లైన్‌మెన్‌పై ఏఈకి ఫిర్యాదు చేసిన రైతు
ఆత్మకూర్(ఎస్): లంచం ఇవ్వలేదని తన పొలానికి విద్యుత్ లైన్‌మెన్ కరెంట్ లైన్ కట్ చేశాడని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతు బొల్లం వీరమల్లు ఆరోపించాడు.
కందగట్ల, తిమ్మాపురం గ్రామాల మధ్య గల సోలార్ కంపెనీ సమీపంలో తనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు తన వ్యవసాయ భూమి వద్ద రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారడంతో సరిచేయాలని గ్రామ లైన్‌మెన్ వెంకటయ్యను కోరినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన సిబ్బందితో సహా లైన్‌మెన్ వెంకటయ్య వచ్చి విద్యుత్ స్తంభాలను సరిచేసి రూ.10వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాధిత రైతు ఆరోపించాడు.
అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో మరుసటి రోజు ఇవ్వాలని గడువు పెట్టాడని, అప్పటికీ ఇవ్వకపోవడంతో ఈ నెల 15వ తేదీన తన పొలానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శుక్రవారం ఏఈ గౌతమ్‌కు రాతపూర్వకకంగా ఫిర్యాదు చేసినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ విషయమై ఆత్మకూర్(ఎస్) మండల ఏఈ గౌతమ్‌ను వివరణ కోరగా.. విచారణ చేసి లైన్‌మెన్‌పై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యుత్ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు ఇవ్వవద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి చెల్లించే లావాదేవీలను డీడీల రూపంలో మాత్రమే తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment