state electricity companies
-
భారీ ప్రక్షాళన!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళన మొదలైంది. అసిస్టెంట్ ఇంజనీర్ మొదలుకొని, చీఫ్ ఇంజనీర్ వరకు కొత్త విభాగాలు అప్పగించనున్నారు. రూ. 50 వేల వేతనం దాటిన ప్రతి ఒక్కరికీ స్థాన చలనం ఉంటుంది. ఏపీ ట్రాన్స్‌కో, జెన్కోతో పాటు రెండు డిస్కమ్‌లలోని దాదాపు 8 వేల మందికి శాఖాపరమైన మార్పు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంపై శుక్రవారం అన్ని స్థాయిల ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఏ క్షణంలోనైనా ఆదేశాలు... మార్పులకు సంబంధించిన ఆదేశాలు ఏ క్షణంలోనైనా రావచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎక్కడా కూడా ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధాన కార్యాలయాల (హెడ్ క్వార్టర్స్)నుంచి బయటకు పంపడం లేదు. సెక్షన్లను మాత్రమే మారుస్తున్నారు. ముఖ్యమైన విభాగంలో కీలక వ్యక్తులకు ప్రస్తుతానికి మినహాయింపు ఉంటుందని ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు తెలిపారు. కాలక్రమేణా మార్పులు చేస్తామన్నారు. ఇవీ కారణాలు... గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వ అవినీతికి కొమ్ముగాసే వారికే కీలక పోస్టులు దక్కాయి. ఏళ్ల తరబడి అదే విభాగాల్లో తిష్టవేశారు. విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్లలో కీలకమైన బొగ్గు రవాణా, ఉత్పత్తి రంగంలోని ముఖ్యమైన పోస్టుల్లో కొంతమంది ఉద్యోగులు దాదాపు 15 ఏళ్ల పైబడి ఉన్నారు. నిజాయితీగా పనిచేసే వారిని ప్రాధాన్యత లేని పోస్టులకు పంపారు. అవినీతి నిరోధక శాఖకు అనేక మంది ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చినా విచారణ జరగకుండా అడ్డుకున్నారు. అవినీతి రహిత పాలన దిశగా కొత్త ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో పాత వ్యక్తులు అప్పటి అవినీతి వెలుగులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయి సమాచారం సేకరించిన ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టింది. ఈ నిర్ణయం పట్ల మెజారిటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్పు కోసమే: శ్రీకాంత్ భారీ ప్రక్షాళన విద్యుత్ సంస్థల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతుందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విభాగాల మార్పువల్ల ఉద్యోగుల్లో నూతనోత్సాహం వస్తుందని, కొత్త ఆలోచనలతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్పు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామని, ఇది విద్యుత్ సంస్థల చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. -
విద్యుత్ సంస్థలకు కొత్త డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల పాలక మండలిలకు ప్రభుత్వం కొత్త డైరెక్టర్లను నియమించింది. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పదవీ కాలాన్ని 2019 మార్చి 31 వరకు పొడిగించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో) వైస్ చైర్మన్, ఎండీగా జానయ్యను నియమించింది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 12 కొత్త డైరెక్టర్ల నియామకంతోపాటు ఇప్పటికే పనిచేస్తున్న 9 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించింది. కొత్తగా నియమితులైన 12 మంది డైరెక్టర్లు 2019 మే 31 వరకు పదవుల్లో కొనసాగుతారని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన డైరెక్టర్లు.. టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లుగా రాములు (కమర్షియల్, డీపీఈ, అసెస్మెంట్, ఎనర్జీ ఆడిట్), పర్వతం(హెచ్ఆర్ అండ్ ఐఆర్), మదన్ మోహన్(పీఅండ్ఎంఎం),స్వామిరెడ్డి (ప్రాజెక్ట్స్) నియమితులయ్యారు. టీఎస్ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లుగా మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), సంధ్యారాణి(కమర్షియల్), గణపతి (ఐపీసీ అండ్ ఆర్ఏసీ), నర్సింగ్‌రావు (ఆపరేషన్స్), మహమ్మద్ యూనస్ (పీ అండ్ ఎంఎం)లను నియమించారు. ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్(ఆపరేషన్స్)గా పనిచేస్తున్న బి.నర్సింగ్రావును ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్ ఆపరేషన్స్)గా నియమించారు. జెన్కో డైరెక్టర్లుగా లక్ష్మయ్య(థర్మల్), అజయ్ (సివిల్) నియమితులయ్యారు. ఎన్ఎండీసీలో డైరెక్టర్ (కమర్షియల్)గా పనిచేస్తున్న టీఆర్కే రావు ను జెన్కోలో డైరెక్టర్ (ఇంధన నిర్వహణ)గా రెండేళ్ల పదవీ కాలంతో నియమించారు. పదవీ కాలం పొడిగింపు.. టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు జె.శ్రీనివాస్, టి.శ్రీనివాస్ (ఐపీసీ, ఆర్ఏసీ), టీఎస్ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు బి.వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు జి.నర్సింగ్‌రావు (ప్రాజెక్టులు), టి.జగత్‌రెడ్డి (ట్రాన్స్మిషన్), జె.సూర్యప్రకాశ్ (ఎత్తిపోతల), జెన్కో డైరెక్టర్లు సీహెచ్.వెంకటరాజం (హైడల్), ఎస్.అశోక్‌కుమార్ (హెచ్ఆర్), ఎస్.సచ్చిదానందం (ప్రాజెక్ట్స్)ల పదవీ కాలాన్ని 2019 మార్చి 31 వరకు పొడిగించింది. -
డిస్కంలు దివాళా!
కొంప ముంచిన ప్రైవేటు కొనుగోళ్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు దివాళా 0బాట పట్టాయి. విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయింది. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి డిస్కంలు ఏడాది కాలంగా అధిక ధరలు చెల్లించి ప్రైవేటు కంపెనీల నుంచి భారీ మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. యూనిట్‌కు సగటున రూ.5.60 వరకు చెల్లిస్తూ అవసరాన్ని బట్టి ప్రతి రోజూ 40-60 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. నిరంతర సరఫరా కోసం ఎంత ధరకైనా సరే విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించడంతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. బహిరంగ మార్కెట్లో విద్యుత్‌కు తీవ్ర డిమాండ్ నెలకొన్న సందర్భాల్లో యూనిట్‌కు రూ.5.90-రూ.6 మధ్యలో చెల్లించి కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఈ ‘భారీ’ కొనుగోళ్లే డిస్కంలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వ శాఖల బకాయిలే రూ.2 వేల కోట్లు తెలంగాణ, ఏపీ జెన్కోలతో పాటు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలకు సైతం వేల కోట్ల రూపాయిల విద్యుత్ బిల్లులు బకాయి పడ్డాయి. ఈ బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ విక్రయాలను నిలిపివేస్తామని పలు కంపెనీలు ఒత్తిడి పెంచాయి. డిస్కంలు, జెన్కోలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తక్షణమే రూ.5 వేల కోట్ల గ్రాంట్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. డిస్కంలకు ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన విద్యుత్ చార్జీల బకాయిల కింద రూ.2 వేల కోట్లు, జల విద్యుదుత్పత్తి అందుబాటులో లేని సమయంలో జరిపిన అదనపు విద్యుత్ కొనుగోళ్లకు రూ.1,172 కోట్లు, అదనపు టారీఫ్ సబ్సిడీ కింద రూ.500 కోట్లు, గతేడాది రాయితీల కింద రూ.600 కోట్లు, గత అక్టోబర్, నవంబర్ టారీఫ్ రాయితీల కింద రూ.709 కోట్లు, బాండ్లపై వడ్డీల కింద రూ.98 కోట్లు కలిపి మొత్తం రూ.5,100 కోట్లు విడుదల చేయాలని లేఖలో అభ్యర్థించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్, నవంబర్ నెలల టారీఫ్ సబ్సిడీల కింద రూ.709 కోట్లను విడుదల చేయగా.. మిగిలిన రూ.4,300 కోట్ల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గృహ వినియోగదారులకు తక్కువ చార్జీలతో, సాగుకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుండగా.. దీనికి సంబంధించిన భారాన్ని ప్రభుత్వం సబ్సిడీల రూపంలో డిస్కంలకు చెల్లిస్తోంది. టారీఫ్ రాయితీలు, ప్రాజెక్టులపై పెట్టుబడి వాటా మినహా రాష్ట్ర బడ్జెట్లో విద్యుత్‌కు సంబంధించి ఇతర గ్రాంట్లు లేకపోవడంతో విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహాయం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జెన్కోను కాదని ప్రైవేటు విద్యుత్ వర్షాభావంతో ఏడాది కాలంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైంది. వ్యవసాయ విద్యుత్ వినియోగం పడిపోయింది. దీంతో 2014తో పోల్చితే 2015లో విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. కానీ డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేసిన తెలంగాణ విద్యుత్ సంస్థలు భారీ మొత్తంలో విద్యుత్ కొనుగోళ్ల కోసం ముందే తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాస్తవానికి డిమాండ్ తగ్గడంతో బ్యాంకింగ్ డౌన్ పేరుతో తెలంగాణ జెన్కో ప్లాంట్లను తరచుగా మూసేసి .. ప్రైవేటు నుంచి వందల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. ప్రైవేటు కొనుగోళ్ల కోసం గత ఆరు నెలల్లోనే జెన్కో 1,100 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని నిలిపేసింది. దీంతో జెన్కో పీఎల్ఎఫ్ సైతం పడిపోయింది. రాష్ట్రంలో సగటున రోజుకు 120-160 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. అందులో 60 మిలియన్ యూనిట్లను ప్రైవేటు నుంచి కొంటున్నారు. యూనిట్‌కు రూ.3-3.5 ధరకే లభించే జెన్కో విద్యుత్‌ను కాదని ప్రైవేటు విద్యుత్‌ను యూనిట్‌కు సగటున రూ.5.60 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరలే డిస్కంల కొంప ముంచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.