ఎర్ర యాదయ్య మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
మహేశ్వరం రంగారెడ్డి : పొలంలో నేలపై పరిచిన విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని సుభాన్‌పూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ కొరని సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. సుభాన్‌పూర్ గ్రామానికి చెందిన ఎర్ర యాదయ్య(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన కావలి మణెమ్మ పొలంలో కూలీకి వెళ్లాడు.
పక్క పొలం రైతు కావలి రాఘవేందర్ విద్యుత్ అధికారుల అనుమతి లేకుండా సర్వీస్ వైర్‌ను నేలపై పరిచి విద్యుత్ స్తంభం నుంచి అక్రమంగా కనెక్షన్ పొంది పొలం సాగుచేస్తున్నాడు. కూలి పని ముగించుకున్న ఎర్ర యాదయ్య కావలి రాఘవేందర్ పొలం మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో నేలపై పరిచిన విద్యుత్ వైర్ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గమనించిన స్థానిక రైతులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా యాదయ్య మృతిచెంది కనిపించాడు. ఈ విషయాన్ని స్థానిక రైతులు గ్రామ పెద్దలు, పోలీసులు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం
అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకొని తీగలను నేలపై పరవడంతో యాదయ్య మృతి చెందాడని పోలీసులు తెలిపారు. నేలపై విద్యుత్ తీగలు పరిచి తన భర్తకు చావుకు కారణమైన సదరు రైతు రాఘవేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య బాలమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
యాదయ్య విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల అనుమతి లేకుండా అనాధికారంగా సర్వీస్ వైర్‌ను స్తంభానికి తగిలించడంతో నేలపైన విద్యుత్ వైర్ తేలి ఉండడంతో కాలికి తగిలి యాదయ్య మరణించారని విద్యుత్ ఏఈ గోపయ్య తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తామని ఏఈ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment