![no bribes were given to govt officials to secure contracts said Adani Group cfo Jugeshinder Singh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/30/adani01.jpg.webp?itok=Ykpt-lDG)
తప్పుడు పద్ధతిలో కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషీందర్ సింగ్ అన్నారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో ఎవరికైనా నగదు చెల్లిస్తే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో ఉన్న తనకు కచ్చితంగా తెలుస్తుందన్నారు. ఈమేరకు విలేకరుల సమావేశంలో ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు.
‘అదానీ గ్రూప్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలు లేవు. గ్రూప్ అధికారులు కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదు. ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో నగదు చెల్లిస్తే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో ఉన్న నాకు కచ్చితంగా సమాచారం ఉంటుంది. యూఎస్‌లో చేసిన ఆరోపణలు న్యాయపరమైన అధికారాన్ని ఉపయోగించడమే తప్పా ఇది గ్రూప్‌పై దాడి కాదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు నిబంధనల ప్రకారం సరైన విధంగా స్పందిస్తారు. ఆయా ఆరోపణలను సమర్థంగా తిప్పికొడుతారు. ప్రస్తుతం 30 నెలల రుణ వాయిదాలు తిరిగి చెల్లించే సామర్థ్యం అదానీ గ్రూప్ కలిగి ఉంది. ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా 12 నెలల కంటే ఎక్కువగానే రుణా వాయిదాలు చెల్లించే నగదును ముందుగానే సిద్ధంగా ఉంటుంది’ అని తెలిపారు.
ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు
భారత్‌లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఇటీవల అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment