
సాక్షి, అమరావతి: ప్రభుత్వ హామీ మేరకు రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఎక్కడా విద్యుత్ కోతలు విధించడంలేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ నెల 24న 206.62 మిలియన్ యూనిట్లు, 25న 197.19 మిలియన్ యూనిట్లు, 26న 201.97 మిలియన్ యూనిట్లు చొప్పున ఎలాంటి విద్యుత్ లోటు, లోడ్ రిలీఫ్‌లు లేకుండా అందించాయని తెలిపింది.
ఈ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్‌కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సగటున రోజుకు 80 మిలియన్ యూనిట్లు అందించాయని వెల్లడించింది. 27వ తేదీ వరకు సగటు విద్యుత్ ఎగుమతి (అమ్మకాలు) రోజుకు 1.36 మిలియన్ యూనిట్లు మాత్రమేనని పేర్కొంది.
అందువల్ల సరఫరా – డిమాండ్ గ్యాప్ కారణంగా లోడ్ రిలీఫ్‌లు లేవని, గ్రిడ్ డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను డిస్కంలు సమకూర్చుకుంటున్నాయని తెలిపింది. విద్యుత్ కొరత తీర్చడానికి ఎప్పటికప్పుడు బహిరంగ మార్కెట్ (ఎనర్జీ ఎక్సే్చజీలు) నుంచి కొని, రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయని వివరించింది.