దోమ, న్యూస్‌లైన్: కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా విద్యుత్ ప్రసారమవడంతో ఓ కూలీ విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే మృత్యువాతపడ్డాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబీకులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండల పరిధిలోని గొడుగోనుపల్లిలో గురువా రం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. పులి చెన్నయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్(22) ఏడాదిగా స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రోజువారి కూలీగా పని చేస్తున్నాడు.
ప్రస్తుతం అతడు బాస్పల్లి, బొంపల్లి గ్రామాల బిల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. వెంకటేష్ తరచు రైతుల అవసరాల మేరకు విద్యుత్ స్తంభాలు ఎక్కుతూ మరమ్మతులు చేస్తుంటాడు. ఈక్రమంలో గురువారం ఉదయం గ్రామానికి చెందిన రైతులు బాబు, అంజిలయ్య అవసరం మేరకు ట్రాన్స్‌ఫార్మర్ నుంచి లాగిన తీగలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు స్తంభం ఎక్కాడు. ఈక్రమంలో విద్యుత్ సరఫరా అవడంతో కరెంట్ షాక్‌కు గురై వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. తీగలకు మృతదేహం అలాగే వేలాడుతూ ఉండిపోయింది. యువకుడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.‘ఆదుకుంటావనుకుం టే సచ్చిపోతివా.. కొడుకా..’ అంటూ యువకుడి తల్లిదండ్రులు రోదించిన తీరు హృదయ విదారకం.
లైన్ క్లియర్ చేసుకున్నాడా..? లేదా..?
వెంకటేష్ మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు స్థానిక లైన్‌మన్‌లు శం కర్, యూసుఫ్‌ల ఆదేశం మేరకే ఎల్‌సీ(లైన్ క్లియర్) తీసుకొని స్తంభం ఎక్కాడని రైతులు చెబుతున్నారు.అనుభవజ్ఞుడైన వెంకటేష్ ఎల్‌సీ తీసుకోకుండా ఎలా స్తంభం ఎక్కుతాడని ప్రశ్నిస్తున్నారు. కాగా వెంకటేష్ తమ నుంచి ఎల్‌సీ తీసుకోలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
గ్రామస్తుల రాస్తారోకో: స్తంభించిన వాహనాలు
వెంకటేష్ మృతితో బాస్పల్లి, గొడుగోనుపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిగి-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి సుమారు 4 గంటల పాటు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా వాహనాలు స్తంభించాయి. ట్రాన్స్‌కో ఏడీ రావాలని పట్టుబట్టారు. పరిగి సీఐ వేణుగోపాల్ రెడ్డి సిబ్బం దితో అక్కడికి చేరుకున్నారు. న్యాయం జరిగే లా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మృతుడి కుటుంబీ కుల ఫిర్యాదు మేరకు విద్యుత్ లైన్‌మన్ శంకర్‌తో పాటు రైతులు బాబు, అంజిలయ్యలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పరిగి ఆస్పత్రికి తరలించారు.
సెల్‌ఫోనే ఆధారం కానుంది..
వెంకటేష్ ఎల్‌సీ తీసుకున్నాడా లేదా అని తెలిసేందుకు అతడి సెల్‌ఫోనే ప్రధాన ఆధారంగా మారనుంది. వెంకటేష్ మృతదేహాన్ని స్తంభం పైనుంచి దించాక అధికారులు అతడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌కాల్ వివరాలను పరిశీలిస్తే అతడు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడాడా..? లేదా అనే విషయం తెలియనుంది. వెంకటేష్ కాల్ లిస్టులో విద్యుత్ సబ్‌స్టేషన్, ఏఈలతో మాట్లాడినట్లు ఉందని పోలీసులు తెలిఆపరు. కాగా అతడు ఏవిషయం మాట్లాడో తెలియ దని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విచారణ జరిపిస్తాం..
విద్యుత్ మరమ్మతులు చేసేటప్పుడు లైన్‌మన్లు తప్పనిసరిగా ఎల్‌సీ తీసుకుంటారు. నాకు తెలియకుండా సిబ్బంది ఎల్‌సీ తీసుకునే వీలు లేదు. గురువారం ఎవరూ ఎల్‌సీ తీసుకోలేదు. కొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే స్తంభాలపై ఎక్కడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెంకటేష్ మృతిపై విచారణ జరిపిస్తాం.
- లక్ష్మీ నాయుడు, ట్రాన్స్‌కో ఏఈ