రాస్కెల్.. బఫెలో.. ఇడియట్
♦ ఆఫ్ట్రాల్ డీఎస్‌ఓ గాడివి.. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా?
♦ వైఎస్సార్ జిల్లా డీఎస్‌వోపై లింగారెడ్డి దూషణలు
కడప సెవెన్‌రోడ్స్: ‘‘రాస్కెల్.. బఫెలో.. ఇడియట్.. వెళ్లిపోరా ఇక్కడి నుంచి.. సమావేశం గురించి ఎందుకు చెప్పలే దు? నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ఏమనుకుంటున్నావ్.. ఎవరనుకున్నావ్.. ఆఫ్ట్రాల్ డీఎస్‌ఓ గాడివి’’ అంటూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి వైఎస్సార్ జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌ఓ) జి.వెంకటేశ్వరరావును తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. మనస్తాపానికి గురైన డీఎస్‌ఓ కంటతడి పెట్టారు. వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్లుగా జరగని ఎఫ్‌ఏసీ (ఫుడ్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాన్ని ఇన్‌ఛార్జి డీఎస్‌ఓగా జిల్లాకు వచ్చిన వెంకటేశ్వరరావు చొరవ తీసుకుని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు.
సమావేశానికి హాజరైన లింగారెడ్డి ఒక్కసారిగా ఆయనపై ఫైర్ అయ్యారు. ‘‘ఈ రోజు చాలా వివాహాలు ఉన్నాయి. ఒక మాట ఫోన్ చేసి చెప్పి ఉంటే మరోరోజు సమావేశం ఏర్పాటు చేసుకునే వాళ్లం’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల పురాణం అందుకున్నా రు. జీవో నెం.47 మేరకు లింగారెడ్డి ఎఫ్‌ఏసీలో సభ్యుడు కాకున్నా సమావేశానికి సంబంధిం చిన సమాచారాన్ని తాము ముందే తెలియజేశామని, నోట్ కూడా పంపామని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. తాను చెప్పిన పనులు డీఎస్‌ఓ చేయకపోవడమే లింగారెడ్డి ఆగ్రహానికి అసలు కారణమని ఉద్యోగులంటున్నారు. రాజుపాలెం, చాపాడు తదితర గ్రామాల్లో రేషన్ దుకాణాల డీలర్లను తొలగించి, తాను సూచించిన వారిని నియమించాలని లింగారెడ్డి డీఎస్‌ఓపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంటున్నారు.
లింగారెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే
అకారణంగా డీఎస్‌వోను దూషించిన లింగారెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే సోమవారం నుంచి ఆందోళన చేపడతామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బీఏ వేదనాయకం హెచ్చరించారు. లింగారెడ్డి దిగిరాకుంటే ఉద్యోగుల మంతా సెలవుపై వెళతామన్నారు.