డిస్కంలు దివాళా! | DISCOMs bankruptcy | Sakshi
Sakshi News home page

డిస్కంలు దివాళా!

Published Thu, Dec 3 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

డిస్కంలు దివాళా!

డిస్కంలు దివాళా!

కొంప ముంచిన ప్రైవేటు కొనుగోళ్లు
 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు దివాళా 0బాట పట్టాయి. విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయింది. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి డిస్కంలు ఏడాది కాలంగా అధిక ధరలు చెల్లించి ప్రైవేటు కంపెనీల నుంచి భారీ మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. యూనిట్‌కు సగటున రూ.5.60 వరకు చెల్లిస్తూ అవసరాన్ని బట్టి ప్రతి రోజూ 40-60 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. నిరంతర సరఫరా కోసం ఎంత ధరకైనా సరే విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించడంతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. బహిరంగ మార్కెట్లో విద్యుత్‌కు తీవ్ర డిమాండ్ నెలకొన్న సందర్భాల్లో యూనిట్‌కు రూ.5.90-రూ.6 మధ్యలో చెల్లించి కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఈ ‘భారీ’ కొనుగోళ్లే డిస్కంలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 ప్రభుత్వ శాఖల బకాయిలే  రూ.2 వేల కోట్లు
 తెలంగాణ, ఏపీ జెన్‌కోలతో పాటు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలకు సైతం వేల కోట్ల రూపాయిల విద్యుత్ బిల్లులు బకాయి పడ్డాయి. ఈ బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ విక్రయాలను నిలిపివేస్తామని పలు కంపెనీలు ఒత్తిడి పెంచాయి. డిస్కంలు, జెన్‌కోలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తక్షణమే రూ.5 వేల కోట్ల గ్రాంట్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. డిస్కంలకు ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన విద్యుత్ చార్జీల బకాయిల కింద రూ.2 వేల కోట్లు, జల విద్యుదుత్పత్తి అందుబాటులో లేని సమయంలో జరిపిన అదనపు విద్యుత్ కొనుగోళ్లకు రూ.1,172 కోట్లు, అదనపు టారీఫ్ సబ్సిడీ కింద రూ.500 కోట్లు, గతేడాది రాయితీల కింద రూ.600 కోట్లు, గత అక్టోబర్, నవంబర్ టారీఫ్ రాయితీల కింద రూ.709 కోట్లు, బాండ్‌లపై వడ్డీల కింద రూ.98 కోట్లు కలిపి మొత్తం రూ.5,100 కోట్లు విడుదల చేయాలని లేఖలో అభ్యర్థించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్, నవంబర్ నెలల టారీఫ్ సబ్సిడీల కింద రూ.709 కోట్లను విడుదల చేయగా.. మిగిలిన రూ.4,300 కోట్ల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

గృహ వినియోగదారులకు తక్కువ చార్జీలతో, సాగుకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుండగా.. దీనికి సంబంధించిన భారాన్ని ప్రభుత్వం సబ్సిడీల రూపంలో డిస్కంలకు చెల్లిస్తోంది. టారీఫ్ రాయితీలు, ప్రాజెక్టులపై పెట్టుబడి వాటా మినహా రాష్ట్ర బడ్జెట్‌లో విద్యుత్‌కు సంబంధించి ఇతర గ్రాంట్లు లేకపోవడంతో విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహాయం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

 జెన్‌కోను కాదని ప్రైవేటు విద్యుత్
 వర్షాభావంతో ఏడాది కాలంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైంది. వ్యవసాయ విద్యుత్ వినియోగం పడిపోయింది. దీంతో 2014తో పోల్చితే 2015లో విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. కానీ డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేసిన తెలంగాణ విద్యుత్ సంస్థలు భారీ మొత్తంలో విద్యుత్ కొనుగోళ్ల కోసం ముందే తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాస్తవానికి డిమాండ్ తగ్గడంతో బ్యాంకింగ్ డౌన్ పేరుతో తెలంగాణ జెన్‌కో ప్లాంట్లను తరచుగా మూసేసి .. ప్రైవేటు నుంచి వందల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. ప్రైవేటు కొనుగోళ్ల కోసం గత ఆరు నెలల్లోనే జెన్‌కో 1,100 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని నిలిపేసింది. దీంతో జెన్‌కో పీఎల్‌ఎఫ్ సైతం పడిపోయింది. రాష్ట్రంలో సగటున రోజుకు 120-160 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. అందులో 60 మిలియన్ యూనిట్లను ప్రైవేటు నుంచి కొంటున్నారు. యూనిట్‌కు రూ.3-3.5 ధరకే లభించే జెన్‌కో విద్యుత్‌ను కాదని ప్రైవేటు విద్యుత్‌ను యూనిట్‌కు సగటున రూ.5.60 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరలే డిస్కంల కొంప ముంచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement