
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మరికొంత సమయం కావాలని ఉభయ రాష్ట్రాలు హైకోర్టును కోరాయి. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించు కోవాలని గతంలో హైకోర్టు ఇరు రాష్ట్రాలకూ సూచించింది. ఈ క్రమంలో ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. తెలంగాణ, ఏపీల అడ్వొకేట్ జనరల్స్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్ సమస్య పరిష్కారానికి మరికొంత సమయం కావాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం గడువు మంజూరు చేస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఏపీ స్థానికత ఆధారంగా 1,242 మంది ఉద్యోగుల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన మార్గదర్శకాలు, తుది జాబితాలను వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.