Bribery Allegations
-
లంచం ఇవ్వలేదని విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆత్మకూర్(ఎస్): లంచం ఇవ్వలేదని తన పొలానికి విద్యుత్ లైన్మెన్ కరెంట్ లైన్ కట్ చేశాడని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతు బొల్లం వీరమల్లు ఆరోపించాడు. కందగట్ల, తిమ్మాపురం గ్రామాల మధ్య గల సోలార్ కంపెనీ సమీపంలో తనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు తన వ్యవసాయ భూమి వద్ద రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారడంతో సరిచేయాలని గ్రామ లైన్మెన్ వెంకటయ్యను కోరినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన సిబ్బందితో సహా లైన్మెన్ వెంకటయ్య వచ్చి విద్యుత్ స్తంభాలను సరిచేసి రూ.10వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాధిత రైతు ఆరోపించాడు. అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో మరుసటి రోజు ఇవ్వాలని గడువు పెట్టాడని, అప్పటికీ ఇవ్వకపోవడంతో ఈ నెల 15వ తేదీన తన పొలానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శుక్రవారం ఏఈ గౌతమ్‌కు రాతపూర్వకకంగా ఫిర్యాదు చేసినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ విషయమై ఆత్మకూర్(ఎస్) మండల ఏఈ గౌతమ్‌ను వివరణ కోరగా.. విచారణ చేసి లైన్మెన్పై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యుత్ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు ఇవ్వవద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి చెల్లించే లావాదేవీలను డీడీల రూపంలో మాత్రమే తీసుకుంటామని వెల్లడించారు. -
ప్రాజెక్టుల ఏర్పాటుకు లంచం.. స్పందించిన అదానీ గ్రూప్
భారత్‌లో ప్రాజెక్టుల ఏర్పాటుకై అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచం ఇవ్వజూపారంటూ వస్తున్న ఆరోపణల విషయంలో అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ స్పందించింది. అలా వస్తున్న కథనాలు, వార్తలు పూర్తిగా అవాస్తవమని గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. ఆ ఆరోపణలకు సంబంధించి అమెరికా న్యాయశాఖ నుంచి ఎలాంటి నోటీసు అందలేదని సంస్థ తన ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ దర్యాప్తు గురించి తమకు తెలియదని, భారత్‌తో సహా ఇతర దేశాల్లోని అవినీతి నిరోధక చట్టాలకు తాము కట్టుబడి ఉన్నామని గ్రూప్ పేర్కొంది. భారత్‌లో ఒక ఇంధన ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు, భారత అధికారులకు అదానీ గ్రూప్ లేదా ఆ గ్రూప్‌లోని వ్యక్తులు ఎవరైనా లంచం ఇవ్వజూపారా లేదా అన్నది తెలుసుకోవడానికి అమెరికా దర్యాప్తు చేపట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ కథనంలో పేర్కొంది. అమెరికా మార్కెట్లో అదానీ గ్రూప్ ట్రేడ్ కానప్పటికీ అమెరికన్ల పెట్టుబడులు ఆ సంస్థలో ఉన్న నేపథ్యంలో యూఎస్ ప్రభుత్వం దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి ఈ నేపథ్యంలో ఆ దేశ అటార్నీ జనరల్ ఆఫీస్, జస్టిస్ డిపార్ట్మెంట్కు చెందిన ఫ్రాడ్ యూనిట్ ఈ విచారణ జరుపుతున్నట్లు వార్తా కథనం ద్వారా తెలిసింది. దేశీయ ఎనర్జీ కంపెనీ అజ్యూర్ పవర్ గ్లోబల్‌పైనా దృష్టిపెట్టినట్లు సమాచారం. -
సెన్సార్ బోర్డుకు లంచం.. విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు!
కోలీవుడ్ స్టార్, హీరో విశాల్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. ముంబై సెన్సార్ బోర్డుపై కేసు నమోదు చేసింది. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ హక్కుల కోసం ముంబయిలోని సెన్సార్ బోర్డుకు(సీబీఎఫ్సీ) రూ.6.5 లక్షలు లంచం చెల్లించినట్లు ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. విశాల్ ఆరోపణల ఆధారంగా.. ముగ్గురు మధ్యవర్తులతో పాటు ముంబై సీబీఎఫ్‌సీకి చెందిన సభ్యులు, మరికొందరిపైనా విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: విశాల్ ఆరోపణతో సంచలన నిర్ణయం తీసుకున్న సెన్సార్ బోర్డు) అసలేం జరిగిందంటే.. 'నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కి రూ. 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన 2 లావాదేవీలు చేశాను. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, రెండు సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. దీనిపై చర్యలు తీసుకోండి' అంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే! #Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l — Vishal (@VishalKOfficial) September 28, 2023 -
‘నేను అవినీతి ఉద్యోగిని కాను’.. అని బోర్డు పెట్టి..
బనశంకరి(కర్ణాటక): రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పే సీఎం అభియాన్ పేరుతో అవినీతి ఆరోపణలు గుప్పించడంతో బొమ్మై ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది. పేసీఎంకు సమాధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ వ్యతిరేక ప్రచారోత్సవం చేపట్టనుంది. నాకు ఎవరూ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అవినీతి ఉద్యోగి/ అధికారిని కాదు అనే నినాదంతో అక్టోబరు 2 నుంచి 20వ తేదీ వరకు అభియానను నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పై నినాదంతో అన్ని ఆఫీసుల్లో బోర్డులు పెట్టాలని తెలిపారు. కాగా ఇటీవల యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోన్ని ముద్రించిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మార్చుకుంది. ఈ ఫోటోని క్యూఆర్ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్ల లా ప్రింట్రింగ్ చేసి బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్ ప్రారంభిన సంగతి తెలిసందే. చదవండి: కాంగ్రెస్ 'పేసీఎం' పోస్టర్లో నటుడి ఫోటో.. కోర్టుకెళ్తానని వార్నింగ్ -
ఏసీబీకి చిక్కిన కాటారం తహసీల్దార్
సాక్షి, కాటారం: భూమి ఆన్లైన్ నమోదు, పట్టా పాస్పు స్తకం కోసం ఓ రైతునుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ మహిళా తహసీల్దార్ ఏసీబీకి పట్టుబ డ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం లో గురువారం జరిగింది. కాటారం మండలం సుంద రాజ్‌పేటకు చెందిన ఐత హరికృష్ణ అనే దివ్యాం గుడికి కొత్తపల్లి శివారులో ని సర్వేనంబర్ 3లో 4 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. ఈ భూమి గతంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆన్లైన్ ధరణి పోర్టల్‌లో నమోదు చేసి కొత్త పట్టా పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ మేడిపల్లి సునీతకు విన్నవించుకున్నాడు. భూమి వివాదంలో ఉన్నందున ఆన్లైన్ నమోదు, పట్టాపాస్ పుస్తకం ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని తహసీ ల్దార్ డిమాండ్ చేశారు. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదిరింది. హరికృష్ణ 50 వేలు ఇచ్చినా మిగతా డబ్బు ఇస్తేనే పాస్‌పుస్తకం ఇస్తానని సునీత చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం గురువారం సాయంత్రం తహసీల్దార్‌కు తన కార్యాలయంలో రూ.2లక్షలు అందజేయగా.. ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సునీతను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
నడి రోడ్డు మీద లంచావతారం..
సాక్షి, తాడేపల్లిగూడెం: నడిరోడ్డుపై ఆర్టీఏ ఉద్యోగి లంచావతారం ఎత్తిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో చోటుచేసుకుంది. వాహనాదారుల నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మృత్యుంజయరాజు డబ్బులు వసూలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో దీనిపై వెంటనే స్పందించారు. తాడేపల్లి గూడెం బైపాస్ రోడ్డుపై అధికారిక యూనిఫామ్‌లో లేకుండా వాహన డ్రైవర్ల నుండి లంచాలు వసూలు చేస్తున్నా ఎంవీఐ మృత్యుంజయరాజును సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ సీతా రామాంజనేయులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: (దివ్య హత్య కేసు: దిశా పోలీస్ స్టేషన్‌కు నాగేంద్ర) -
ఆ లంచం కేసుతో నాకు సంబంధం లేదు
సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదన్నారు. కీసర తహసీల్దార్ విచారణ సమయంలో తనపై తప్పుడు ప్రచారం కొనసాగటంపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. ‘మ్యుటేషన్ ప్రక్రియ తహసీల్దార్ పరిధిలోనే ఉంటుంది. కలెక్టర్ వద్దకు కనీసం ఫైలు కూడా రాదు.. ఈ కేసులో నా పాత్ర ఉందనే ఆరోపణలు మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే న్యాయపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు సమస్యల తో వచ్చినప్పుడు విచారణ చేసి, నిబంధనల ప్రకారముంటేనే వాటిని పరిష్క రించాలని చెబుతాను. రోజూ విజిటింగ్ సమయంలో కలసిన ప్రతి ఆర్జీదారుకు సంబంధించిన విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. ఆ అధి కారులూ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది’అని అన్నారు. -
పాస్ కావాలంటే.. పైసలిస్తే చాలు
మోర్తాడ్ : పారిశ్రామిక రంగానికి సంబంధించి వివిధ కోర్సుల్లో శిక్షణనిచ్చేందుకు కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌లో నెలకొల్పిన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు హాజరు శాతం తక్కువగా ఉంటే పరీక్షలు రాయనివ్వమనే నెపంతో కొందరు ఫ్యాకల్టీ(శిక్షకులు) అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షల్లో అభ్యర్థులు పాస్ కావాలంటే తాము వేసే మార్కులకు ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిందే అని దబాయించి మరీ వసూళ్లకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీఐ కోర్సులలో శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్లు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకా శం కలుగడంతో పాటు స్వయం ఉపాధికి బ్యాం కుల నుంచి రుణం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు ఐటీఐ సర్టిఫికెట్లు ఉంటే వేతనాలు ఎక్కువ లభించే అవకాశం ఉంది. పైన పేర్కొన్న అంశాల ను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభ్యర్థులు బషీరాబాద్ ఐటీఐలో అడ్మిషన్లు తీసుకున్నారు. మూడు జిల్లాలకు చెందినవారు.. ఇక్కడ కోబా, డ్రెస్ మేకింగ్, ఫిట్టర్, డీజిల్ మెకానిజం, ఎలక్ట్రిషియన్, సివిల్, వెల్డర్ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 300ల మంది ఈ కోర్సులలో ప్రవేశం పొంది శిక్షణ పొం దుతున్నారు. ఇటీవల సెమిస్టర్ పరీక్షలు ప్రారం భం కాగా మరి కొన్ని రోజుల వరకు సాగనున్నా యి. విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు కీలకం కావ డం అక్రమార్కులకు వరంగా మారింది. శిక్షణ సమయంలో తరగతులకు హాజరుకాని విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అవకాశం లేదు. అయితే కొంత మంది అభ్యర్థులు అడ్మిషన్లు తీసుకున్నా తమ కుటుంబాల ఆర్థిక స్థితి బాగా లేక ఏదో ఒక పని చేసుకుంటూ పరీక్షలకు మాత్ర మే హాజరవుతున్నారు. మరి కొందరు మాత్రం తాము అడ్మిషన్ పొందిన కోర్సులకు సంబంధించి తమ గ్రామాల్లోనే పని చేసుకుంటూ పరీక్షలకు హాజరు కావాలని భావిస్తున్నారు. కోబా, డ్రెస్ మేకింగ్, సివిల్ రంగాల్లో శిక్షణ కోసం అడ్మిషన్లు తీసుకున్న వారు మాత్రం రెగ్యులర్‌గా వస్తుంటా రు. ఇది ఇలా ఉండగా కొన్ని కోర్సులకు సంబంధించి థియరీ మాత్రమే చెబుతుండగా ప్రాక్టికల్స్ కు సంబంధించి పరికరాలు లేక పోవడంతో అభ్యర్థులు తరగతులకు హాజరుకాకుండా ఉన్నారు. హాజరుశాతం వంక చూపుతూ.. అభ్యర్థుల అవసరాన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు హాజరుశాతం వంక చూపుతూ పరీక్షలు రాసేందుకు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో కొంత మంది అభ్యర్థులు హాజరు శాతం కోసం రూ.వెయ్యి నుంచి రూ.1,500ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే సెమిస్టర్ పరీక్షల్లో పాస్ కావడానికి అవసరమైన మార్కులు వేయాలన్నా, మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి అక్రమార్కులు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలకే కాకుండా ప్రాక్టికల్స్ పరీక్షల్లోను ఉత్తీర్ణత చేసేందుకు కూడా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో విద్యార్థి నుంచి రూ.3వేల వరకు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏటా అక్రమార్కులు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో దండుకుంటూనే ఉన్నారు. తాము అడిగినంత ఇచ్చుకోనివారిని ఇబ్బందులకు గురి చేసినట్లు పలువురు ఆరోపించారు. అక్రమార్కులను ప్రశ్నించే ధైర్యం చేస్తే తమను టార్గెట్ చేస్తారని అభ్యర్థులు వాపోతున్నారు. బషీరాబాద్ ఐటీఐలో కొన్నేళ్ల నుంచి అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసినవారు లేరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బషీరాబాద్ ఐటీఐలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని పలువురు కోరుతున్నారు. -
చెయ్యి తడిపితే.. లైను కదిలే..!
సాక్షి, ఆదిలాబాద్: కరెంటు అధికారుల లీలలు చెప్పుకుంటూ పోతే ఇప్పుడే పూర్తయ్యేవికావు.. ప్రతీ పని వెనుక వేలు, లక్షల రూపాయల స్వార్థం, అక్రమాలు కనిపించడం సర్వసాధారణం. పైసలిస్తే పనేదైనా చేసేస్తారు. అదే పైసలివ్వకపోతే ఏడాది కాదు, దశాబ్దాలు దాటినా పని పూర్తికాదు. దానికి ఉదాహరణ లేకపోలేదు. ఆదిలాబాద్ పట్టణంలోని కోర్టు ఎదురుగా విద్యానగర్‌కు వెళ్లే దారిలో 30 ఇళ్లపై నుంచి 33కేవీ లైన్ వెళ్తుంది. దీనిని మార్చాలని వందలసార్లు ఆ కాలనీవాసులు అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా దాన్ని మార్చే సాహసం ఏ విద్యుత్ శాఖ అధికారి చేపట్టకపోవడం గమనార్హం. అదేమంటే వారి చేతిని బలంగా తడిపితేనే ఆ లైన్ కదిలే పరిస్థితి ఉంది. లేనిపక్షంలో ప్రజల ప్రాణాలు పోయినా వారికి పట్టింపులేదు. ఆదిలాబాద్ పట్టణమనే కాకుండా జిల్లాలో మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ట్రాన్స్ఫార్మర్ మార్చాలన్నా, లైన్‌ను కొంత దూరం జరపాలని ప్రజలు మొర పెట్టుకున్నా వారు స్పందించిన దాఖలాలు లేవు. అదే ఆమ్యామ్యాలు ఇస్తే పని ఎలాగైనా చేసేస్తారు. రాంనగర్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 33 కేవీ లైన్‌ను ఒక సైడ్ ఆర్మ్ మీద బిగించారంటే వీరి అత్యాశ ఎంతటి పరిస్థితికి దారి తీస్తుందనేది తెలుస్తోంది. విద్యుత్ సంస్థ నియమాల ప్రకారం ఇలాంటి పెద్ద లైన్‌ను ఒక సైడ్ ఆర్మ్ మీద ఉంచడమనేది సాహసంతో కూడుకున్న పని అని అధికారులే చెబుతారు. అయినా చేసేది కూడా వారే. ఎన్నో లీలలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల అవినీతి లీలలకు కొదువలేదు. వాణిజ్య సముదాయాలకు సంబంధించి ఇలాంటి లైన్లు మార్చేందుకు రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. మావల వద్ద 33 కేవీ లైన్ మార్చేందుకు సమీపంలోని వాణిజ్య సముదాయాలు లక్షల రూపాయలను అధికారులకు ముట్టజెప్పడంతోనే ఆర్అండ్బీ అధికారులను బోల్తా కొట్టించి టెక్నికల్ సాంక్షన్‌లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టారంటే వీరంతటి ఘనులో ఇట్టే తెలిసిపోతోంది. ఇలాంటి అక్రమ పనులను కొన్ని రోజుల్లోనే పూర్తి చేస్తారు. అదే మామూలు వ్యక్తుల పనులైతే రోజులు, నెలలు, సంవత్సరాలు దాటినా పూర్తికావు. ఏ పనికైనా చేతి తడపనిదే పని జరగదనేది విద్యుత్ శాఖలో జగమెరిగిన సత్యం. ఈ పనులన్నింటిని నామినేషన్ పద్ధతిలోనే అధికారులు దగ్గరుండి చేయిస్తుండడం గమనార్హం. ఉన్నతాధికారుల హస్తం లేకుండా ఇవి జరుగుతాయనుకుంటే పొరపాటే. వారి ఆదేశాలకు అనుగుణంగానే పనులు జరుగుతాయనే దానికి మావల సంఘటనే నిదర్శనం. తనకు తెలియకుండానే ఈ పనులు జరిగాయని ఏఈ విచారణ అధికారులకు తెలిపారంటే ఉన్నతాధికారులు ఎంత ఘనాపాఠిలో తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా కొంతమంది ఉన్నతాధికారులు ఇక్కడే పాతుకుపోయారు. దీంతో వారి హస్తం లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి ఉంది. ఆరేళ్ల కిందట ఆదిలాబాద్‌లోనే 6 కిలోమీటర్ల కండక్టర్ రూ.10లక్షల విలువైంది మాయమైంది. శాఖ అధికారులే దీన్ని అక్రమ పనులకు వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతూ అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల దుబ్బగూడ వద్ద అనధికారికంగా శ్మశానవాటికకు స్తంభాలు వేసి కండక్టర్ వేయడం ఇదే కోవలోకి వస్తుంది. ఇలా ప్రతీ అంశంలో విద్యుత్ శాఖలో అవినీతి చోటుచేసుకుంటుంది. -
చైనాకు షాక్.. భారీ ప్రాజెక్టు రద్దు
ఢాకా : పరాయి దేశాల్లో భారీ ప్రాజెక్టుల ముసుగులో చైనా సాగిస్తోన్న అవినీతి కలాపం బట్టబయలైంది. ఉన్నతాధికారులకు విచ్చలవిడిగా లంచాలు పంచుతూ నిధులను దారిమళ్లించిన వ్యవహారం చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో చైనా ప్రఖ్యాత కంపెనీలతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పందాలను రద్దుచేసుకోవడం సంచలనంగా మారింది. ‘ఢాకా-సిల్హట్ హైవే’లో అక్రమాలు : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, సిల్హట్ పట్టణాలమధ్య కొత్తగా హైవేను నిర్మిస్తున్నారు. బంగ్లాతో ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా చైనా ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చింది. చైనా ప్రభుత్వానికి అనుబంధంగా నడిచే చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీయే హైవే నిర్మాణ పనులను చేపట్టింది. కాగా, ఈ ప్రాజెక్టు నిధులను ఇతర అవసరాలకు వినియోగించాలని చైనీస్ కంపెనీ భావించింది. అందుకు బాంగ్లా అధికారుల అనుమతి కూడా తప్పనిసరి కావడంతో లంచాల పంపకానికి తెరలేపారు. ‘‘బంగ్లా ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్ శాఖ చీఫ్‌కు చైనీస్ కంపెనీవాళ్లు భారీగా లంచం ఇచ్చినట్లు తేలింది. ఇది దేశాలమధ్య కుదిరిన నిబంధనలకు విరుద్ధం. కాబట్టి చైనా కంపెనీని ప్రభుత్వం నిషేధించింది. మిగిలిపోయిన పనులు ఎవరు చెయ్యాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి అమా ముహిత్ మీడియాకు చెప్పారు. -
డబ్బులు తీసుకున్నట్లు గుర్తులేదు: మాజీ సీఎం
సహారా డైరీల అంశంపై తమ సొంత పార్టీ చేసిన ట్వీట్లతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇరుకున పడ్డారు. ఎవరెవరికి ఎంతెంత చెల్లింపులు ఉన్నాయోనన్న మొత్తం జాబితా పార్టీ ట్విట్టర్లో ప్రత్యక్షమైంది. దీనిపై ఇప్పుడు మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేనని షీలా అన్నారు. అసలు డబ్బులు తీసుకున్నట్లే తనకు గుర్తులేదని కూడా ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌కు వ్యతిరేకంగా తాను ఏమీ మాట్లాడేది లేదని, తన పేరును ఇందులోకి లాగొద్దని అన్నారు. అసలు ఈ వ్యవహారం గురించి తనకు ఏమీ గుర్తుకు రావడం లేదని కూడా షీలా దీక్షిత్ తెలిపారు. ''నాకు దీంతో సంబంధం లేదు. ఏ డైరీ, ఎవరి డైరీ? అందులో ఎవరు ఏం రాశారో నాకు తెలీదు'' అని వ్యాఖ్యానించారు. ''ఎవరిపేర్లు రాశారో నాకేం తెలుసు? అసలు దీని గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. నా పేరును ఇందులోకి లాగొద్దు. నేను కెమెరా ముందు ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదు'' అని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సహారా గ్రూపు రూ. 40 కోట్లు ముట్టజెప్పిందని ఇంతకుముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జాబితాను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో పెట్టింది. అందులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు కూడా ఉంది. ఆమెకు 2013 సెప్టెంబర్ 23వ తేదీన కోటి రూపాయలు చెల్లించినట్లు అందులో ఉంది. ప్రధానమంత్రిని ఇరుకున పెట్టబోయి తమ సొంత పార్టీ సభ్యులనే కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. చదవండి: (సహార పత్రాల్లో మోదీతోపాటు వీరి పేర్లు కూడా...) -
30 వేలు ఇచ్చుకో.. రెన్యువల్ పుచ్చుకో!
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రైవేటు కాలేజీల రెన్యువల్స్‌లో ముడుపుల దందాకు తెరలేచింది. మంత్రి శైలజానాథ్ పేరుతో ఆయన అనుచరులే వసూళ్లకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ఇవ్వనిదే అనుమతి రాదని, తాము ఓకే అంటే మంత్రి సంతకం చేస్తారని చెబుతూ ఒక్కో కాలేజీ యాజమాన్యం నుంచి రెన్యువల్‌కు రూ. 30 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధమంగా రూ. 30 వేలు ఇవ్వాలని, ఎన్ని లోపాలుంటే అంత ఎక్కువ మొత్తం చెల్లించాలంటూ వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 650 వరకున్న ప్రైవేటు డీఎడ్ కాలేజీల రెన్యువల్స్ వ్యవహారంలో రూ. 20 కోట్లు దండుకునే లక్ష్యంతో మంత్రి అనుచరులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ తతంగం మంత్రికి తెలుసా? ఆయనకు తెలియకుండా మంత్రి అనుచరులే దందాకు దిగారా? అనే విషయంలో స్పష్టత లేదు. మొత్తానికి మంత్రి పేరుతో జరుగుతున్న ఈ తతంగంపై యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముడుపుల కోసం కాలేజీ వారీ ఫైళ్లు.. కాలేజీల రెన్యువల్స్ కోసం ఏకమొత్తంగా ఒకేసారి 422 కాలేజీలకు ఒక ఫైలు, మరో 228 కాలేజీలకు మరో ఫైలును విద్యాశాఖ మంత్రి కార్యాలయానికి జూలైలో పంపించింది. ఇలా ఏకమొత్తంగా వచ్చిన ఫైలులోని కాలేజీలకు రెన్యువల్స్ ఇవ్వడం కుదర దని పేర్కొంటూ ఒక్కో కాలేజీకి ఒక్కో ఫైలు వేర్వేరుగా (ఇండివిడ్యువల్‌గా) పంపించాలని ఆదేశించి మరీ ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కార్యాలయం ఆదేశాలతో విద్యాశాఖ వేర్వేరు ఫైళ్లను పంపించాకే ముడుపులు ముట్టజెప్పిన ఒక్కో కాలేజీకి సంబంధించి వేర్వేరు ఉత్తర్వులు జారీ అవుతుండటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. మంత్రి సచివాలయానికి రాకపోయినా ముడుపులు అందిన కాలేజీల ఫైళ్లను మంత్రి వద్దకు తీసుకెళ్లి మరీ సంతకాలు చేయించి వసూళ్లు చేస్తున్నట్లు కాలేజీల యాజమాన్య ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముడుపులు అందకపోతే ఏదో ఒక పేపరు మిస్సింగ్... నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్న కాలేజీల రెన్యువల్ ఫైళ్లు కూడా తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి అనుచరులకు ముడుపులు ఇవ్వకపోతే ఆ కాలేజీకి సంబంధించిన ఫైలులోని ఏదో ఒక పేపరును తొలగించి... తగిన పత్రాలు లేవనే సాకుతో ఆ ఫైళ్లను పక్కనబెట్టి ఇబ్బందులపాలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముడుపులు ముట్టిన కాలేజీలకు సంబంధించిన ఫైళ్లను మాత్రమే క్లియర్ చేస్తూ, ముడుపులు ఇవ్వని కాలేజీల ఫైళ్లను పక్కనపడేస్తూ యాజ మాన్యాల నుంచి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.