విద్యుత్ సంస్థల్లో పది మంది డైరెక్టర్ల చేత రాజీనామా చేయించిన కూటమి
వారి స్థానంలో తమవారిని నియమించుకోవడం కోసం కొత్త నిబంధన
62 ఏళ్ల అర్హత వయసు పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాజు తలచుకుంటే ‘దెబ్బల’కు కొదవా అన్న నానుడికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పదవుల కోసం క్యూ కట్టేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో.. తమకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కించేందుకు.. గతంలో ఉన్న నిబంధనలను సైతం అడ్డగోలుగా మార్చేస్తున్నది. తాజాగా రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి సంబంధించి, ఇన్నాళ్లూ గరిష్ట వయసు పరిమితి 62 ఏళ్లుగా ఉండేది. అయితే ఇకపై 65 ఏళ్ల వయసు వారు కూడా ఆ పదవులకు అర్హులేనంటూ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది.
విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు ఏపీజెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కోలకు కూడా తాజా నిబంధన వర్తిస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైనవారు.. రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెచ్చరించింది. వారి స్థానంలో తమ వారిని, భారీగా ముడుపులు ఇచ్చే వారిని నియమించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో కీలక పోస్టుల్లో ఉన్న కొందరిని బలవంతంగా బయటకు పంపించారు.
వారిలో ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్‌కో ఓఎస్‌డీ ఆంటోనిరాజు ఉన్నారు. వీరి తరువాత పదిమంది డైరెక్టర్ల చేత గత జూలైలో రాజీనామాలు చేయించారు. కూటమి నేతలు ఆ పోస్టులకు ఇప్పటికే రూ.కోట్లలో బేరాలు మొదలు పెట్టారు. అయితే తామనుకున్నది చేసేందుకు, తాము కోరుకున్నవారిని నియమించేందుకు వయసు అడ్డు రావడంతో దానిని సవరించారు.
మూడేళ్లు పెంచేసుకుని, అరవై ఐదేళ్లు ఉన్నవారికీ అవకాశం కల్పించేలా కొత్త జీవో రూపొందించారు. గతంలో విద్యుత్ సంస్థల్లో చీఫ్ జనరల్ మేనేజర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు తాజాగా డైరెక్టర్ల పోస్టులకు పోటీ పడుతున్నారు. ఎలాగైనా కూటమి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి కోసమే కొత్తగా ఈ వయసు పెంపుదల అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment