గాలి వీచిందా..? అయితే కరెంట్ గోవిందా.?
వర్షం పడుతోందా..? టార్చ్‌లైట్స్, చార్జింగ్ లైట్స్ వెతుక్కోవాల్సిందే. ఇంకేముంది.. గంటల తరబడి కరెంట్ రాదు.
ఏంటో ఈ పవర్ సప్లై ..రోజులో గంటల తరబడి కరెంట్ ఉండటం లేదు.
ఇదీ ఒకప్పుడు వినియోగదారుల నుంచి తరచూ వినిపించిన మాట..
కాలం మారింది.. కరెంట్ సరఫరాలోనూ మార్పులు వచ్చాయి. సరఫరా అంతరాయమూ మారింది. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విశాఖ సర్కిల్ నిరంతరం శ్రమిస్తోంది. అందుకే సగటున పవర్ కట్‌ను రోజులో కేవలం 4 నిమిషాలకు మాత్రమే తగ్గించుకుంటూ ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్కిళ్లలో నంబర్ వన్‌లో కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా విషయంలో విశాఖ దూకుడుగా వ్యవహరిస్తోందని సైదీ సైఫీ సూచీలే స్పష్టం చేస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 5 సర్కిల్స్ ఉన్నాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, ఏలూరు, విజయనగరం సర్కిల్స్ పరిధిలో నిరంతరం విద్యుత్ సరఫరాలో ఉన్న లోపాలు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలే సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైదీ), సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్ (సైఫీ). రోజూ ఆయా సర్కిల్స్ పరిధిలో ఎంత సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.? ఎంత సమయానికి పున రుద్ధరించారు.? ఇలాంటి వివరాలను ఎప్పటికప్పు డు గణిస్తూ సరాసరిని చూపిస్తుంటుంది. ఈ విషయంలో విశాఖ సర్కిల్ నంబర్‌వన్‌లో నిలిచింది. ఈ సర్కిల్ పరిధిలో 17,57,727 మంది వినియోగదారులున్నారు. ఇందులో 15,02,204 డొమెస్టిక్ కనెక్షన్లుండగా, 1,70,580 కమర్షియల్, 49,037 అగ్రికల్చర్, 30,632 ఇన్‌స్టిట్యూషనల్, 5,274 ఇండస్ట్రీస్ కనెక్షన్లున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సైదీ సైఫీ ర్యాంకింగ్‌ను ప్రకటిస్తుంది.
నాలుగు నిమిషాలు మాత్రమే..
2014–19 మధ్య కాలంతో పోల్చితే సర్కిల్ పరిధిలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాలంలో రోజుకు సగటున 60 నుంచి 85 నిమిషాల వరకూ విద్యుత్ అంతరాయం ఉండేది. అంటే 24 గంటల్లో కనీసం గంటకు పైగా కరెంట్ కోతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవి. పంపిణీ విషయంలో పక్కాగా వ్యవహరిస్తూ ఆధునిక సాంకేతికతను సిబ్బంది అందిపుచ్చుకుంటూ సరఫరా అంతరాయాన్ని తగ్గించారు. గంట ఉండే అంతరాయం క్రమంగా నిమిషాలకు చేరుకుంది. ఇప్పుడు కేవలం 4 నుంచి 10 నిమిషాలు మాత్రమే రోజులో విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగటున రోజుకు 9 నిమిషాలు మాత్రమే సరఫరాకు అంతరాయం ఉండగా.. ఈ నెలలో కేవలం 4 నిమిషాలు మాత్రమే సగటు ఇంట్రప్షన్ ఉన్నట్లు సైదీ సైఫీ నివేదికలో స్పష్టమైంది.
నంబర్ వన్ ర్యాంకులో... విశాఖ సర్కిల్
గత కొద్ది నెలలుగా విశాఖ సర్కిల్ సైదీ సైఫీ ర్యాంకింగ్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయాలు లేకుండా అందించడంలో సర్కిల్ అధికారులు, సిబ్బంది సఫలీకృతమవుతున్నారు. తర్వాత ర్యాంకింగ్స్‌లో రాజమండ్రి, శ్రీకాకుళం, ఏలూరు, విజయనగరం ఉన్నాయి. కేవలం సర్కిల్ మాత్రమే కాకుండా.. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు ఇంట్రప్షన్ తగ్గిస్తూ సరఫరా అందిస్తున్నారు. విశాఖ సర్కిల్‌లో 4 నిమిషాలు మాత్రమే ఉండగా రాజమహేంద్రవరంలో 8 నిమిషాలు, శ్రీకాకుళం పరిధిలో 10, విజయనగరంలో 13, ఏలూరులో 16 నిమిషాలు మాత్రమే రోజుకు సగటున విద్యుత్ కోతలు జరుగుతున్నట్లు సైదీ సైఫీ ర్యాంకింగ్స్‌లో స్పష్టమైంది.
మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నాం
ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాం. వినియోగదారులకు ఇచ్చే విద్యుత్‌ను నాణ్యంగా ఎలా అందించాలనే అంశంపై సీఎండీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. దానికనుగుణంగా మార్పులు చేస్తూ అంతరాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సగటున 4 నిమిషాలున్న ఇంట్రప్షన్‌ను క్రమంగా తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విపత్తుల కారణంగా ఏదైనా అవాంతరాలు ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇటీవలే ఆటోమేటెడ్ సబ్‌స్టేషన్‌ను రూపొందించాం. మిగిలిన చోట్లా అదే తరహా టెక్నాలజీ వస్తే ఈ అంతరాయం మరింత తగ్గించగలం.
– ఎల్ మహేంద్రనాథ్, ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment