భారీ ప్రక్షాళన! | Tranfers to 8000 people in Power Companies In The State | Sakshi
Sakshi News home page

భారీ ప్రక్షాళన!

Published Sat, Nov 9 2019 5:12 AM | Last Updated on Sat, Nov 9 2019 5:12 AM

Tranfers to 8000 people in Power Companies In The State - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళన మొదలైంది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ మొదలుకొని, చీఫ్‌ ఇంజనీర్‌ వరకు కొత్త విభాగాలు అప్పగించనున్నారు. రూ. 50 వేల వేతనం దాటిన ప్రతి ఒక్కరికీ స్థాన చలనం ఉంటుంది. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోతో పాటు రెండు డిస్కమ్‌లలోని దాదాపు 8 వేల మందికి శాఖాపరమైన మార్పు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంపై శుక్రవారం అన్ని స్థాయిల ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

ఏ క్షణంలోనైనా ఆదేశాలు...
మార్పులకు సంబంధించిన ఆదేశాలు ఏ క్షణంలోనైనా రావచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎక్కడా కూడా ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధాన కార్యాలయాల (హెడ్‌ క్వార్టర్స్‌)నుంచి బయటకు పంపడం లేదు. సెక్షన్లను మాత్రమే మారుస్తున్నారు. ముఖ్యమైన విభాగంలో కీలక వ్యక్తులకు ప్రస్తుతానికి మినహాయింపు ఉంటుందని ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌ బాబు తెలిపారు. కాలక్రమేణా మార్పులు చేస్తామన్నారు.

ఇవీ కారణాలు...
గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వ అవినీతికి కొమ్ముగాసే వారికే కీలక పోస్టులు దక్కాయి. ఏళ్ల తరబడి అదే విభాగాల్లో తిష్టవేశారు. విద్యుత్‌ కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్లలో కీలకమైన బొగ్గు రవాణా, ఉత్పత్తి రంగంలోని ముఖ్యమైన పోస్టుల్లో కొంతమంది ఉద్యోగులు దాదాపు 15 ఏళ్ల పైబడి ఉన్నారు. నిజాయితీగా పనిచేసే వారిని ప్రాధాన్యత లేని పోస్టులకు పంపారు. అవినీతి నిరోధక శాఖకు అనేక మంది ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చినా విచారణ జరగకుండా అడ్డుకున్నారు. అవినీతి రహిత పాలన దిశగా కొత్త ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో పాత వ్యక్తులు అప్పటి అవినీతి వెలుగులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయి సమాచారం సేకరించిన ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టింది. ఈ నిర్ణయం పట్ల మెజారిటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మార్పు కోసమే: శ్రీకాంత్‌
భారీ ప్రక్షాళన విద్యుత్‌ సంస్థల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతుందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విభాగాల మార్పువల్ల ఉద్యోగుల్లో నూతనోత్సాహం వస్తుందని, కొత్త ఆలోచనలతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్పు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామని, ఇది విద్యుత్‌ సంస్థల చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement