సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఏపీ విద్యుత్ సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)తో విద్యుత్ శాఖ సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా దక్షిణాది పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేసే దిశగా అడుగులు పడతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర పవర్ గ్రిడ్ పర్యవేక్షిస్తోంది. దీనిపై ఇటీవల కేంద్రంతో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లితో కలిసి రాష్ట్ర అధికారులు చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు.
రియల్ టైమ్ పద్ధతిలో పర్యవేక్షించేలా..
రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు విస్తరించి ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా సబ్ స్టేషన్లతో విద్యుత్ నెట్‌వర్క్ ఉంది. ఇది ఇతర రాష్ట్రాలకు అనుసంధానమై ఉంటుంది. అవసరమైనప్పుడు మనం విద్యుత్ ఇవ్వడం, తీసుకోవడానికి ఈ లైన్లు ఉపయోగపడతాయి. అయితే, అటవీ ప్రాంతాలు, జలాశయాలు, కొండల్లో విద్యుత్ నెట్‌వర్క్ విస్తరించి ఉంది. ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కడ ఏ లైన్‌కు ఇబ్బంది ఉంది? ఆ ప్రాంతంలో ఎన్ని సర్వీసులకు సమస్య రావచ్చు? ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ అందించడం ఎలా? వరదలొస్తే ఏ సబ్ స్టేషన్లకు ముప్పు ఉంటుంది? ఇలా అనేక రకాల సమాచారాన్ని భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా అందిస్తారు. అవసరమైనప్పుడు కేవలం మౌస్ క్లిక్ ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తేలికగా తెలుసుకునే వీలుంది. ఓవర్ లోడింగ్ సహా అన్ని అంశాలను రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించేందుకు పవర్ గ్రిడ్లకు ఇది తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ నెట్‌వర్క్‌ను మ్యాపింగ్ చేసే కార్యక్రమానికి ట్రాన్స్‌కో శ్రీకారం చుట్టింది.
సదరన్ గ్రిడ్‌లో అమలు చేసేలా..
ఈ విధానానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని బెంగళూరులోని సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ), కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టం ఆపరేషన్స్ కార్పొరేషన్ (పీవోఎస్‌వోసీవో)లు ఏపీ ట్రాన్స్‌కోను కోరాయి. దీన్ని మరో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపే సదరన్ గ్రిడ్‌లో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీ ట్రాన్స్‌కో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సబ్ స్టేషన్ల జియో ట్యాగింగ్, సరఫరా లైన్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్ల భౌతిక పరిస్థితి, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలకు సంబంధించిన సరఫరా, పంపిణీ నెట్‌వర్క్ వెరసి ఏపీ గ్రిడ్ మొత్తాన్ని రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించవచ్చు. ఏపీ నెట్‌వర్క్ మొత్తాన్ని సదరన్ గ్రిడ్ మ్యాపింగ్ చేస్తుంది. దీనివల్ల రియల్ టైం పద్ధతిలో లైన్ల ఓవర్ లోడింగ్, అండర్ లోడింగ్‌తో పాటు వాతావరణం, లోడ్ షెడ్యూలింగ్‌ను ముందుగానే అంచనా వేయడం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత ప్రాంతాలను పరిశీలించడం, రియల్ టైం పద్ధతిలో లైన్లను తనిఖీ చేయడం వంటి అనేక ఉపయోగాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment