే ఉద్యోగుల మంతా సెలవుపై వెళతామన్నారు.