సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరు శాతం ఫీడర్ల పరిధిలో ఈ ఖరీఫ్ నుంచి వ్యవసాయ అవసరాలకు పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీజన్ ప్రారంభం కాకముందే విద్యుత్ శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. నమ్మకమైన, నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం పక్కా ప్రణాళిక రూపొందించినట్లు ఇంధనశాఖ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం 2021–22లో 12,232 మిలియన్ యూనిట్ల మేర వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉండవచ్చని అంచనా వేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా సరఫరాకు ఆటంకం కలగకుండా మిగులు విద్యుత్‌నూ సిద్ధం చేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్‌లో కొనుగోలు చేసి రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం కరెంట్ ఇవ్వాలని నిర్ణయించారు.
వంద శాతం ఫీడర్లు రెడీ
రాష్ట్రంలో 6,616 వ్యవసాయ ఫీడర్లు ఉండగా పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని 2019లో భావించినప్పుడు 58 శాతం ఫీడర్లకు అందుకు తగ్గ సామర్థ్యం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు రూ.1,700 కోట్లు మంజూరు చేయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. లైన్లు, సబ్ స్టేషన్ల శక్తి పెంచారు. 515 ఫీడర్ల స్థాయిని సమూలంగా మార్చారు. ఫలితంగా వంద శాతం ఫీడర్ల పరిధిలో రైతులు వినియోగించే ఉచిత విద్యుత్ సామర్థ్యాన్ని తట్టుకునే వ్యవస్థ అందుబాటులోకొచ్చింది.
ప్రతి రైతుకు రూ.35 వేలపైనే ఉచితం
కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కృత్రిమ మేధోశక్తి (ఏఐ) ద్వారా 2021–22లో వ్యవసాయ విద్యుత్ వాడకం ఏ సీజన్‌లో ఎంత ఉంటుందనేది శాస్త్రీయంగా అంచనా వేశారు. ప్రతి హెచ్‌పీకి వార్షిక విద్యుత్ వినియోగం 1,059 యూనిట్లు ఉంటుందని అంచనా. అంటే ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో 5 హెచ్‌పీ మోటార్ అమర్చుకుంటే ఏడాదికి 5,295 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. యూనిట్ ధర రూ.6.65 చొప్పున ఐదు హెచ్‌పీ మోటార్ ఉన్న ప్రతీ రైతు కోసం ఉచిత విద్యుత్ కింద ప్రభుత్వం కనిష్టంగా రూ. 35,212 దాకా చెల్లిస్తోంది. కొంతమంది రైతులు గరిష్టంగా 10 హెచ్‌పీపైనే వాడుతున్నారు. వారికి రెట్టింపు మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది.
ఏటా రూ.8 వేల కోట్లకుపైనే సబ్సిడీ..
రాష్ట్రంలో ప్రస్తుతం 17.55 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా వీటి మొత్తం సామర్థ్యం 116 లక్షల హెచ్‌పీ ఉంటుంది. ఇవి ఏటా దాదాపు 12,232 మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.8 వేల కోట్లకు పైగా సబ్సిడీగా రైతుల ఉచిత విద్యుత్ కోసం వెచ్చిస్తోంది.
సీజన్ల వారీగా విద్యుత్ వాడకం ఇలా
ఖరీఫ్ (జూన్ నుంచి అక్టోబర్)..
4,744.44 మిలియన్ యూనిట్ల (39 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈ సీజన్‌లో రైతులు సగటున 2.20 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు.
రబీ (నవంబర్ నుంచి మార్చి)..
6,192 మిలియన్ యూనిట్ల (51 శాతం) విద్యుత్ వినియోగం ఉంటోంది. రైతులు సగటున రోజుకు 4.30 గంటల పాటు పంపుసెట్ వినియోగిస్తున్నారు.
అన్ సీజన్ (ఏప్రిల్ నుంచి మే)..
1,296 మిలియన్ యూనిట్ల (11 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉన్నట్టు లెక్క తేలింది. ఈ సీజన్‌లో రైతులు సగటున 1.80 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం విద్యుత్ లభ్యతపై అధికారులు దృష్టి పెట్టారు.
ఒక్క పంప్‌సెట్‌కూ ఇబ్బంది లేకుండా...
ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. నాణ్యమైన సరఫరా కోసం పంపిణీ సంస్థలను నిలదీసే అధికారం కల్పించేలా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని రైతుల ఖాతాల్లోనే వేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాది పొడవునా ఏ ఒక్క రోజూ ఏ ఒక్క పంపుసెట్‌కూ విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాం. అన్ని స్థాయిల్లో విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఈ ఏడాది మరింత మెరుగ్గా రైతులకు ఉచిత విద్యుత్ అందబోతోంది.
– శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment