డబ్బులు తీసుకున్నట్లు గుర్తులేదు: మాజీ సీఎం
డబ్బులు తీసుకున్నట్లు గుర్తులేదు: మాజీ సీఎం
Published Mon, Dec 26 2016 2:23 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
సహారా డైరీల అంశంపై తమ సొంత పార్టీ చేసిన ట్వీట్లతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇరుకున పడ్డారు. ఎవరెవరికి ఎంతెంత చెల్లింపులు ఉన్నాయోనన్న మొత్తం జాబితా పార్టీ ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది. దీనిపై ఇప్పుడు మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేనని షీలా అన్నారు. అసలు డబ్బులు తీసుకున్నట్లే తనకు గుర్తులేదని కూడా ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌కు వ్యతిరేకంగా తాను ఏమీ మాట్లాడేది లేదని, తన పేరును ఇందులోకి లాగొద్దని అన్నారు. అసలు ఈ వ్యవహారం గురించి తనకు ఏమీ గుర్తుకు రావడం లేదని కూడా షీలా దీక్షిత్ తెలిపారు. ''నాకు దీంతో సంబంధం లేదు. ఏ డైరీ, ఎవరి డైరీ? అందులో ఎవరు ఏం రాశారో నాకు తెలీదు'' అని వ్యాఖ్యానించారు. ''ఎవరిపేర్లు రాశారో నాకేం తెలుసు? అసలు దీని గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. నా పేరును ఇందులోకి లాగొద్దు. నేను కెమెరా ముందు ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదు'' అని ఆమె అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సహారా గ్రూపు రూ. 40 కోట్లు ముట్టజెప్పిందని ఇంతకుముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జాబితాను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్‌లో పెట్టింది. అందులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు కూడా ఉంది. ఆమెకు 2013 సెప్టెంబర్ 23వ తేదీన కోటి రూపాయలు చెల్లించినట్లు అందులో ఉంది. ప్రధానమంత్రిని ఇరుకున పెట్టబోయి తమ సొంత పార్టీ సభ్యులనే కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
Advertisement
Advertisement