కృష్ణా జిల్లా వల్లూరుపాలెంలోని సబ్‌స్టేషన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్ సరఫరాలో వినూత్న విప్లవం రాబోతోంది. పూర్తి సాంకేతికతతో వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు పనిచేయబోతున్నాయి. విద్యుత్ సబ్‌స్టేషన్లన్నింటినీ ‘ఆటోమేషన్’ చేసేందుకు ప్రభుత్వ సహకారంతో ప్రపంచ బ్యాంకు అవసరమైన నిధులు సమకూర్చనుంది. ఆటోమేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. కృష్ణా జిల్లా వల్లూరుపాలెంలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. రైతన్నకు ఇది చేయబోయే మేలుపై సమగ్ర సమాచారం సేకరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,616 విద్యుత్ ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏటా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. గతంలో అర్ధరాత్రి అపరాత్రి అతి కష్టం మీద ఏడు గంటల విద్యుత్ ఇవ్వగా నవరత్నాల్లో భాగంగా పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఫీడర్ల బలోపేతానికి రూ.1,700 కోట్లు వెచ్చిస్తోంది.
ఇప్పుడేం చేయబోతున్నారంటే..
గతంలో వ్యవసాయ క్షేత్రానికి మూడు వైర్లు (త్రీ ఫేజ్) ద్వారా విద్యుత్ అందించాల్సి ఉండేది. అంటే.. 9 గంటల పాటు త్రీఫేజ్ ఆన్ చేయాలి. ఏబీ స్విచ్‌లు, ఫీడర్ బ్రేకర్లను అక్కడ ఉండే షిప్ట్ ఆపరేటర్ పనిచేయించాల్సి ఉంటుంది. అతడు ఏమాత్రం అశ్రద్ధ చేసినా.. ఆ సమయంలో సబ్‌స్టేషన్‌కు వెళ్లలేకపోయినా రైతులకు త్రీఫేజ్ విద్యుత్ అందదు. ఈ ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3 వేలకు పైగా ఉన్న సబ్‌స్టేషన్లలో మొదటి దశలో 1,068 స్టేషన్లను రూ.900 కోట్లతో ఆటోమేషన్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేసింది. ఆటోమేషన్ స్టేషన్లు పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. విద్యుత్‌ను ఎంతసేపు ఇవ్వాలో ప్రోగ్రామింగ్ ద్వారా నిర్ణయిస్తే చాలు. క్షణం ఆలస్యం కాకుండా నిర్దేశిత సమయానికి త్రీ ఫేజ్ ఆన్ అవుతుంది.
9 గంటల తర్వాత ఆగిపోతుంది. మానవరహితంగా పనిచేసే ఈ టెక్నాలజీ దేశంలోనే తొలిసారి. సబ్ స్టేషన్‌లో నాలుగు ఫీడర్లుంటాయి. ఒక్కో ఫీడర్ పరిధిలో 300 వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుంటాయి. త్రీఫేజ్ విద్యుత్ వైర్లను, స్విచ్ బ్రేకర్స్‌ను తిప్పడం ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ ప్రక్రియను ఇంటలెక్చువల్ ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా సబ్‌స్టేషన్ పరిధిలోనే రిలే కంట్రోల్ ప్యానల్‌కు కనెక్ట్ చేస్తారు. ఇందులోనే ఎలక్ట్రానిక్ పరికరం ఉంటుంది. దీనిద్వారా ఏ సమయంలో విద్యుత్ సరఫరా జరగాలి? ఎప్పుడు ఆగిపోవాలనే సమయాన్ని కమాండ్‌గా ఇస్తారు. ఆ సమయానికి సిగ్నల్ వెళ్లి ఆయస్కాంతీకరణ ద్వారా స్విచ్ బ్రేకర్స్‌ను తిప్పుతాయి. దీంతో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతుంది. సబ్ స్టేషన్‌లో ఉండే “మోడెమ్’ ద్వారా వల్లూరుపాలెం సబ్‌స్టేషన్‌లోని ఫీడర్లను విజయవాడ విద్యుత్ సౌధ నుంచి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఇందుకు సంబంధించిన పాస్‌వర్డ్‌లన్నీ పూర్తి భద్రంగా ఉంచుతారు.
జవాబుదారీతనం పెరుగుతుంది
ఆటోమేషన్ వల్ల అంతరాయం లేకుండా పగటిపూట 9 గంటల విద్యుత్ రైతులకు అందించవచ్చు. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్రంలో రెండు కంపెనీలు పైలెట్ ప్రాజెక్టులు పూర్తి చేశాయి. మంచి ఫలితాలు వచ్చాయి.
– పద్మా జనార్దన్ రెడ్డి, సీఎండీ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ
రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే లక్ష్యం
రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఆటోమేషన్ చేపట్టాం. పైలెట్ ప్రాజెక్టు ఫలితాలు, ప్రాజెక్టు సమగ్ర నివేదికను ప్రపంచబ్యాంకుకు పంపించాం. ఒక్కో సబ్ స్టేషన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు వరకు ఖర్చు కావచ్చు. బహిరంగ టెండర్లు పిలిచి పోటీ ద్వారా ధర తగ్గించేలా కృషి చేస్తున్నాం.
– శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి
వ్యవసాయ విద్యుత్ ఇలా..
రాష్ట్రంలో పంపుసెట్లు: 17,54,906
ఫీడర్లు: 6,616
లోడ్ (మెగావాట్లు): 1,15,55,552
సాగుకు విద్యుత్ సరఫరా సీజన్ వారీగా మిలియన్ యూనిట్లలో..
ఖరీఫ్ (జూన్–సెప్టెంబర్) 4,744.44 (39 శాతం)
రబీ (సెప్టెంబర్–మార్చి) 6,192 (51 శాతం)
అన్ సీజన్ (ఏప్రిల్–మే) 1,296 (11 శాతం)
మొత్తం (ఏప్రిల్–మార్చి) 12,232.44 (100 శాతం)
– నోట్: ప్రతి హెచ్‌పీకి వార్షిక వినియోగం 1,059 (మిలియన్ యూనిట్లు)
Comments
Please login to add a commentAdd a comment