సాక్షి, అమరావతి: రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఏడాది కాలంలోనే 63,068 కొత్త కనెక్షన్లు జారీ చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి ఆన్‌లైన్‌లోనే మంజూరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఫలితంగా రైతులు వ్యవసాయ కనెక్షన్ కోసం రోజులు తరబడి అధికారుల చుట్టూ తిరిగే దుస్థితి తప్పింది. 2019 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 18,07,100 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 18,70,168కి పెరిగింది. వీటన్నింటికీ నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
రబీ కల్లా అన్నీ ఫీడర్లలో...
రాష్ట్రంలో ప్రస్తుతం 6,663 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లున్నాయి. వీటిల్లో 5,383 ఫీడర్లు మాత్రమే (81 శాతం) 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయగలిగే స్థాయిలో ఉన్నాయి. మిగతా ఫీడర్లను కూడా బలోపేతం చేసి విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం అదనంగా రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 426.88 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, 64 కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. రబీ నాటికల్లా వందశాతం ఫీడర్లలో 9 గంటల వ్యవసాయ విద్యుత్ అందించాలని ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది.
మరికొన్ని కనెక్షన్లు!
నాణ్యమైన విద్యుత్ అందుతుండడంతో వ్యవసాయ కనెక్షన్లకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్లపై అనధికారిక కనెక్షన్లు తొలగించి కొత్తవి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు లైన్లు, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు సాధ్యమైనంత వరకు కనెక్షన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ఇంధనశాఖ అధికారులు వివరించారు.
రైతుల కోసం ఎంతైనా
‘రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొత్త కనెక్షన్ల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి’
– శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment