మళ్లీ కట్‌కట
కరెంటు కోతలు మళ్లీ మొదలయ్యాయి. రెండు నెలలుగా గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయానికి తగినంత విద్యుత్ అందుబాటులో ఉండటంతో ఇక కష్టాలు తొలిగినట్లేని భావిస్తుండగా విద్యుత్ శాఖ అకస్మాత్తుగా కోతలకు శ్రీకారం చుట్టింది.
హుస్నాబాద్/మంథని : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, విద్యుత్ వినియోగం పెరగడంతో గురువారం నుంచి కొత్త షెడ్యూల్‌ను అమల్లోకి తెచ్చింది. వ్యవసాయానికి ఆరు గంటలే విద్యుత్ సరఫరా చేయాలని, గ్రామాల్లో ఆరు గంటలు కోత విధించాలని ఎస్‌ఈ నుంచి ఏఈలకు ఆదేశాలు అందాయి. మున్సిపల్ టౌన్స్, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు కోత ఉంటుంది.
గ్రామాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.
వ్యవసాయ పంపుసెట్లకు మూడు కేటగిరీల్లో విద్యుత్ సరఫరా చేసేలా షెడ్యూల్ విడుదల చేశారు.
ఏ గ్రూపులో మూడు నుంచి తొమ్మిది గంటల వరకు, బీ గ్రూపులో తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు, సీ గ్రూపులో ఐదు నుంచి ఎనిమిది, పది నుంచి ఒంటి గంట వరకు సరఫరా ఉంటుంది.
ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో విద్యుత్ కోతలు వినియోగదారులను ఇబ్బంది పెట్టించనున్నాయి. గ్రామాల్లో ఆరు గంటల కోత తీవ్ర అసౌకర్యానికి గురిచేసే అవకాశం ఉంది.
రాత్రి వేళ విద్యుత్ షెడ్యూల్ ఖరారు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పగటిపూటే ఇవ్వాలని కోరుతున్నారు.